పద్మశ్రీ పురస్కారంతో గౌరవించాలి 

0
316
సరస్వతీ పుత్రుడు డా. కర్రి రామారెడ్డికి ఆ గౌరవం రావాలి
బిసి రాయ్‌ జాతీయ అవార్డు దక్కడంపై హర్షాతిరేకాలు
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  19 : కృషి, పట్టుదలకు, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి విభిన్న రంగాల్లో అసమాన ప్రతిభా పాటవాలను చాటుతూ బహుముఖ సేవలందిస్తూ  సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలిచి గోదావరి ప్రాంత ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేస్తున్న ప్రఖ్యాత మానసిక వైద్య నిపుణులు, నిర్విరామ పరిశోధకుడు, సామాజిక దిక్సూచి, నిరంతర విద్యార్ధి డాక్టర్‌ కర్రి రామారెడ్డికి కేంద్ర ప్రభుత్వ పౌర పురస్కారం ‘పద్మశ్రీ’ రావాలని పలువురు ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారానికి డాక్టర్‌ రామారెడ్డి ని ఎంపిక చేయాలని వారు కోరారు. వైద్య ప్రపంచంలోనే అత్యున్నతమైన డాక్టర్‌ బిసి రాయ్‌ నేషనల్‌ అవార్డుకు డాక్టర్‌ కర్రి రామారెడ్డి ఎంపికైన సందర్భాన్ని పురస్కరించుకుని స్ధానిక ప్రకాశం నగర్‌లోని మానస హాస్పటల్‌లో ఈరోజు పలువురు వైద్య రంగ ప్రముఖులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈరోజు డాక్టర్‌ రామారెడ్డి జన్మదినోత్సవాన్ని కూడా పురస్కరించుకుని పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా మెంబర్‌, జిఎస్‌ఎల్‌ మెడికల్‌ కళాశాల, ఆసుపత్రి చైర్మన్‌ డాక్టర్‌ గన్ని భాస్కరరావు, ఇండియన్‌ మెడికల్‌ అసోషియేషన్‌ రాజమహేంద్రవరం శాఖ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ వేలూరి రామచంద్ర, డాక్టర్‌ గురుప్రసాద్‌ తదితరులు గోదావరి తీరానికి గర్వ కారకులైన డాక్టర్‌ రామారెడ్డిని సత్కరించి ఆయనకు ఎంతో కాలంగా అందరి ఆకాంక్షగా ఉన్న పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించాలని, అందుకు మన ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. డాక్టర్‌ గన్ని భాస్కరరావు మాట్లాడుతూ వైద్య ప్రపంచంలోనే అత్యున్నతమైన బిసి రాయ్‌ నేషనల్‌ అవార్డు  డాక్టర్‌ రామారెడ్డికి లభించడం మన నగరానికే గర్వకారణమన్నారు. గోదావరి తీరం గర్వించదగ్గ వైద్యుల్లో డా. రామారెడ్డి ఒకరని, సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఆయనకు ఇంకా ఎనో ్న అవార్డులు రావాలని, కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించాలని ఆయన కోరారు. ఐఎంఎ నగర అధ్యక్షులు డాక్టర్‌ వేలూరి రామచంద్ర మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి వైద్య రంగంలో విశిష్ట సేవలందించిన డాక్టర్‌ బిసి రాయ్‌ పేరిట ప్రారంభించిన ఈ అత్యున్నతమైన అవార్డు సరస్వతీ పుత్రులైన డా. రామారెడ్డికి రావడం ఎంతో ఆనందంగా, గర్వకారణంగా ఉందని  అన్నారు. వైద్య రంగంలో, సామాజిక రంగంలో ఆయన అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని, వైద్యునిగా తీరిక లేకున్నా ఎన్నో డిగ్రీలు సంపాదించుకుని నేటికీ తన విద్యా ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఆయనకు పద్మశ్రీ పురస్కారం రావాలని ఆయన ఆకాంక్షించారు. ఐఎంఏ నగర కార్యదర్శి  డా.  గురుప్రసాద్‌ మాట్లాడుతూ దేశంలో ఎనిమిది మందికి డా. బిసి రాయ్‌ అవార్డు లభించగా వారిలో ఇద్దరు తెలుగు వారు ఉండగా ఆ ఇద్దరిలో ఒకరు డాక్టర్‌ కర్రి రామారెడ్డి కావడం ఆనందంగా, గర్వకారణంగా ఉందన్నారు. వైద్యునిగా ఎందరికో మానసిక స్వస్ధత చేకూరుస్తూ తీరిక లేకున్నా నిరంతర విద్యార్ధిగా నేటికీ విద్యా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ సామాజిక సేవలందిస్తూ సమాజాన్ని జాగృతిపరుస్తూ ఎందరికో స్ఫూర్తిప్రదాతగా నిలిచిన  డాక్టర్‌ కర్రి రామారెడ్డిని పద్మశ్రీ పురస్కారంతో గౌరవించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు.ఆంధ్రకేసరి యువజన సమితి మాజీ అధ్యక్షులు ఫణి నాగేశ్వరరావు మాట్లాడుతూ నేటి తరానికి, భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచిన డా. రామారెడ్డికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించాలని, అందుకు మన ప్రజాప్రతినిధులంతా కృషి చేయాలని అన్నారు. భారత వికాస పరిషత్తు మాజీ అధ్యక్షులు పివిఎస్‌ కృష్ణారావు మాట్లాడుతూ డా. రామారెడ్డికి డిగ్రీలు, అవార్డులు రావడం కొత్త విషయమేమీ కాదని, ఆయనకు అవార్డు రావడం ద్వారా నగర ఖ్యాతి మరింత పెరుగుతోందన్నారు.
 అవార్డు రావడానికి మూల కారకులు డా. గన్ని భాస్కరరావు
తన ప్రస్థానంలో అడుగడుగునా ప్రోత్సాహాన్ని, సహకారాన్ని అందిస్తున్న మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా మెంబర్‌, జిఎస్‌ఎల్‌ మెడికల్‌ కళాశాల, ఆసుపత్రి చైర్మన్‌ డా.గన్ని భాస్కరరావుకు తాను సర్వదా రుణపడి ఉంటానని బి.సి.రాయ్‌ అవార్డు గ్రహీత డా. కర్రి రామారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ బిసి రాయ్‌ అవార్డు రావడానికి కూడా డా. భాస్కరరావు మూల కారకులన్నారు. దేశంలో బహుకొద్ది మందికి అరుదుగా లభించే డా. బిసి రాయ్‌ నేషనల్‌ అవార్డు 2014 సంవత్సరానికి తనకు దక్కడం ఎంతో ఆనందంగా ఉందని, దీని వెనుక ఎందరో ప్రోత్సాహం, సహకారం ఉందన్నారు. వైద్యునిగా సేవలందించడంతో పాటు సామాజిక, మానసిక రుగ్మతలపై ప్రజల్లో ఉన్న అపోహలను రూపుమాపడానికి ప్రతిఫలాపేక్ష లేకుండా అంకితభావంతో తాను చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం ఆనందంగా ఉందన్నారు. నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉండాలనే నిరంతర విద్యా ప్రయాణాన్ని కొనసాగిస్తున్న తనకు పద్మశ్రీ పౌర పురస్కారం రావాలని పలువురు ఆకాంక్షిస్తున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని, ఈ పురస్కారానికి ఎన్‌టిఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ ఎనిమిదేళ్ళ క్రితమే తన పేరు ప్రతిపాదించిందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. డాక్టర్‌ గన్ని భాస్కరరావుతో పాటు ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు, ఇతర వైద్యుల ప్రోత్సాహంతో బిసి రాయ్‌ అవార్డుకు తన పేరుని ప్రతిపాదించగా వారు ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. బిసి రాయ్‌ అవార్డును వచ్చే ఏడాది జులై 1న డాక్టర్స్‌ డే సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్నట్లు డాక్టర్‌ రామారెడ్డి తెలిపారు.