నిత్య శృంగారరాజ్యం –  భక్తజన కానుకల భోజ్యం

0
88
మనస్సాక్షి  – 1170
దేశంలో పెద్ద సంచలనమే మొద లయింది. దానిక్కారణం బ్యాంకు లకి వేలాదికోట్లు ఎగనామం పెట్టి తిరుగుతున్నోళ్ళూ, రేపిస్టులూ, యింకా వివిధ నేరాల్లో తప్పిం చుకు తిరుగుతున్న బడాబడా ఆర్ధిక నేరస్తులూ.. యిలా వీళ్ళంద రికీ శుభ్రంగా తప్పించేసుకో మని ఆ దేవుడు వరం యిచ్చేశాడు. అంత ఉదారంగా వరాలిచ్చేసిన ఆ దేవుడు యింకె వరో కాదు. సుల్తాన్‌ ఆఫ్‌ వైకుంఠం. అదేంటీ.. వైకుంఠంలో ఉండవలసింది విష్ణు మూర్తుల వారు కదా. మరి ఈ సుల్తానేంటీ అనుకో అక్కర్లేదు. యింతకీ ఈ సుల్తాన్‌ ఎవరో కాదు. అచ్చంగా మన గంగలకుర్రు వెంక టేశమే..!
——
ఆరోజు ఉదయాన్నుంచే అవధాని ఎడమకన్ను అదురుతోంది. దాంతో ఎటు నుంచి ఏ సమస్య వచ్చి పడుతుందోనని భయపడి చస్తు న్నాడు. మొత్తానికి ఆ సమస్యేదో పుత్రరత్నం రూపంలో వచ్చి పడింది. ఆరోజు మధ్యాహ్నం భోజనా లప్పుడు వెంకటేశం ”నాన్నా.. నాక్కొంచెం డబ్బు సర్ధుబాటు చేయి” అన్నాడు. అవధాని భయంగా ఎంతరా అన్నాడు.. దానికి వెంకటేశం ”ఓ మంచి ప్రాజెక్టు కోసం.. కోటి రూపాయలైతే సరిపోతుంది” అన్నాడు. దాంతో అవధానికి పొల మారింది. ”ఏంటీ.. కోటిరూపాయలా? యింతకుముందే కదరా.. ఎలక్షన్లంటూ బంగారంలాంటి రెండెకరాల పొలం అమ్మించేశావు. యిప్పుడు కోటి రూపాయలు కావాలంటే మిగతా పొలం అంతా అమ్మిపడేసి రోడ్డెక్కాలి” అన్నాడు. దాంతో వెంకటేశం నిరాశపడ్డాడు. అయినా పట్టు వదలకుండా అర్జంటుగా పోయి గిరీశాన్ని కలుసు కుని, తన ప్రాజెక్టంతా వివరంగా చెప్పాడు. అది వినగానే గిరీశం తెగ యింప్రెస్సయిపోయి, అప్పటి కప్పుడే అవధానికి ఫోన్‌ చేశాడు. ”యిదిగో మావయ్యా.. మనోడు పెట్టే ప్రాజెక్టు మామూల్ది కాదు. పెట్టిందానికి వందరెట్లు వచ్చి పడ తాయి. ఆ డబ్బిచ్చెయ్‌” అన్నాడు. మొత్తానికి పదిరోజుల్లో అవధాని డబ్బులివ్వడం, అక్కడితో ఆపరేషన్‌ వైకుంఠం మొదలవడం జరిగింది.
——-
బ్రూనై దేశం.. ఆరోజు మధ్యాహ్నం బ్రూనై సుల్తాన్‌ గారికో పార్శిల్‌ వచ్చింది. అదీ యింటర్నేషనల్‌ ప్రీమియర్‌ కొరియర్‌లో. అదీ యిండియాలో ఎక్కడో గంగలకుర్రు నుంచి. బ్రూనై సుల్తాన్‌ దాన్ని ఆసక్తిగా తెరిచి చూడడం జరిగింది. యింతకీ అదో లక్షల విలువ యిన వెండి పళ్ళెం. దానిమీద బంగారంతో చెక్కబడిన ఉత్తరం ఏదో ఉంది. అదంతా యింగ్లీషులో ఉంది. ‘సుల్తాన్‌ ఆఫ్‌ బ్రూనై గారికి సుల్తాన్‌ ఆఫ్‌ గంగలకుర్రు స్నేహపూర్వకంగా రాస్తున్నది.. ఒక ముఖ్యమయిన పనిమీద మీ దీవిని సందర్శించాలనుకుంటున్నాం. మాకూ, మా పరివారానికీ మీ దీవిలో ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ మొత్తం విడిదిగా కేటాయించగలరు..’ యిలా సాగిందది. అది చదివి బ్రూనై సుల్తాన్‌ చాలా ఆనందాశ్చర్యాలకి లోనయ్యాడు. పక్కనున్న మంత్రి కమ్‌ పీఏతో ”ఓసారి నెట్‌లో ఈ గంగలకుర్రు రాజ్యం గురించి సెర్చ్‌ చెయ్యి” అన్నాడు. దానికి మంత్రి పెదివి విరిచి ”ఆ అవకాశం లేదు. సుల్తాన్‌ జీ.. ఈ ఉత్తరంలో కింద ఏవుందో చూశారా..’ మా గంగల కుర్రు రాజ్యానికి ప్రైవసీ అనేది చాలా ముఖ్యం. ప్రపంచం అంతా  మా గురించి తెలుసుకోవడం మా కిష్టం లేదు. అందుకే గూగుల్‌కి మేం చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నాం’.. అనుంది అన్నాడు. దాంతో బ్రూనై సుల్తాన్‌ ”ఈ సుల్తానేదో చాలా తెలివయినవాడిలా ఉన్నాడు. గూగుల్‌కి దొరక్కుండా తప్పించుకోవడం అంటే మాటలా” అన్నాడు మెచ్చుకోలుగా. మంత్రి తలూపేడు. యింతలో సుల్తాన్‌ ”అంత ఖరీ దయిన ఉత్తరం రాసేరు కదా. మరి దానికి రిప్లయ్‌ యివ్వొద్దాం” అన్నాడు. మంత్రి తలూపి ”యింకా ఖరీదయిన స్థాయిలో యివ్వాలి సుల్తాన్‌ జీ.. యింకో అంగుళం మందం ఎక్కువున్న వెండి పళ్ళెం మీద రమ్మని ఆహ్వానిస్తే సరి” అన్నాడు. సుల్తాన్‌కి యిదేదో బావుం దనిపించింది. ఆ ఏర్పాటు చేయించేశాడు. అంతేనా.. అందులో సుల్తాన్‌ ఆఫ్‌ గంగలకుర్రుని తమ రాజభవనంలోనే వచ్చి ఉండవల సిందిగా ఆహ్వానించాడు. మొత్తానికి నాలుగోరోజుకల్లా  బంగారం అక్షరాలతో చెక్కిన వెండి పళ్ళెం ఉత్తరం వెంకటేశానికి చేరింది. దాంతో అప్పటి దాకా కోటి రూపాయలూ పోయిందని బెంగెట్టుకుని మంచం పట్టిన అవధాని కాస్తా లేచి కూర్చున్నాడు. ఆ వెండి పళ్ళెం ఏదో చూసేసరికి సగం ప్రాణం తిరిగొచ్చేసింది. యిక అక్కడ్నుంచి వెంక టేశం బ్రూనై వెళ్ళే పనుల్లో పడ్డాడు.
——
వెంకటేశం గాలికి తిరిగే ఓ యిరవైమంది మిత్రబృందాన్ని తీసుకుని బ్రూనైలో దిగిపోయాడు. అయితే అంతా యిప్పుడు సాదాసీదాగా లేరు. మంచి బట్టల్లో మెరిసిపోతున్నారు. పెద్దస్థాయిలో నాటకాలకి కాస్ట్యూమ్స్‌ అద్దెకిచ్చే చోట నుంచి తెచ్చి వేసుకున్నారు. యిక వారిలో వెంకటేశం అయితే మరీ మెరిసి పోతున్నాడు. వాళ్ళందరికీ విమానా శ్రయంలో ఘన స్వాగతం లభించింది. అయితే సుల్తాన్‌ ఆఫ్‌ గంగలకుర్రు గారు సొంత ఫైట్లో వస్తారనుకుంటే యిలా మిగతా ప్రయాణీకులతో మామూలుగా వచ్చేసేసరికి బ్రూనై సుల్తాన్‌ గారు ఆశ్చర్యపోయారు.. యింకా ఆ నిరాడంబరతకి అభినం దించారు కూడా. మొత్తానికి వెంక టేశం పరివారానికి ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్లో బస ఏర్పాటు చేస్తే, వెంకటేశానికి  రాజభవనంలో బస ఏర్పాటు చేయ బడింది. యిక అక్కడ వెంకటేశాని కయితే రాచమర్యాదలు చేయ బడ్డాయి. రెండోరోజు సాయంత్రం వెంకటేశం బ్రూనై సుల్తాన్‌తో ”సుల్తాన్‌ జీ.. నేనొ చ్చింది ఓ దీవి కొన డానికి. మా తండ్రిగారికి ఓ దీవొకటి కానుకగా యివ్వాలని ఎప్ప ట్నుంచో అనుకుంటున్నా. మీ మెయిన్‌ దీవికి ఆనుకునే మీ చిన్న చిన్న దీవులు చాలా ఉన్నాయి కదా. అందులో ఒకటి నాకు అమ్మితే ఎంతయినా యిస్తాను” అన్నాడు. దాంతో బ్రూనై సుల్తాన్‌ తెగ బాధ పడిపోతూ” మీరు మా మిత్రులు, ఆప్తులు. మీకు అమ్మడం ఏంటీ? బహుమతిగా తీసుకోండి” అన్నాడు. దాంతో వెంకటేశం కూడా ”సుల్తాన్‌ జీ.. అలా వద్దు. మీరు డబ్బు తీసుకో వలసిందే” అన్నాడు పట్టుదలగా. దాంతో బ్రూనై సుల్తాన్‌ యింకా ఖచ్చితంగా ”ఎంతమాత్రం వీల్లేదు. అలా డబ్బు తీసుకుంటే అది మన స్నేహానికే అవమానం” అన్నాడు. దాంతో వెంకటేశానికి ఊ అనక తప్పలేదు. మొత్తానికి ఆ మర్నాడే బ్రూనైకి ఆనుకుని ఉన్న యింకో దీవిని వెంకటేశం పేర్న రాసెయ్యడం జరిగింది.
——-
యిక అక్కడ్నుంచి వెంకటేశం చకచకా పావులు కదపడం మొద లెట్టాడు. ఐ.రా.స.కి తను వైకుంఠం అనే దీవికి యజమానిననీ, ఆ దీవిని స్వతంత్ర దేశంగా గుర్తించాలనీ ఆ ఉత్తరం సారాంశం. యిదేదో  ఐరాస సమావేశంలో పెద్ద దుమారాన్నే రేపింది. ‘అదెలా కుదురుద్దీ.. ఈ లెక్కన డబ్బున్న ప్రతీవాడూ ఓ దీవి కొనుక్కుని దానికి రాజయిపోవచ్చు. అందుకే అలా వీల్లేదు అని వాదించారు. అదే మెయిల్‌ ద్వారా  వెంక టేశానికి తెలియజేయబడింది. దాంతో వెంకటేశం ఎంతో స్ట్రాంగ్‌గా ఐరాస మతపరమయిన వివక్ష చూపిస్తుందని దీన్ని బట్టే అర్థమైపోతుంది. లేకపోతే ఎంతో చిన్నదైన వాటికన్‌ని ప్రత్యేక దేశంగా ఎలా గుర్తించారు? హిందూ దేవుడయిన విష్ణుమూర్తి సంచరించిన వైకుంఠం దీనిని ప్రత్యేక దేశంగా ఎందుకు గుర్తించరు? అంటూ మెసేజ్‌ పంపించాడు. దాంతో అంతా ఆలో చనలోపడ్డారు. ‘యిదేదో చిలికి చిలికి గాలి వానయ్యేలాగుంది అని యింకేం వాదనలు చేయకుండా వైకుంఠం దీవికి ప్రత్యేక దేశం గుర్తింపు యిచ్చేశారు.
——
వైకుంఠం దీవికి వెంకటేశం రాజయిపోయాడు… అదే.. సుల్తాన్‌ ఆఫ్‌ వైకుంఠం అయిపోయాడు. యిక అక్కడ్నుంచి సొంత రాజ్యాంగం ఒకటి తయారు చేయించాడు. యిక ఆ తర్వాత యిండియాలో బ్యాంకులకి వందకోట్లపైన ఋణాలు ఎగ్గొట్టి తిరుగుతున్న వాళ్ళకీ, రేప్‌లు చేసి తప్పించుకు తిరుగుతున్న వాళ్ళకీ, యింకా బడాబడా ఆర్థిక నేరస్తులకీ ఓ మెసేజ్‌ పంపించాడు. ‘కోటి రూపాయలు డిపాజిట్‌ చేసి ఎవరయినా తమ దేశంలో పౌరసత్వం పొందవచ్చనీ, వాళ్ళకి తమ దేశంలో పూర్తి రక్షణ ఉంటుందనీ’ దాని సారాంశం. ఆ వచ్చేవాళ్ళు కూడా నేరుగా యిండియా నుంచి యిక్కడికి రాకుండా స్విట్జర్లాండ్‌ వెళ్ళిపోయి, అక్కడ్నుంచి యిక్కడకొచ్చే ఏర్పాటు చేయ బడింది. మొత్తానికి దగ్గర్లోనే కొన్ని వందలమంది ఆ డబ్బు కట్టేసి పౌరసత్వం తీసుకున్నారు. యింతలోనే అక్కడ బ్రహ్మాండమయిన  నిర్మాణాలు మొదలయ్యాయి. యింకో ఆరునెలల తర్వాత ఈ తప్పుడు జనాలంతా వచ్చి వాలిపోయారు. యిక వైకుంఠం దేశంలో రాజ్యాంగ మయితే వాళ్ళకి మరీ బాగుందాయె. రేప్‌లూ గట్రా చేస్తే తలలవీ నరకడం లేదు. పైగా ‘శృంగారశ్రీ’ బిరుదిస్తున్నారు. యింకా యిత రత్రా శృంగార సంబంధాలు పెరిగే కొద్దీ ‘శృంగార భూషణ్‌’ లాంటి బిరుదులవీ యిస్తున్నారు. యిక ఆర్థిక నేరాలు చేసినోళ్ళు ‘అపర చాణుక్యులు’ గా గుర్తించబడుతున్నారు. దాంతో వైకుంఠంలో రోజు రోజుకీ జనాలు పెరుగుతున్నాయి. యింకా వెంకటేశం ఆస్తులు కూడా.
——
మొహం మీద వేడిగా తగిలేసరికి వెంకటేశం ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. అంతా కల..! ఎదురుగా నోట్లో చుట్టతో గిరీశం.. ”ఏవివాయ్‌.. మళ్ళీ ఏదో కల కంటున్నట్టున్నావ్‌?” అన్నాడు. దాంతో వెంకటేశం తనకొచ్చిన కలంతా చెప్పాడు. అంతా విన్న గిరీశం. ”ఈసారి నీకలలోకి నిత్యానంద దూరాడోయ్‌.. సదరు నిత్యానంద ఓ సైకోటిక్‌, హైవీయింటెలిజంట్‌, పైగా యాంటీ సోషల్‌ ఎలిమెంట్స్‌ ఉన్నవాడు. అప్పట్లో  రంజితతో, యిప్పుడు వేరే ఎందరితోనో తప్పుడు సంబంధాలు కొనసాగిస్తున్నవాడు. యింకా అతని మీద ఆర్థికపరమైన ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. అందుకే వీటన్నిటి నుంచీ తప్పించుకోడానికి వీలుగా ఓ దీవి సొంతంగా కొని అక్కడికి పారిపోవడం జరిగింది.  యిప్పుడా దీవిని స్వతంత్ర దేశంగా గుర్తిం చాలని అప్లికేషన్‌ పెట్టుకున్నాడు. పైగా అక్కడ్నుంచి ఇండియాని తిడుతున్నాడు. యితననే కాదు. మాల్యా, నీరవ్‌లని తీసుకున్నా వాళ్ళంతా విదేశాలకి పారిపోయి శుభ్రంగా ఎంజాయ్‌ చేస్తున్నారు. దీనికంతటికీ కారణం పాలనా వ్యవస్థలో లోపాలే. వాటిని సరి చేయగలిగినరోజు యిలాంటి వలసలు ఆగిపోతాయి” అన్నాడు. ”అన్నట్టు ఈవేళ అంతర్జాతీయ అవినీతి నిరోధక దినం” అని వెంకటేశం గుర్తు చేశాడు..
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here