నిబంధనలు పాటిస్తేనే ప్రాణాలకు రక్షణ

0
313

రహదారి భద్రతా వారోత్సవాల ప్రారంభంలో వక్తలు

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 25 : వాహనాలను నడిపే సమయంలో నిబంధనలను పాటిస్తే ప్రమాదాల సంఖ్యను తగ్గించవచ్చని పలువురు ప్రజాప్రతినిధులు అన్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో 29వ రహదారి భద్రతా వారోత్సవాలను జాంపేట ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో ఈరోజు నిర్వహించారు.ఆర్టీవో సిరి ఆనంద్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, ట్రాఫిక్‌ డిఎస్పీ వై.వి.రమణకుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ”రహదారి భద్రత- మన జీవన భద్రత’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో గోరంట్ల మాట్లాడుతూ ఆటో కార్మికులకు హక్కులతో పాటు బాధ్యత కూడా ఉండాలని, ప్రమాదాలను నివారించడం కోసమే నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తారన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, కారులలో ప్రయాణించేటప్పుడు సీటు బెల్ట్‌ ధరించాలని, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా బ్యాడ్జి కలిగి ఉండాలని సూచించారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గన్ని కృష్ణ మాట్లాడుతూ తనకు ఇష్టమైన వ్యక్తుల్లో నలుగురిలో ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మరణించారని, వారు కారులో ప్రయాణించిన సమయంలో సీటు బెల్ట్‌ ధరించకపోవడం వల్ల కింజరపు ఎర్రంనాయుడు, లాల్‌ జాన్‌ భాషా ప్రాణాలు కోల్పొయారని అన్నారు. నగరంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల నమోదులో అప్పటి అధికారుల తీరుపై ఆరోపణలు వచ్చాయని,ప్రస్తుతం ఆ అధికారులు బదిలీ అయ్యారని తెలిపారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ విషయంలో పోలీసులు ఖచ్చితంగా నిబంధనలను అమలు చేసి ప్రమాదాలను తగ్గించాలని కోరారు. ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలని, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు.ఆటో డ్రైవర్లు ముందు సీట్లో ప్రయాణికులను కూర్చోబెట్టి నడపడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని, ఆ విధానాన్ని మానుకోవాలని సూచించారు. నిబంధనలను పాటిస్తున్న ఆటో కార్మికులపై అధికారులు తప్పుడు కేసులు నమోదు చేస్తే వారికి అండగా తాము నిలుస్తామన్నారు. కేసులే లక్ష్యంగా కొంత మంది అధికారులు ప్రజల పట్ల అమర్యాదగా దురుసుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు పెరిగాయని, దీని వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. ఇటీవల కాలంలో కొంతమంది యువత రోడ్లపై బైక్‌ రేసులు నిర్వహిస్తూ ప్రయాణికులకు, బాటసారులకు ప్రమాదకరంగా తయారయ్యారన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ టార్గెట్లే లక్ష్యంగా కొందరు అధికారులు మహిళలను కూడా ఇబ్బందికి గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 894 గెజిట్‌ నోటిఫికేషన్‌ ఆటో కార్మికులకు తీవ్ర ఇబ్బందికరంగా ఉందని, దీనిపై కార్మిక శాఖ మంత్రి అచ్చంనాయుడుతో మాట్లాడి సీఎం దృష్టికి తీసుకెళతామన్నారు. ఇటీవల ముగిసిన శాసనమండలి సమావేశాల్లో కొన్ని చోట్ల ఆర్టీసి బస్సులు నడపలేకపోవడానికి ఆటోలే కారణమని, దీనిపై ఆటోల సంఖ్యను తగ్గించాలని ఒక వాదన వినిపించగా మంత్రి లోకేష్‌ స్పందించి ఆటో కార్మికుల మనుగడకు ఎట్టి పరిస్థితుల్లో విఘాతం కలగకూడదని ఖరాఖండిగా చెప్పారన్నారు. ఆటో కార్మికులకు విద్య లేకపోయినా లైసెన్స్‌లు మంజూరు చేయడానికి ప్రభుత్వం అంగీకరించిందన్నారు. మేయర్‌ పంతం రజనీ శేషసాయి మాట్లాడుతూ నిబంధనలను పాటించకపోవడం వలనే ప్రమాదాలు పెరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిబంధనలను పాటించి ప్రయాణికులను గమ్యస్ధానాలకు చేర్చాలన్నారు. తెదేపా యువ నాయకులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఆటో కార్మికులు తప్పనిసరిగా వారి భద్రతతో పాటు ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకోవాలని, రాష్ట్రంలో ఏడాదికి 30 వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, దేశంలో ఏపీ 3 వ స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆటోలు రాజమహేంద్రవరంలోనే ఉన్నాయని అన్నారు. ట్రాఫిక్‌ డిఎస్పీ రమణకుమార్‌ మాట్లాడుతూ జరిమానాల కంటే అవగాహన కల్పించడానికే తాము ప్రాధాన్యత ఇస్తున్నామని, క్రమశిక్షణ లోపించడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అనంతరం శతాయు కిడ్ని సెంటర్‌ ఆధ్వర్యంలో ఆటో కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆర్టీవో సిరి ఆనంద్‌ను ప్రజాప్రతినిధులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ద్వారా పార్వతి సుందరి, కురగంటి ఈశ్వరి, కార్మిక నేత వాసంశెట్టి గంగాధరరావు, రాష్ట్ర ఎంబిసి కన్వీనర్‌ కురగంటి సతీష్‌, ఆకుల సూర్య భాగ్యలక్ష్మీ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here