నిందారోపణలు కాదు నిర్మాణాత్మక వైఖరి అవసరం

0
667
(జీ కె వార్తా వ్యాఖ్య)
పాఠశాల నుంచి బిడ్డ కాస్త ఆలస్యంగా వస్తేనే కన్న వారి హృదయం తల్లడిల్లిపోతుంది. ఏ కారణం వల్ల ఆలస్యమైందోనని ఆతృతగా ఎదురు చూస్తారు. బిడ్డ ఇంటికి క్షేమంగా చేరితేనే గాని వారి మనస్సు కుదుటపడదు. అటువంటిది గంట కాదు… రెండు గంటలు కాదు… రోజు కాదు… ఏకంగా మూడు రోజులుగా తమ బిడ్డల ఆచూకీ తెలియక ఆ కన్నవారు అన్నపానీయాలు మాని కన్నీరుమున్నీరుగా విలపిస్తూ గోదారమ్మ వైపు ఎదురు చూస్తూనే ఉన్నారు. తమ బిడ్డలు సజీవంగా ఉన్నారో?  లేరోనన్న ఆందోళనతో, సజీవంగా రాకపోతారా అన్న ఆశతో కంటి మీద కునుకు లేకుండా ఇప్పటికీ నదీ తీరానే నిరీక్షిస్తున్నారు. ఇదీ ! ఐ. పోలవరం మండలం పశువుల్లంక వద్ద గోదావరిలో పడవ మునిగి గల్లంతైన వారి తల్లిదండ్రుల పరిస్థితి. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఏడుగురు గల్లంతు కాగా ఇంతవరకు ఇద్దరి ఆచూకీ మాత్రమే లభ్యమైంది. ఈ దుర్ఘటనలో ఉజ్వల భవిష్యత్తు కలిగి ముక్కుపచ్చలారని బాలికల బ్రతుకులు నదీపాలు  కావడం వారి తల్లిదండ్రులకే కాదు  చూపరులనే కంట తడిపెట్టిస్తోంది.  కాగా ఆచూకీ లభ్యమైన ఇద్దరు కూడా విగతజీవులు కావడంతో మిగిలిన ఐదుగురూ సజీవంగా ఉంటారన్న ఆశలు అడుగంటినా తమ బిడ్డలు ఇంకా బ్రతికే  ఉంటారన్న ఆశ తల్లిదండ్రుల్లో  ఏదో మూల మిణుకు మిణుకుమంటోంది. చివరికి ఏడ్చే ఓపిక లేకపోయినా, కన్నీరు ఇంకిపోయినా కూడా కనీసం తమ బిడ్డల చివరి చూపైనా దక్కకపోతుందా అని ఆ కన్న హృదయాలు రేయింబవళ్ళు ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాగే ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ గల్లంతైన వారి ఆచూకీ కోసం శక్తియుక్తుల్ని ప్రదర్శించి నదిని జల్లెడపడుతున్నాయి. ఏదీ ఏమైనా ప్రకృతి ప్రకోపం ముందు మానవ శక్తి అత్యల్పమైనదనడానికి మనకు అనేక సంఘటనలు తార్కాణంగా నిలుస్తున్నాయి. సాక్షాత్తూ  దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాశి వద్ద కూడా గంగా నదిలో ఆ మధ్య పడవ బోల్తా పడి అనేకమంది జలసమాధి అయ్యారు. అలాగే మొన్నటికి మొన్న దేవీపట్నం సమీపంలోని మంటూరు వద్ద లాంచీ బోల్తా పడిన ఘటనలో 19 మంది మృత్యువాతపడ్డారు. ఇలా దేశంలో ఏదో ఒక మూల పడవ ప్రమాదాలు సంభవించడం కొత్తేమీ కాకున్నా అలా జరగకుండా నిరోధించడానికి మానవ ప్రయత్నం జరగాలన్నది మాత్రం నిర్వివాదాంశం. అయితే ఏదైనా ఘటన జరిగినప్పుడే ఆ నాలుగు రోజులు లోటుపాట్లు, వాటిని సరిదిద్దుకోవడం వంటి విషయాలపై మాట్లాడుకోవడం ఆ తర్వాత ఆ విషయాలను మరిచిపోవడం పరిపాటిగా మారింది. అలాగే అధికారపక్షం, ప్రతిపక్షం మీరు బాధ్యులంటే మీరు బాధ్యులని వాదులాడుకోవడం, ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఆంక్షలను కఠినంగా  అమలు చేయడం, ఆ తర్వాత పట్టించుకోకపోవడం ఇలా అన్నీ విషయాలు మాములే. ప్రమాదాలు జరిగినప్పుడే ఆ లాంచీకి గాని పడవకు గాని లైసెన్స్‌ ఉందా? చోదకుడు అనుభవజ్ఞుడేనా?, నిబంధనలన్నింటిని పాటిస్తున్నారా? అన్న విషయాలు వెలుగులోకి వస్తాయి. లేకుంటే షరా మాములుగా లోపభూయిష్టంగా ప్రమాదకర ప్రయాణాలు సాగిపోతూనే ఉంటాయి.  ఆ మధ్య దేవీపట్నం వద్ద జరిగిన ప్రమాదంలో సంబంధిత లాంచీ నదిలో సంచరించడానికి సంబంధించిన లైసెన్స్‌ గడువు ముగిసినా యదేచ్ఛగా తిరిగి ప్రమాదానికి కారణం కావడంతో బాధ్యులపై  చర్యలు తీసుకున్నారు. అలాగే తాజాగా పశువుల్లంక వద్ద జరిగిన ప్రమాదానికి కారణమైన పడవకు లైసెన్స్‌ లేదని వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై విచారణ జరిపి ఆ విషయం వాస్తవమైతే బాధ్యులెవరైనా, ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా కఠిన చర్యలు తీసుకోవలసిందే. ఎందుకంటే ఎన్నో కుటుంబాల్లో జీవితాంతం కుమిలిపోయే పూడ్చలేని అగాథాన్ని  , తీర్చలేని శోకాన్ని మిగల్చడానికి కారకులైన దోషుల్ని కఠినంగా శిక్షించాల్సిందే. ఇందుకు ఆ పార్టీ వారు.. ఈ పార్టీ వారు అన్న కనికరంగాని, వలపక్షం గాని ఏమీ చూపనవసరం లేదు. కాగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా దేశంలో నేటికీ చాలా ప్రాంతాల్లో నదుల్లో పడవ ప్రమాదాలు చోటుచేసుకోవడం బాధాకరమే కాదు సిగ్గు చేటు కూడా. వంతెనలు లేక దేశంలో అనేక చోట్ల ప్రజలు ప్రమాదకరమైన ప్రయాణాలు చేయడం, వీరి అవసరాన్ని, తొందరపాటును తమ ఆర్థిక వనరుగా మార్చుకుని కొందరు వీరి ప్రాణాలతో చెలగాటమాడుతూ నిలువునా ‘ముంచేయడం’ పరిపాటిగా మారింది. వంతెనలు లేకపోవడం ఈ ప్రమాదాలకు కారణమవుతున్నందున ఈ విషయంలో ప్రజలు తమ ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెచ్చి వారధుల నిర్మాణం జరిగేలా చొరవ చూపవలసిన అవసరం ఉంది. అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయంలో శ్రద్ధ వహిస్తే ఇటువంటి మానవ తప్పిదాలకు ఆస్కారం ఉండబోదు. మొన్నటికి మొన్న ఓ ప్రాంతంలో ఆగిపోయిన పడవను తమ ఎమ్మెల్యే వచ్చి తిరిగి నడిపించారని అక్కడి స్థానికులు సంబరపడిపోయారన్న విషయం తెలిసినప్పుడు ప్రజల అమాయకత్వానికి నవ్వాలో ఏడ్వాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.వంతెన నిర్మించాలని ఒత్తిడి చేయవలసిన ప్రజలు పడవను తమ ఎమ్మెల్యే తిరిగి నడిపంచారని సంబరపడ్డారంటే వారెంతో అల్పసంతోషులో అర్ధమవుతోంది. ఉన్నత చదువులు చదువుకోవడానికి కొందరు ఖండాంతరాలు దాటి వెళుతుంటే ప్రాథమిక స్థాయి విద్య కోసం కొందరు ప్రమాదకర ప్రయాణాలు చేస్తూ దూర ప్రాంతానికి వెళ్ళడం, ఆ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పొవడం దురదృష్టకరం.అలాగే ఖండాంతరాలను కూడా ఆకాశయానం ద్వారా గంటల వ్యవధిలో దాటేస్తుండగా,  రెండు, మూడు  వేల కిలో మీటర్ల దూరాన్ని కూడా పేర్లు ఏమైనా, వేగం ఏ స్థాయిలోనైనా రైలు మార్గంలో గంటల వ్యవధిలో చేరుకుంటుంటే స్వల్ప దూరం కలిగి క్షణాల వ్యవధిలో ఆ తీరం నుంచి ఈ తీరానికి  చేరే ప్రయాణానికి ప్రతి సెకను ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పయనించవలసిన దుస్థితిని ఇంకా కొనసాగడం చూస్తే మనం నాగరిక సమాజంలోనే ఉన్నామా? అన్న అనుమానం కలుగుతుంది. ఇటువంటి దుర్ఘటనలు పదే పదే పునరావృతమై అనేక మంది తల్లిదండ్రులకు గర్భశోకం కలగకుండా ఉండాలంటే ఎక్కడ వంతెనల నిర్మాణం అవసరమో? అక్కడ వాటిని నిర్మించడంతో పాటు నత్త నడకన సాగుతూ అసంపూర్తిగా ఉన్న వంతెనల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయవలసిన అవసరం ఉంది. ఈ దిశగా స్ధానిక ప్రజాప్రతినిధులు దృష్టి సారించవలసిన బాధ్యత ఉంది. అలాగే ఇలాంటి విషయాల్లో అధికారంలో ఎవరున్నా? ప్రతిపక్షంలో ఎవరున్నా? పరస్పరం నిందారోపణలు, విమర్శలు చేసుకోకుండా నిర్మాణాత్మక సూచనలు, సలహాలు, సహకరించే ధోరణిలో వ్యవహరిస్తే ఇటువంటి ఘోరాలు పునరావృతం కాకుండా ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here