న్యాయవాదుల జీవితాలలో వెలుగులు నింపిన చంద్రబాబు

0
251
జగన్‌ పాదయాత్ర అనుమతి నిరాకరణలో ప్రభుత్వానికి సంబంధం లేదు
నేనెందుకు క్షమాపణలు చెప్పాలి.. రూరల్‌లో భూకబ్జాల బండారం బయటపెడతా : గోరంట్ల
రాజమహేంద్రవరం, జూన్‌ 11 : గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేసే విషయంలో ఆర్థిక లోటుపాట్లు ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబునాయుడు మాట తప్పకుండా అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారని, అందులో భాగంగా న్యాయవాదులు అడిగిన దాని కన్నా ఎక్కువ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారని రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. టి.నగర్‌లో హోటల్‌ సితారలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  న్యాయవాదులు, టిడిపి నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ ఇటీవల పదిలక్షలమందికి నిరుద్యోగ భృతి ప్రకటించిన చంద్రబాబు జూనియర్‌ న్యాయవాదులకు ప్రస్తుతం ఇస్తున్న స్టైఫండ్‌ రూ.వెయ్యిను రూ.5వేలకు పెంచారని తెలిపారు.న్యాయవాదులు చనిపోతే బార్‌ కౌన్సిల్‌ ద్వారా రూ.4లక్షలు ఆ కుటుంబానికి సహాయం అందించేవారని, దానిని రూ.8లక్షలకు పెంచినట్లు తెలిపారు. అదనపు గవర్నమెంట్‌ ప్లీడర్లకు రూ.20వేల నుంచి రూ.30వేలు, గవర్నమెంట్‌ ప్లీడర్‌కు రూ.30వేల నుంచి రూ.50వేలకు పెంచినట్లు పేర్కొన్నారు. జర్నలిస్టులకు మంజూరు చేసిన విధంగా గృహాలను, వైద్య సేవలను త్వరలో కల్పిస్తామని, నూతనంగా న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టే వారి కోసం జ్యుడీషియల్‌ అకాడమీని ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నామన్నారు. రాజవోలులో జరిగిన సంఘటనపై తాను క్షమాపణ చెప్పాలని కొంతమంది నాయకులు రోడ్లెక్కడం సరికాదని, అంబేద్కర్‌ దయ వల్లే తాను ఈ స్థితిలో ఉన్నానని పేర్కొన్నారు. కొంతమంది మార్ఫింగ్‌ చేసి తాను అంబేద్కర్‌ను అవమానపరిచానని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, వారిపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో సమాధానం చెప్పాలన్నారు. రాజవోలులో కొంతమంది తెదెపాలోకి చేరడం జీర్ణించుకోలేకే తనపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, తన 35 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఇలాంటి   సంఘటనలకు ఎప్పుడూ పాల్పడలేదన్నారు. తన జోలికి వచ్చిన వారి భరతం పడతానని, రూరల్‌లో జరుగుతున్న భూకబ్జాల సంగతి తేలుస్తానని హెచ్చరించారు. ఇసుక ర్యాంపుల్లో అక్రమాలు జరుగుతున్నాయని కొంతమంది ఆరోపణలు చేస్తునారని, ఆ ర్యాంపులను వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు చెందిన వారే నడిపిస్తున్నారన్నారు. వై.ఎస్‌.జగన్మోహనరెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర రోడ్‌ కమ్‌ రైలు బ్రిడ్జిమీదుగా రాజమహేంద్రవరంలోకి ప్రవేశించడానికి అధికారులు నిరాకరించారని, దానికి, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. గతంలో చంద్రబాబు పాదయాత్ర సమయంలో కూడా అప్పటి ప్రభుత్వం అనుమతి నిరాకరించిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు వైద్య రంగంపై ప్రత్యేక శ్రద్ధకనబరుస్తున్నారని, ఎన్టీఆర్‌ వైద్య సేవ పరిధిలోనికి రాని వ్యాధులకు చికిత్స చేయించుకునే నిరుపేదలకు సీఎం సహాయనిధి ద్వారా కోట్లాది రూపాయలను పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 12 మందికి రూ.8లక్షల 45వేల 710ల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, ప్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాసరావు, నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి, కార్పొరేటర్‌ కొమ్మ శ్రీనివాస్‌, మాజీ కార్పొరేటర్‌ కురగంటి సతీష్‌, మైనార్టీ నాయకులు హబీబుల్లాఖాన్‌, రొంపిచర్ల ఆంథోని, న్యాయవాదులు సురేంద్రప్రసాద్‌, యార్లగడ్డ శేఖర్‌, చక్రధర్‌, మేకా శ్రీనివాసరావు, నర్సింగ్‌ శ్రీను, వీరభద్రరావు, రాజేశ్వరి, రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here