నాయక నిమజ్జనం

0
242
మనస్సాక్షి  – 1158
”ఏంటోనోయ్‌.. లైఫు బొత్తిగా రొటీనయి పోయిందనుకో” అన్నాడు గిరీశం నడుస్తూ. దాంతో ఆ పక్కనే నడుస్తున్న వెంకటేశం కంగారుపడి ”అంటే కొంపదీసి పెళ్ళీ గిళ్ళీ చేసుకుందావని ముచ్చటపడుతున్నారా?” అన్నాడు. గిరీశం తల అడ్డంగా ఊపి ”అదేం లేదోయ్‌.. తెల్లారి లేస్తే నీకు పాఠాలు చెప్పడం, ఈ చుట్ట కాల్చుకోడం తప్ప యింకో పని కనిపించడంలేదు. కొంతకాలం ఎక్కడ కయినా తిరిగొస్తే ఎలా ఉంటుందా అని” అన్నాడు. దాంతో వెంకటేశం హుషారుగా ”భేషుగ్గా ఉంటుంది గురూగారూ.. ఎంతయినా మీ తాత గిరీశం గారు కూడా అలా తిరిగే కదా అంత వాళ్ళయిపోయింది. యింతకీ ఎక్కడికి వెళదామంటారు? అన్నాడు. దాంతో గిరీశం కొంచెం ఆలోచించి ”ఎక్కడికో ఎందుకూ.. శుభ్రంగా మనూరే పోదాం. ఎలాగా నాల్రోజుల్లో వినాయక చవితి ఉంది కదా” అన్నాడు. వెంకటేశా నికి యిదేదో బాగానే ఉందనిపించింది. దాంతో ఆరోజు సాయం త్రమే యిద్దరూ ఎర్రబస్సెక్కి గంగలకుర్రు బయలుదేరారు.
——-
ఉదయాన్నే మార్నింగ్‌ వాక్‌కి వెళ్ళడం గిరీశానికి అలవాటు. అదెక్కడున్నా తప్పదు. అందుకే గంగలకుర్రులో కూడా పొద్దున్నే నడుచుకుంటూ ఊళ్ళోకి బయల్దేరాడు. అలా నడుచుకుంటూ ఊరి చివర చెరువు దాకా వెళ్ళిపోయాడు. ఆపాటికి కొద్దిగా అల సటగా అనిపించి ఆ చెరువుగట్టునే ఉన్న సిమెంటు బల్ల మీద సెటిలయ్యాడు. యింతలో ఓ విశేషం జరిగింది. ఆ చెరువు గట్టునే మట్టితో బొమ్మలవీ చేసే తలుపులు యిల్లుంది. గిరీశం ఓ చుట్ట అంటించుకుని చుట్టూ పరిసరాలవీ పరిశీలించే పనిలో పడ్డాడు. యింతలో యిద్దరు కుర్రాళ్ళు  మట్టి తెచ్చి అక్కడో పెద్దపోగులా పెట్టారు. వారిలో ఓ కుర్రాడయితే అందులో రాళ్ళలాంటివి ఏరు తుంటే యింకో కుర్రాడు నీళ్ళు తెచ్చి ఆ మట్టిలోపోయడం మొద లెట్టాడు. వాళ్ళు చేస్తున్న పనిని గిరీశం ఆసక్తిగా గమనిస్తున్నాడు. యింతలో ఆ కుర్రాళ్ళు ఆ మట్టిలోకి ఎక్కి గట్టిగా తొక్కడం మొదలెట్టారు. దాంతో ఆ మట్టి కాస్తా మెత్తగా ముద్దలా అయిపోతోంది. యింతలోనే ఎక్కడ్నుంచో అక్కడికి తలుపులు వచ్చాడు. గిరీశాన్ని చూడగానే దగ్గరకొచ్చి ”దండాలు బాబయ్యా.. ఎప్పుడొచ్చారు?” అన్నాడు. దాంతో గిరీశం ”నిన్ననే వచ్చాలే.. అవునూ.. వీళ్ళెవరూ?” అన్నాడు. దానికి తలుపులు ”నా కొడు కుల్లే బాబయ్యా.. ఇనాయకుడి బొమ్మలు తయారు చేయడానికి మట్టి కలుపుతున్నారు” అన్నాడు. అప్పటికే యిద్దరూ కసాపిసా తొక్కెయ్యడంతో ఆ మట్టేదో కావలసినట్టుగా తయారయింది. దాంతో తలుపులు మాటలాపేసి వెళ్ళి ఆ మట్టితో చకచకా వినాయకుడి బొమ్మలు చేయడం మొదలెట్టాడు. అలా చేసిన మట్టి బొమ్మల్ని కుర్రాళ్ళిద్దరూ కిందపెట్టి ఆరబెడుతున్నారు. అలా చూస్తుండగానే యిరవై బొమ్మలు చేసేశారు. గిరీశం యిదంతా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. యింతలో గిరీశం ”అయితే యివన్నీ రాబోయే  చవితికోసమేనన్నమాట” అన్నాడు. తలుపులు తలూపి ”అవును బాబయ్యా.. ఈ మధ్యన అమ్మకాలు కూడా శానా పెరిగాయి. ఈ సంవత్సరం మనూరి గణేష్‌ కమిటీ వాళ్ళు యిరవై అడుగుల మట్టి వినాయకుడి బొమ్మ చేయమని ఆర్డరిచ్చారు. అదీ మేమే చేశాం. అదిగో.. అదే” అంటూ కొద్దిగా అవతలగా చెట్ట మధ్య నిలబెట్టి  ఉంచిన వినాయకుడి విగ్రహం చూపించాడు. దాంతో గిరీశం తలుపుల్ని మెచ్చుకుని పైకి లేచాడు.
——-
వినాయక చవితి వచ్చేసింది. ఆరోజు ఊరంతా కళకళలాడి పోతోంది. యిక గణేష్‌ కమిటీ వాళ్ళు నిలబెట్టిన యిరవై అడు గుల ఎత్తున్న వినాయకుడి బొమ్మయితే మరీ కళకళలాడి పోతుంది. ఆరోజు భక్తుల హడావిడి మరీ ఎక్కువుంటే తర్వాత తొమ్మిది రోజులూ  తక్కువగానే ఉంది. యిక గిరీశం అయితే వెంకటేశాన్ని వెంటబెట్టు కుని ఊరంతా తిరిగే పనిలో పడ్డాడు. అయితే నవరాత్రులు మొదలయిన రెండోరోజు ఓ విశేషం జరిగింది. ఆరోజు ఉదయం గిరీశం, వెంకటేశం మార్నింగ్‌ వాక్‌ నుంచి వస్తూ దారిలో గణేష్‌ కమిటీ వాళ్ళు నిలబెట్టిన యిరవై అడు గుల వినాయకుడి బొమ్మ దగ్గర ఆగారు. ఆపాటికి పంతులుగారు ఆ విగ్రహానికి పూజలు చేస్తున్నారు. యింతలో గిరీశం గబగబా అటువైపుకి నడిచాడు. దాంతో పంతులు కంగారుగా ”ఆగండి.. దగ్గరికి రాకూడదు. అనుంటా.. ఉండండి” అన్నాడు. యిదేదో గిరీశాని కయితే  బొత్తిగా అవమానంగా అనిపించింది. యింతలో వెంక టేశం ”యిదిగో పంతులుగారూ.. మేమూ బ్రామ్మర్లమే..” అన్నాడు.  అయినా పంతులు ఒప్పుకోకుండా  ”అయినా వీల్లేదు. యిక్కడంతా గణపతికి నియమ నిష్టలతో పూజలు జరుగుతున్నాయి. మీరు బయట ఎక్కడెక్కడో తిరిగి రావచ్చు. యింతలా పూజలందు కుంటున్న గణపతి దగ్గరకెళ్ళడానికి వీల్లేదు” అన్నాడు. దాంతో గురు ష్యులిద్దరూ దూరాన్నుంచే దణ్ణం పెట్టుకుని వెనుదిరిగాడు.
——-
నిమజ్జనం రోజు.. ఆరోజు ఊరంతా ఒకటే హడావిడిగా ఉంది. ఉదయం పది కావస్తుండగా గణేష్‌ కమిటీ వాళ్ళు వినాయకుడి విగ్రహాన్ని  నిమజ్జనం కోసం తరలించే పనిలో పడ్డారు. వినాయ కుడి బొమ్మని ఓ ట్రాక్టర్‌ మీద ఎక్కించారు. ఆ బొమ్మలతో పాటు యింకొందరు  కుర్రాళ్ళు కూడా ట్రాక్టర్‌లోకి ఎక్కేశారు. యిక అక్కడ్నుంచి వినాయకుడి విగ్రహం ఊరేగింపు మొదలయింది. దారి పొడుగునా వినాయకుడితో పాటు ట్రాక్టర్‌లోకెక్కిన కుర్రాళ్ళు డేన్సులవీ చేయడం మొదలెట్టారు. దాంతో అప్పుడప్పుడు వాళ్ళ కాళ్ళేవో ఆ బొమ్మకి తగులుతున్నాయి కూడా. మొత్తానికి యింకో రెండుగంటల్లో ఆ ఊరేగింపేదో పూర్తయి వినాయకుడి బొమ్మని ఊరికి చివరగా ఉన్న చెరువు దగ్గరికి తీసుకొచ్చారు. మోడీగారి స్వచ్ఛభారత్‌ ఏదో ఆ ఊరోళ్ళేం పాటిస్తున్నట్టు  లేడు. చెరువు పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. నీరంతా మురిగిపోయి ఉంది. దానికి తోడు తెల్లారితే ఊళ్ళో సగం మంది చెంబులు పట్టుకుని వచ్చి ఆ చెరువులోనే కడిగేసుకుంటారు..! అలాంటి చెరువునీటిలోకి వినాయకుడి నిమజ్జనం జరిగిపోయింది. అక్కడికీ విగ్రహం పూర్తిగా మునగకపోతే బలవంతంగా కర్తలతో మరీ లోపలికి తోసేసి మరీ వెనుదిరిగారు.
——-
”అది గురూగారూ.. నాకొచ్చిన కల” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం నిట్టూర్చి ”అవునోయ్‌.. జరిగేదంతా యిదే కదోయ్‌.. అయినా నీ కలలో గొప్ప జీవిత సత్యం ఉంది” అన్నాడు. వెంకటేశానికి అర్థం కాలేదు. అప్పుడు గిరీశం ”మరేం లేదోయ్‌.. మనం ఎక్కడో కుళ్ళులోంచి ఈ భూమ్మీదకి వస్తాం. ఆ తర్వాత ఈ ఆడంబరాలూ, అహంకారాలూ, షోకులూ, పొగర్లూ, ఆధిప త్యాలూ.. ప్రదర్శిస్తాం. తర్వాతెప్పుడో మనం పోయింతర్వాత యివేవీ మిగలవు. ఏమాత్రం ఆలీసెం చేయకండా పట్టుకెళ్ళి ఆ మట్టిలో కలిపేస్తారు. ఈ నిమజ్జనం చెప్పేదీ అదే. ఆ బొమ్మ తయారు చేయడానికి కాళ్ళతో తొక్కిన మట్టే వాడతారు. తయారయిం తర్వాత మహా గొప్పగా భయభక్తులతో పూజలు చేస్తారు. చివర్లో మళ్ళీ ఏ మురికినీటిలోనో ముంచేస్తారు” అన్నాడు వేదాంత ధోరణిలో. దాంతో వెంకటేశం కంగారుపడి ”గురూగారూ.. మీరిలా ఫిలాసఫీ చెప్పడం అంటే మన హీరోయిన్లు వొంటినిండా బట్టలు కట్టు కున్నంత ఎబ్బెట్టుగా ఉంది” అన్నాడు. దాంతో గిరీశం ”సరే.. యిదేదో మన రాజకీయాల వెర్షన్‌లో చెబుతాలే. ఈ రాజకీయ నాయకులు గతంలో ఎన్ని దారుణాలు చేసినా ఓసారి పవర్‌లోకి వచ్చేసరికి అన్నీ కొట్టుకుపోతాయి. యిక అక్క డ్నుంచి అంతా రాజభోగమే. పరిపాలనలో ఉన్నన్ని రోజులూ అదే శాశ్వతం అన్న స్థాయిలో చెలరేగిపోతారు. పదవిపోయింతర్వాత మళ్ళీ అంధ కారంలోకే. మొత్తానికి ఏం జరుగుతుంది? పదవిలో ఉన్న ప్పుడు స్థాయిని విచక్షణని మరిచి ప్రవర్తిస్తే పదవిపోయింతర్వాత పరిస్థితులు ఎదురుదాడి చేస్తాయి. చింతమనేని లాంటివాళ్ళే దీనికి సరయిన  ఉదాహరణ. అంతేకాదు. యిప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళూ దీన్ని  గుర్తుంచుకోవాలి. అందుకే అధికారానికి అతీ తంగా ఎప్పుడూ విచక్షణతో వ్యవహరిస్తే ఎలాంటి యిబ్బందులూ ఉండవు” అన్నాడు.
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here