నిర్భంధించిన తాడే జగన్‌ సర్కార్‌కు ఉరితాడు

0
220
అప్రకటిత ఎమర్జెన్సీని తలపించిన ప్రభుత్వ తీరు
‘ఛలో ఆత్మకూరు’ విజయవంతం : గన్ని, ఆదిరెడ్డి, యర్రా
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 12 : ప్రజాస్వామ్యం పరిహసించబడేలా జగన్‌ సర్కార్‌ నియంత త్వం రాజ్యమేలుతుందని, అప్రకటిత ఎమర్జెన్సీని గ్రామగ్రామాన ప్రజలు చవిచూశారని, ఎపి చరిత్రలో ఇదొక చీకటి దినం అని గుడా మాజీ చైర్మన్‌ గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, శాప్‌ మాజీ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు అన్నారు. ఈరోజు గన్ని కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ పల్నాడు ఏరియాలో 269 మందిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నాయకులు దాడులు చేయడం వలన ఊర్లు వదిలిపోయారని, 110 ఎఫ్‌.ఐ.ఆర్‌.లు నమోదు కాగా ఇంకా 38 సంఘటనలకు సంబంధించి కేసులు కట్టలేదన్నారు.13 మంది ఆస్తులను కూడా ధ్వంసం చేశారని, దీని వలన దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్సార్‌ బాధితుల శిబిరాన్ని ఆత్మకూరులో ఏర్పాటు చేశారన్నారు. బాధితుల కోసం శిబిరం ఏర్పాటు చేస్తే రాష్ట్ర  హోం మంత్రి మాత్రం పెయిడ్‌ అర్టిస్ట్‌లంటూ బాధితులను అవమానించడం మానవత్వానికి సిగ్గుచేటన్నారు. బాధితులను స్వగ్రామానికి పంపి జీవించే హక్కు కల్పించాలని కోరితే ప్రభుత్వంలో స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజులపాటు శిబిరం నడిపినా ప్రభుత్వంలో స్పందన రాకపోవడంతో ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ్చారని అన్నారు. దీంతో ఆత్మకూరు వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఎక్కడిక్కడ నిర్భందాలు, అరెస్టులు చేయడంతో పాటు రాజ్యాంగ విరుద్దంగా చంద్రబాబుని సైతం నిర్బంధించడం అప్రజాస్వామికమన్నారు. ఏ తాడు అయితే పోలీసులు నిర్భందించారో అదే తాడు జగన్‌ సర్కార్‌కి ఉరి తాడు కాబోతుందన్నారు. వైఎస్సార్‌ ప్రభుత్వం దురాగతాన్ని దేశం యావత్తు చూసిందని, ప్రభుత్వ చర్యతో తమ పార్టీకి మరింత ఊపు వచ్చిందన్నారు. వైఎస్సార్‌ బాధితుల శిబిరాన్ని ఏర్పాటు చేస్తే అధికార పార్టీ కూడా తెదేపా బాధితుల శిబిరం ఏర్పాటు చేయడం సిగ్గుచేటన్నారు. ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉండగా తెదేపా బాధితులు వారికి కనబడలేదా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ప్రజలకు వివరిస్తున్న మీడియా గొంతు నొక్కే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేయడం దుర్మార్గపు చర్య కాదా అని ప్రశ్నించారు. కొన్ని ఛానళ్ళ ప్రసారాలను నిలిపివేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనన్నారు. ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా వ్యవహరించలేదన్నారు. ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేదని గగ్గోలు పెడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేకపోవడం విచారకరమన్నారు. చంద్రబాబు ఇచ్చిన ఆత్మకూరు పిలుపుతో ప్రభుత్వంలో ఏర్పడిందని, అందువలనే బాధితులను వారి స్వగ్రామాలకు పంపిందన్నారు. బాధితుల్లో అందరూ బిసి, ఎస్సీలే ఉన్నారని, బలహీన వర్గాలు నటించే వారిగా కనబడుతున్నారా అని ప్రశ్నించారు. జగన్‌ రాక్షస పాలనకు నిన్నటి నిర్భందాలు, అరెస్టులు నిదర్శనమన్నారు. యర్రా వేణుగోపాలరాయుడు మాట్లాడుతూ ఛలో ఆత్మకూరు కార్యక్రమం విజయవంతమైందని, అధికారులు నిర్బందించడానికి ప్రయత్నించినా బాధితులను వారి స్వగ్రామాలకు పంపడమే తాము విజయం సాధించామన్నారు. నిన్నటి ఛలో ఆత్మకూరు కార్యక్రమంలో భూమా అఖిలప్రియ, నన్నపనేని రాజకుమారి, అచ్చెన్నాయుడు తదితరులపై అక్రమ కేసులు బనాయించడం వారి పైశాచిక చర్యలకు పరాకాష్ట అని అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నివాసానికి తాళాలు వేయడం, ఆయనను నిర్బంధించిన ప్రభుత్వం డిజిపితో చంద్రబాబును నిర్బందించలేదని చెప్పడం వారి నైతిక స్థాయిని తెలియజేస్తుందన్నారు. అధికారం చేపట్టిన జగన్‌ కక్ష సాధింపు చర్యలకు పాల్పడి పైశాచిక ఆనందం పొందుతోందన్నారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయడానికి ప్రయత్నించాలని చూస్తే తాము ఇంకా బలపడతామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ నగర ప్రధాన కార్యదర్శి రెడ్డిమణి, ఉప్పులూరి జానకిరామయ్య, చిట్టూరి ప్రవీణ్‌ చౌదరి, మళ్ళ వెంకట్రాజు, శనివాడ అర్జున్‌, వానపల్లి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here