నీ జననమెట్టిది.. నీ చరిత్ర ఏంటి?

0
257

పరిటాల హత్య కేసులో ప్రధాన నిందితుడు నువ్వు కాదా??

జగన్‌పై విరుచుకుపడ్డ రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల

రాజమహేంద్రవరం, జూన్‌ 14 : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్మోహనరెడ్డి జననమెట్టిదో, చరిత్ర ఏమిటో అందరికీ తెలుసని హత్యా రాజకీయాల నుంచి వారి తాత వచ్చాడని, తండ్రిని అడ్డంపెట్టుకుని వేల కోట్లు దోచుకున్న కారణంగా జైలుకి వెళ్ళొచ్చిన చరిత్ర జగన్‌దని రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం వచ్చిన జగన్‌ తనపైన, ఎంపీ మురళీమోహన్‌పైన అనేక ఆరోపణలు చేశారని, వాటికి ఆధారాలున్నాయా అని ప్రశ్నించారు. వాటర్‌వర్క్స్‌, గౌతమీఘాట్‌ వద్ద ఇసుక ర్యాంపులను ఎప్పుడో ఆపేశారని, ధవళేశ్వరం వద్ద ఉన్న ర్యాంపులను వైఎస్సార్‌సిపి నాయకులే నడిపిస్తున్నారన్నారు. ఇక వేమగిరి ఇసుక ర్యాంపును సబ్‌ కలెక్టర్‌ సారధ్యంలో రెవిన్యూ అధికారులు నడిపిస్తూ ఇప్పటికి రూ.3కోట్లు ఆదా చేసి గ్రామాల అభివృద్ధికి, విఆర్‌ఓ కార్యాలయాల నిర్మాణానికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ధవళేశ్వరం ర్యాంపులలో ఇసుకను ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని, దానిని అదుపు చేయాలని గత రెండు నెలలుగా అధికారులకు విన్నవించుకుంటున్నామన్నారు. ఇసుక ర్యాంపులకు, టిడిపి నేతలకు సంబంధాలు ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం, ప్రజల సొమ్మును భక్షించే స్వభావం తనకు లేదని, తప్పు చేస్తే తలదించుకుంటానన్నారు. తప్పు చేయకుండా తలదించేలా ప్రయత్నిస్తే ఎంతవరకైనా పోరాడతానన్నారు. ఇంతవరకు ఏనాడూ పోలీస్‌స్టేషన్‌ గడప ఎక్కిన చరిత్ర తనకు లేదని, జగన్‌ పుట్టే సమయానికే తాను ఏడాదికి రూ.10లక్షలు ఆదాయపు పన్ను చెల్లించేవాడినని తెలిపారు. తన చిన్ననాటి సమయంలోనే 60 ఎకరాల మాగాణి తోట ఉండేదని, ఆస్తులను ప్రకటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, జగన్‌ అక్రమాస్తులను కూడా తాను నిరూపిస్తానని సవాల్‌ విసిరారు. పరిటాల హత్య కేసులో ప్రధాన నిందితుడు జగన్‌ కాదా అని ప్రశ్నించారు. మైనింగ్‌ మాఫియాకు అడ్డు వస్తున్నాడన్న కారణంతో గాలి సోదరులతో కలిసి జగన్‌ పరిటాల హత్యకు కుట్ర చేయించారని ఆరోపించారు. ఈ హత్య కేసులో సాక్షులను కూడా ఒక్కొక్కరిగా హతమవుతున్నారని, దీనికి కారకులెవరని ప్రశ్నించారు. జగన్‌ తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకునేందుకు బిజెపి అధ్యక్షునికి రూ.100 కోట్లు చెల్లించారన్న ప్రచారం బాహాటంగా వినిపిస్తోందన్నారు. హత్యా రాజకీయాలు చేసిన వారిని, మైనింగ్‌ మాఫియాను బిజెపి నేతలు కాపాడటం సిగ్గు చేటన్నారు. రాజమహేంద్రవరంలో తన ప్రక్కన కూర్చున్న నాయకుల చరిత్రను జగన్‌ తెలుసుకుంటే బాగుంటుందన్నారు. రూరల్‌ నియోజకవర్గంలోని పిడింగొయ్యి పంచాయితీలో, కొండగుంటూరులో పదహారు ఎకరాల స్థలాన్ని వారి పార్టీ నాయకులు ఏ విధంగా కబ్జా చేశారో తన వద్ద ఆధారాలున్నాయన్నారు. పదేళ్ళ కాంగ్రెస్‌ పాలనలో రూరల్‌ నియోజకవర్గంలో రెవిన్యూ సిబ్బందిని అడ్డంపెట్టుకుని ఎన్నో అక్రమాలు, భూకబ్జాలు జరిగాయన్నారు. అలాంటి వ్యక్తులు నీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, దోపిడీ సంపదతో విర్రవీగుతున్న జగన్‌ అధికారులను, పారిశ్రామికవేత్తలను జైలుకు పంపాడని, మరోసారి నీతి బాహ్యమైన విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ గురించి కనీస అవగాహన లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న జగన్‌ వాస్తవాలు తెలుసుకుంటే బాగుంటుందన్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టే ప్రసక్తే లేదని, రైల్వేజోన్‌ అంశాన్ని ప్రక్కన పెట్టిన బిజెపి నాయకత్వాన్ని రాళ్ళతో కొట్టాలని, అలాంటి వ్యక్తులతో చేతులు కలపడానికి జగన్‌ ఉవ్విళ్ళూరుతున్నాడన్నారు. హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలు రాజీనామా డ్రామాలు ఆడారని, ఇప్పుడు ఆ విషయం తేటతెల్లమయ్యిందన్నారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌కుమార్‌, జిల్లా టిఎన్‌టియుసి అధ్యక్షులు నక్కా చిట్టిబాబు, మాజీ కార్పొరేటర్‌ కురగంటి సతీష్‌, కార్పొరేటర్లు పాలిక శ్రీనివాస్‌, కోరుమిల్లి విజయశేఖర్‌, పార్టీ సీనియర్‌ నాయకులు యేలూరి వెంకటేశ్వరరావు, తవ్వా రాజా, గాడి శ్రీను, బండారు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here