న్యాయం చేయకుంటే పోరాటం తప్పదు

0
262
పోలీసులకు స్పష్టం చేసిన కొండబాబు
రాజమహేంద్రవరం, నవంబర్‌ 4 : పేదలకు పంపిణీ చేసిన ఇళ్ళ పట్టాల విషయంలో న్యాయం చేయని పక్షంలో ఆందోళన తప్పదని బహుజన సమాజ్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు బర్రే కొండబాబు పోలీసులకు స్పష్టం చేశారు. పదమూడు, పదిహేడు, ఇరవై రెండు గజాల చొప్పున ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో పంపిణీ చేసిన ఇళ్ళ పట్టాల వ్యవహారంలో న్యాయం చేయని పక్షంలో ఆదిరెడ్డి ఇంటి వద్ద ఆందోళన చేస్తానన్న బర్రే కొండబాబు హెచ్చరిక తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదిరెడ్డి ఇంటి వద్ద ఆందోళన చేయనని రాతపూర్వకంగా సంతకం చేయాలని త్రీ టౌన్‌ పోలీసులు ఆదివారం బర్రే ఇంటి వద్ద హడావిడి చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ఇచ్చిన నోటీసుపై సంతకం చేయాలని కొండబాబుపై ఒత్తిడి తీసుకువచ్చారు. నోటీసు తీసుకోవడానికి తనకు అభ్యంతరం లేదని, ఆదిరెడ్డి ఇంటి వద్ద ఆందోళన చేయనని మాత్రం సంతకం చేసేది లేదని స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో కొండబాబు నివాసం వద్దకు క్వారీ ప్రాంత ప్రజలు, పట్టాల బాధితులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతం ఉద్రిక్తతంగా మారింది. నోటీసుపై సంతకం చేస్తే తాము వెళ్ళిపోతామని పోలీసులు స్పష్టం చేసిన కొండబాబు ససేమిరా అన్నారు.ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ పట్టాల పంపిణీ వ్యవహారంలో బాధితులకు న్యాయం చేయని పక్షంలో ఆదిరెడ్డి నివాసాన్ని వెయ్యిమందితో ముట్టడించడం ఖాయమని, అందుకు ప్రజలు సన్నద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.డివిజన్‌తో పాటు క్వారీ ఏరియా ప్రజల అభివృద్ధికి అడ్డుకుంటే ఎంతటి ఉద్యమానికైనా బహుజన సమాజ్‌ పార్టీ సిద్దంగా  ఉందని అన్నారు.పట్టాల పంపిణీ వ్యవహారంలో సోమవారంలోగా పరిష్కరించకపోతే పోలీసులు అడ్డుకున్నా ఆదిరెడ్డి నివాసాన్ని ముట్టడించడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టాల పంపిణీ బాధితులు, డివిజన్‌ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here