నెహ్రూ నిర్వాక ఫలితమీ రావణకాష్టం…..

0
457
కాశ్మీరు సమస్యపై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు
మాజీ సైనికులకు సత్కారం
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 5 : మేథా సంపద కలిగిన భారతదేశం అగ్ర రాజ్యాల సరసన నిలిచేందుకు అభివృద్ధిలో దూసుకుపోతుండటంతో  పొరుగు దేశమైన చైనా ఓర్వలేక పాకిస్ధాన్‌ను మనపైకి ఉసిగొల్పుతోందని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గసభ్యులు, శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు అన్నారు. బిజెపి అర్బన్‌ జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు ఆధ్వర్యంలో ఈరోజు టి నగర్‌లోని త్యాగరాజ నారాయణదాస సేవా సమితి కళామందిరంలో వీర జవాన్లకు అభినందన సభ నిర్వహించారు. ముఖ్య అతిధిగా సోము వీర్రాజు పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే పలు సంస్థానాలను విలీనం చేసిన ఘనత సర్ధార్‌ వల్లభభాయ్‌ పటేల్‌దని అన్నారు. కాశ్మీరు విషయంలో అప్పటి ప్రధాని నెహ్రూ తీసుకున్న నిర్ణయం ఇపుడు రాచపుండుగా మారిందని, దీంతో రక్షణ కోసం ప్రతి ఏటా వేల కోట్లు కేటాయించవలసి వస్తోందన్నారు. కాశ్మీరు నిర్ణయ విషయంలో నెహ్రూతో శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ విభేదించి భారతీయ జన సంఘ్‌ను స్ధాపించారని, పాక్‌ ఆక్రమిత కాశ్మీరును ఎందుకు స్వాధీనం చేసుకోకూడదని ఆనాడే ప్రశ్నించారని అన్నారు. సరిగ్గా అక్కడే నాలుగు రోజుల క్రితం మెరుపు దాడులు జరిగాయని గుర్తు చేశారు. దేశం మధ్యలో ఉన్న హైదరాబాద్‌ను విలీనం చేసుకున్నప్పుడు కాశ్మీరును  వదిలిపెట్టడం దారుణమన్నారు. కాశ్మీరును ప్రత్యేక దేశంగా చేసి, ప్రధానమంత్రిని కూడా నియమించేలా నెహ్రూ ఆలోచించారని, కాశ్మీరు వెళ్ళాలంటే పాస్‌పోర్టు తప్పనిసరి అయ్యేలా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ వ్యతిరేకించి కాశ్మీరు భూభాగంలోకి అడుగుపెట్టినపుడు ఆయనను అరెస్టు చేసి జైలులో పెట్టగా అక్కడే తుది  శ్వాస విడిచారని వీర్రాజు ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశం కోసం ప్రాణాలు విడిచిన గొప్ప నాయకుడు ముఖర్జీ అని, బిజెపి పదవుల  కోసం పనిచేయదని, ప్రజల కోసం పనిచేస్తుందన్నారు. భారతదేశ  ఔన్నత్యానికి భయపడి పాకిస్తాన్‌ ఉగ్రవాదులను ఉసిగొల్పుతుందన్నారు.   భారత సైనికులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. మాజీ సైనికులకు ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని నిబంధన ఉన్నా కొన్ని ప్రాంతాల్లో స్ధలాలు లేనందున స్ధల రూపేణా నగదు అందించాలన్న ప్రతిపాదనను ప్రధానికి తెలియజేస్తానన్నారు. పదవ తరగతి తప్పిన విద్యార్ధులు దేశ సైనికులుగా వెళుతున్నారంటూ కన్నయ్యకుమార్‌ చేసినట్టు చెబుతున్న వ్యాఖ్యలను సోము ఖండించారు. అటువంటి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్న కన్నయ్య వెంట కమ్యూనిస్టులు పయనించడం దురదృష్టకరమని అన్నారు. బొమ్ముల దత్తు మాట్లాడుతూ దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కుటుంబాలను విడిచిపెట్టి దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న వీర జవాన్లను సత్కరించుకోవలసిన అవసరం ఉందన్నారు. నరేంద్రమోడీ విదేశీ పర్యటనలు చేస్తూ కాలాన్ని, సొమ్మును వృధా చేస్తున్నారని విమర్శించిన నేతల నోళ్ళు మూసే విధంగా మెరుపు దాడులపై ఆయా దేశాలు మౌనంగా ఉండటమే కారణమన్నారు. ధార్వాడ రామకృష్ణ మాట్లాడుతూ మెరుపు దాడులపై ప్రజల్లో హర్షం వ్యక్తమైందన్నారు.పొట్లూరి రామ్మోహనరావు మాట్లాడుతూ పాక్‌ ఉగ్రవాదుల్ని తిప్పికొట్టడంలో మోడీ తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. యెనుముల రంగబాబు మాట్లాడుతూ మోడీ పాలన వ్యూహాత్మకంగా, ప్రణాళికబద్ధంగా ఉంటుందని, విదేశీ పర్యటన చేస్తూ అన్ని దేశాల మద్ధతును కూడగట్టారని అన్నారు. క్ష త్రియ బాలసుబ్రహ్మణ్యసింగ్‌ మాట్లాడుతూ మోడీ ప్రధాని అయ్యాక దేశం అభివృద్ధి పథంలో పరుగులు తీసో ్తందని, దీనిని చూసి ఓర్వలేకే కొంతమంది కుట్రలు పన్ని ఉగ్రవాదుల్ని రెచ్చగొడుతున్నారని అన్నారు మాజీ సైనికులు ఆదాం రాజు మాట్లాడుతూ  మోడీ ప్రధాని అయ్యాక మాజీ సైనికులకు  ఇచ్చే ఫించన్‌ను రూ. 1200 నుంచి 2 వేలు చేశారని అన్నారు. ప్ర భుత్వం నిర్మించే గృహాలను సైనికులకు కేటాయించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో  జిల్లా అధ్యక్షులు మాలకొండయ్య, మాజీ అధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణరాజు, మీడియా ఇన్‌ఛార్జి దాస్యం ప్రసాద్‌, సత్తి మూలారెడ్డి, కెవిఎం కృష్ణ, మారేడిపూడి  సుబ్రహ్మణ్యం, పసలపూడి శ్రీనివాస్‌, నల్లమిల్లి బ్రహ్మానందం, పిల్లి వెంకటరమణ, పిల్లి మణెమ్మ, కొత్తపల్లి గీత విజయలక్ష్మీ, బూర రామచంద్రావు, కె సత్యనారాయణ, హీరాచంద్‌ జైన్‌, యేసు వెంకటరమణ, లక్ష్మీనారాయణ జవ్వార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 12 మంది మాజీ సైనికులను ఘనంగా సత్కరించారు.