పబ్లిసిటీపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదు

0
443
షర్మిలారెడ్డి, బొంతా శ్రీహరిలపై టిడిపి నాయకుల మండిపాటు
 
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 17 : ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టిసారించాల్సిన వైకాపా ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి పబ్లిసిటీకే పరిమితమైపోతున్నారని, 30 ఏళ్ళ రాజకీయ అనుభవం గల ఆదిరెడ్డి అప్పారావును విమర్శించే స్థాయి ఆమెకు లేదని  మాజీ కార్పొరేటర్లు మానే దొరబాబు, బొమ్మనమైన శ్రీనివాస్‌ అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మానే దొరబాబు మాట్లాడుతూ  ప్రజా సమస్యల పరిష్కారానికి కౌన్సిల్‌ మాత్రమే వేదిక కాదని, ఏ సమయంలోనైనా లిఖితపూర్వకంగా, ఉద్యమరూపంగానో సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. పబ్లిసిటీ మత్తులో పడి డివిజన్‌లో ఉన్న సమస్యలను మేడపాటి షర్మిలారెడ్డి, బొంతా శ్రీహరిలు వదిలేశారని ధ్వజమెత్తారు. ఆదిరెడ్డిపై సవాల్‌ చేసేంత దమ్ము బొంతా శ్రీహరికి లేదని, ఆయనకు దమ్ముంటే పోటీ చేసి గెలిచిన వార్డులోనే రాజీనామా చేసి తిరిగి అదే డివిజన్‌ నుంచి గెలిచి చూపాలని సవాల్‌ విసిరారు. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 2007లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆదిరెడ్డి అప్పారావు తన భార్య వీర రాఘవమ్మను మేయర్‌గా నిలబెట్టి ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడమే కాకుండా తెదేపాకు ఎక్కువ స్థానాలను నిలబెట్టి నగరపాలక సంస్థలో తెదేపా జెండాను ఎగరవేసిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. బొమ్మనమైన శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఆదిరెడ్డిపై బొంతా శ్రీహరి సవాల్‌ బాధాకరమన్నారు. బొంతా శ్రీహరి వ్యక్తిగత జీవితమేమిటో, ఆయన ఏ కేసులపై జైలుకు వెళ్ళాడో అందరికీ తెలుసన్నారు. ముక్కూ మొఖం తెలియని మేడపాటి షర్మిలారెడ్డిని 3వ డివిజన్‌లో నిలబెట్టి 1700కు పైగా మెజార్టీని తీసుకువచ్చిన ఘనత ఆదిరెడ్డి అప్పారావుది కాదా అని ప్రశ్నించారు. తెదేపాకు కంచుకోటగా ఉన్న 3వ డివిజన్‌ను వైకాపా డివిజన్‌గా మార్చగలిగామన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. షర్మిలారెడ్డి, బొంతా శ్రీహరిలు రాజీనామా చేసి తిరిగి పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కించుకోలేరని, అలా దక్కించుకుంటే తాము రాజకీయాల్లో ఉండబోమని సవాల్‌ చేశారు. తురకల నిర్మల మాట్లాడుతూ షర్మిలారెడ్డికి మతిభ్రమించడం వల్లే సీనియర్‌ నాయకుడైన ఆదిరెడ్డిపై విమర్శలు చేస్తోందన్నారు. రాజకీయ విలువలు తెలియని షర్మిలారెడ్డి తాను నివసిస్తున్న 8వ డివిజన్‌లో పోటీ చేయడం మానేసి 3వ డివిజన్‌లో పోటీ చేసిందని, ఆ సమయంలో ఆదిరెడ్డి అప్పారావు చొరవ తీసుకుని టిక్కెట్‌ ఆశించిన బొమ్మనమైన శ్రీనివాస్‌ను ఒప్పించి షర్మిలారెడ్డిని గెలిపించారన్నారు. రాజకీయాలంటే ఫొటోలకు ఫోజులివ్వడమే అనుకునే నాయకులు ముందుకు రావడం దురదృష్టకరమన్నారు. ఇటువంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే సరైన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో తెదేపా నాయకులు బూరాడ భవానీశంకర్‌, కడితి జోగారావు, మాలే విజయలక్ష్మి, తురకల నిర్మల, భాగ్యలక్ష్మి, మిస్కా జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు.