పక్కింటి మంగళం

0
156
మనస్సాక్షి  – 1160
అప్పుడే తెల్లవారింది. చిన్నగా చినుకులు పడు తుండడంతో గిరీశం మార్నింగ్‌ వాక్‌కి వెళ్ళ లేదు. యింటరుగు మీద కూర్చుని తీరిగ్గా చుట్ట గుప్పుగుప్పుమనిపిస్తున్నాడు. యింకో పావు గంట అలా గడిచిందో లేదో వెంకటేశం ఆదరా బాదరా వచ్చాడు. అయితే రావడం రావడం ఏదో ఫోన్‌ మాట్లాడుతూ వచ్చాడు. ”ఆ.. ఏదోలా తీసేసుకోండి” అంటున్నాడు. గిరీశాని కయితే ఆ తీసుకునేదేంటో అర్థం కావడం లేదు. ఈలోగా వెంకటేశం కూడా అరుగుమీద సెటిలయ్యాడు. యింతలో మళ్ళీ ఫోన్‌ మోగింది. ఈసారి అవతల నుంచి యింకెవరో. అవతలి వ్యక్తి చెప్పింది విన్నాక ”లక్ష కాదు.. లక్షన్నరయినా ఫర్వాలేదు. మనకా యిల్లే కావాలి” అన్నాడు వెంకటేశం. దాంతో అవతల్నుంచి ”అది కాద్సార్‌.. ఆ వెనకాల వీధిలో అయితే దానికి బాబులాంటి బిల్డింగ్‌ యాభైవేలకే వస్తుంది. అది చూడమంటారా” అంటున్నాడు. దాంతో వెంకటేశం అసహనంగా ”ఏం చేసుకోవాలంట. మనక్కా వలసింది ఆయన యింటికి ఆనుకుని ఉన్న బిల్డింగ్‌. అదే చూడు” అని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. అంతా వింటున్న గిరీశం అదిరిపోయి ”ఏంటోయ్‌..ఏదో లక్షల్లో అద్దెకి తీసుకుంటున్నట్టున్నావ్‌.. ఎక్కడ?” అన్నాడు. దానికి వెంకటేశం ”అవును గురూగారూ.. సీఎంగారి యింటిపక్క యిల్లులెండి. అద్దె లక్షన్నరయినా తీసుకుందా మను కుంటున్నా” అన్నాడు. దాంతో గిరీశం అదిరిపోయి ”ఎందుకూ?” అన్నాడు. దాంతో వెంకటేశం ”ఎందుకంటారేంటి గురూగారూ.. సీఎం గారింటి పక్కనుంటే ఎన్నుపయోగాలుంటాయనేది మీకు తెలీందేముంది. ఆయనతో పరిచయం ఏర్పడిపోతే ఏ పను లయినా చకచకా చేయించేసుకోవచ్చు” అన్నాడు. దాంతో గిరీశం పెద్దగా నవ్వేసి ”నీ ఆలోచనేదో బావుందోయ్‌.. అయితే దీని గురించి నీకో చిన్న హెచ్చరికలాంటిది చేయాలోయ్‌” అన్నాడు. దాంతో వెంకటేశం అదేంటన్నట్టుగా చూశాడు. అప్పుడు గిరీశం ”నీకో చిన్న ఊహలాంటిది చెబుతా. దాని కోసం నిన్ను కొంచెంగా గతంలోకి తీసుకెడతా” అంటూ చెప్పడం మొదలెట్టాడు.
——-
రెండేళ్ళ క్రితం.. అమరావతి కళకళలాడిపోతోంది. అందులోనూ ఆ వీధి మరీనూ. యింతకీ అది సీఎం బాబు గారు నివాసమున్న వీధి. సీఎంగారుంటున్న వీధంటే ఆ హడావిడి మామూలే. అయితే  ఆ వీధిలో ఓ విశేషముంది. ఆ వీధిలో సీఎంగారితో పాటు యింకా ఎందరో ప్రముఖుల యిళ్ళున్నాయి. వాళ్ళతోపాటు ఓ సామాన్యుడి యిల్లు కూడా ఉంది. ఆ యిల్లు కూడా సీఎం గారి యింటికి ఆనుకునే. యింతకీ ఆ యింట్లో ఉంటోంది వెంకటేశం.! ఆరోజు ఉదయాన్నే ఎవరో తలుపులు కొట్టేసరికి వెంకటేశం తలుపులు తెరిచాడు. తీరా చూస్తే ఎదురుగా గిరీశమూ, యింకో కొత్త వ్యక్తీ ఉన్నారు. దాంతో వెంకటేశం ఆనందాశ్చర్యాలతో ”యిదేంటి గురూగారూ.. చెప్పాపెట్టకుండా వచ్చేశారే” అన్నాడు. దాంతో వెంకటేశం ”వస్తున్నామని చెప్పడానికి రాత్రే నీకు ఫోన్‌ చేశానోయ్‌.. నీ ఫోను స్విచ్ఛాఫ్‌ చేసుందిలే” అన్నాడు. దానికి వెంకటేశం ”అవును గురూగారూ.. రాత్రి చాలాసేపు సీఎంగారి దగ్గర మాట్లాడతా ఉండిపోయా. అప్పుడు ఫోన్‌ కట్టేశా” అన్నాడు. దాంతో గిరీశం, కూడా వచ్చిన నారాయణరావూ అదిరిపోయారు. తర్వాత అంతా హాల్లో కూర్చుని కబుర్లలో పడ్డారు. యింతలో గిరీశం ”అవునోయ్‌.. ఈ యిల్లు కొనేసినట్టేనా?” అన్నాడు. వెంకటేశం తలూపి ”అవును గురూగారూ.. మనూర్లోని మొత్తం ఆస్తుల్ని అమ్మేసి పాతికి కోట్లు పెట్టి మరీ కొన్నా. ముందయితే అద్దెకి తీసుకోడానికి ప్రయత్నించాగానీ అలా యివ్వనన్నారు. అందుకే కొనేశా” అన్నాడు. గిరీశం మెచ్చుకుంటున్నట్టుగా.. మంచి పని చేశావోయ్‌.. యిప్పుడు మేము వచ్చింది చిన్న పనిమీద. ఈయన నారాయణరావని మనూరే. వీళ్ళమ్మాయి ఈ మధ్యే ఏదో పరీక్ష రాసింది. వీళ్ళకి చిన్నపాటి రిజర్వేషను కూడా ఉందిలే. సీఎం బాబు గారు ఓ చిన్న లెటర్‌ యిచ్చేస్తే ఆ ఉద్యోగమేదో ఆ అమ్మాయికి వచ్చేస్తుంది. నువ్వే చేసిపెట్టాలి” అన్నాడు. దాంతో వెంకటేశం పెద్దగా నవ్వేసి ”చిన్న లెటరేం ఖర్మ… యివాళే బాబు గారితో మాట్లాడి జీవోనే యిప్పించేస్తా. యింకా కావలిస్తే చట్టం కూడా చేయించేస్తా” అన్నాడు. దాంతో గిరీశం మొహం వెలిగిపోయింది. యింతలో నారాయణరావు జేబులోంచి ఓ రెండు లక్షలు తీసి వెంకటేశానికివ్వబోయాడు. ఈలోగా గిరీశం ”యిదేపని బయటవాళ్ళకి చేయించ డానికి ఎంత తీసుకుంటావో తెలీదు. దీంతో పని చేసిపెట్టాలి” అన్నాడు. వెంకటేశం ససే మిరా అని తిరస్కరించాడు. తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళి పోయింతర్వాత సూట్‌కేసులో డబ్బు లతో యింకెవరో వచ్చారు.
——-
ప్రపంచంలో ఎవరికీ అంతుపట్టని విష యాలు కొన్నుంటాయి. వాటిలో తెలుగు ఓటరు నాడి కూడా ఒకటాయె. ఎప్పు డెవరిని అందలం ఎక్కిస్తాడో, ఎవరిని కిందకి లాగేస్తాడో ఎవరికీ తెలీదు. రెండేళ్ళ తర్వాత వచ్చిన ఎలక్షన్స్‌లో అదింకోసారి బయట పడింది. ఖచ్చితంగా అధికారంలోకొస్తుందన్న బాబుగారి పార్టీ రాలేదు. అసలు తామే ఊహించని స్థాయిలో జగన్‌ పార్టీకి సీట్లొచ్చేశాయి. దాంతో బాబు దిగిపోయి జగన్‌ పీఠం ఎక్కడం జరిగింది. యిక ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన  పార్టీకి రెండే టార్గెట్‌లు. ఒకటి మేనిఫెస్టోలో యిచ్చిన హామీల నిలబెట్టు కోవడం. రెండోది అంతకుముందు తమని యిబ్బందులు పెట్టిన పాత ప్రభుత్వాన్ని యిబ్బందులు పెట్టి రివెంజ్‌ తీర్చుకోవడం..! యింకేముంది.. ముందుగా పాత ప్రభుత్వం పెట్టిన పథకాలన్నీ రద్దు కావడమో, పేర్లు మారడమో జరిగిపోయాయి. యింకా బాబు గారి టీమ్‌ మీద యుద్ధం కూడా మొదలయింది. పాత కొత్త పాలకుల మధ్య జరిగే ఈ మహాయుద్ధంలో ఓ విశేషం జరిగింది. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఆ పెద్ద తలకాయల గొడవల మధ్యలో పిడుగేదో ఓ అమాయక మంగళం మీద పడింది. యింతకీ ఆ మంగళం పేరు సీఎం గారింటి పక్కింట్లో ఉండే వెంకటేశం..! ఆరోజు ఉదయాన్నే ఎవరో తలుపులు కొట్టేసరికి వెంకటేశం తలుపులు తెరిచాడు. తీరా చూస్తే ఎదురుగా ఎవరో యిద్దరు ఆఫీసర్లు కనిపించారు. వారెవరా అని చూస్తుండగానే వారిలో ఓ శాల్తీ ”నా పేరు శివశంకర్‌.. మేము అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీస్‌ నుంచి వస్తున్నాం. ఈ కరకట్టలో నిర్మాణాలన్నీ అక్రమ కట్టడాలే. అవన్నీ  కూల్చేస్తాం. వాటిలో మీ యిల్లూ ఉంది. ముందది కూల్చెయ్యబోతున్నాం” అన్నాడు. దాంతో వెంకటేశం దిగాలుగా ”మరి యింతమంది పెద్ద పెద్దోళ్ళ యిళ్ళన్నీ ఉండగా ముందుగా నా యింటి మీదకి వచ్చారే?” అని అడిగాడు. దాంతో శివశంకర్‌ భోళాగా నవ్వేసి ”ముందుగా బాబుగారి యిల్లు బద్దలుకొట్టేస్తే అంతా అల్లరయి పోవచ్చు. గొడవలు జరిగి ఆ ప్రక్రియే ఆగిపోవచ్చు. అందుకే ముందుగా మీలాంటివాళ్ళ యిల్లు పడగొట్టడం మొదలెట్టేస్తే యింకే యిబ్బం దులూ లేకుండా బాబు గారి యిల్లు కూడా పడగొట్టేయొచ్చు” అని శెలవిచ్చాడు. వెంకటేశం దిగులుగా తలూపాడు.
——–
”అదోయ్‌ చిన్న ఊహ” అన్నాడు గిరీశం. దాంతో వెంకటేశం గుర్రుమని ”ఏంటో గురూగారూ.. గాలి తీసేశారనుకోండి” అన్నాడు. ఈలోగా గిరీశం యింకో చుట్ట అంటించుకుని ”అవు నోయ్‌.. జరుగుతున్న చరిత్రంతా యిలాగే ఉంటుంది. ఒక ప్రభుత్వం మారితే, ఆ కొత్త ప్రభుత్వం వచ్చి అర్జంటుగా పాత పాలకుల మీద రివెంజ్‌ తీర్చుకోడమే. యిది చర్విత చరణం. అయితే ఈ ప్రక్రియలో ఆ రివెంజేదో నేరుగా పాతరాజు గారి మీద తీర్చేసుకుంటే అల్లరయిపోతుంది. అందుకే నేరుగా రాజుని.. అదే.. మాజీ సీఎంని ఢీకొనకుండా ఆయన చుట్టూ ఉండే ఆయన బలగాలని బలహీనపరుచుకుంటూ వచ్చేస్తారు. దాంతో సదరు రాజుగారిని దెబ్బతీయడం ఈజీ అయిపోతుంది. ఈ ప్రక్రియలో నీలాంటి బకరాలు బలయిపోవడం మామూలే. ఏతావాతా చెప్పే దేంటంటే.. గులాబీ పువ్వు కావలిస్తే దాని వెంట ఉండే ముల్లు గుచ్చుకునే రిస్క్‌ గురించి కూడా ఆలోచించుకోవాలి. అలాగే ఏవో ప్రయోజనాలు ఆశించి అధికారంలో ఉన్న తలకాయలని అంటిపెట్టుకుని ఉంటే ఎన్నో లాభాలయితే కలగొచ్చు. అలాగే ఏదోరోజు నిండా మునిగే అవకాశం కూడా ఉంది. దానిక్కారణం ఏ ప్రభుత్వమూ శాశ్వతంగా ఉండదు. ప్రభుత్వం మారినప్పుడల్లా పాత ప్రభుత్వంపై వేధింపులకి పాల్పడే సంస్కృతి మన వ్యవస్థలో నడుస్తున్నంతసేపూ యిలాంటి పరిణామాలు తప్పవు అంటూ తేల్చాడు.
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here