నిరుద్యోగ భృతితో 99 శాతం హామీలు నెరవేర్చినట్లే 

0
393
చంద్రబాబు నిర్ణయంపై గన్ని కృష్ణ హర్షం
రాజమహేంద్రవరం, ఆగష్టు 3 : ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఇప్పుడు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబునాయుడు నిరుద్యోగ భృతిని చెల్లించేందుకు విధివిధానాలు రూపొందించడం అభినందనీయమని, టిడిపి ఎన్నికల మేనిఫెస్టోలో 99 శాతం హామీలు నెరవేర్చినట్లేనని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ అన్నారు. రాష్ట్రం ఆర్థిక లోటుతో సతమతమవుతున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోకుండా హామీలను అమలు చేయడంతోపాటు ప్రకటించని మరిన్ని కార్యక్రమాలను అమలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. నిరుద్యోగ భృతి పథకం క్రింద ఏడాదికి రూ.1200 కోట్లు ప్రభుత్వానికి ఖర్చవుతోందని, ఈ తరహాలో అమలు చేయడం దేశంలోనే ప్రథమమని పేర్కొన్నారు. ఏపీలో 22 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ వయసు కలిగి డిగ్రీ, తత్సమాన విద్యార్హత కలిగి ఉన్న  నిరుద్యోగ యువతకు రూ.వెయ్యి చెల్లించనున్నామని తెలిపారు. అయితే  కేరళ, పశ్చిమబెంగాల్‌, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతిని అమలు చేసినప్పటికీ ఆయా రాష్ట్రాల్లో నెలకు రూ.120, రూ.200, రూ.500 చొప్పునే చెల్లించారని, అది కూడా ఆరునెలల్లోనే ఈ పథకాన్ని రద్దు చేశారని తెలిపారు.  అయితే మన రాష్ట్రంలో ఒక కుటుంబంలో ఒకరికి అనే పరిమితి లేకుండా కుటుంబంలో అర్హులైనవారు ఇద్దరు, ముగ్గురున్నా భృతి చెల్లిస్తారని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించారని, ప్రభుత్వ ప్రతిపాదనలపై ప్రజల నుంచి స్పందనలు, సూచనలు తీసుకున్నాక వచ్చే మంత్రివర్గ సమావేశంలో వాటిపై చర్చించి తుది విధానం ఖరారు చేస్తారని  తెలిపారు. నిరుద్యోగ భృతి ఇవ్వడంతోపాటు వారికి నైపుణ్య శిక్షణ కూడా ఇస్తారని, సమాజానికి ఉపయోగపడేలా విజ్ఞాన సమూహంలా యువతను తీర్చిదిద్దనున్నారని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతిని ప్రతినెలా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో వేస్తారని, దీనిని ఎక్కడైనా తీసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ ద్వారా లక్షలాదిమంది యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నాలను ముఖ్యమంత్రి చేపట్టారని, నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పదిలక్షలమంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా పోటీ పరీక్షల్లో శిక్షణనిచ్చేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ పొందిన నిరుద్యోగ యువతకు జాబ్‌ మేళాలు నిర్వహించి ఇప్పటికే  40వేలమందికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహర్నిశలు కృషిచేస్తున్నారని, యువత ఆయనకు మద్దతుగా నిలవాలని కోరారు. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న చంద్రబాబుకి ఈ సందర్భంగా వారి తరపున గన్ని కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here