పాడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

0
631

శాసనమండలిలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి వినతి

రాజమహేంద్రవరం, మార్చి 28 : రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా హర్యానా, ఇతర రాష్ట్రాల నుంచి పశువుల కొనుగోలుకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీతోపాటు రవాణా, ఇన్స్యూరెన్స్‌ సౌకర్యాన్ని కల్పించాలని శాసనమండలిలో ఈరోజు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోరారు. ఇతర రాష్ట్రాల నుంచి పశువుల కొనుగోలుకు రూ.60వేలు ఖర్చవుతుండగా ప్రభుత్వం రూ.30వేలు సబ్సిడీ ఇస్తోందన్నారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి పశువులను ఈప్రాంతాలకు తీసుకువచ్చేందుకు రవాణా ఛార్జీలు ఎక్కువగా అవుతున్నాయని, దీనికి తోడు మార్గమధ్యలో ఏదైనా ప్రమాదం జరిగితే సంబంధిత రైతు తీవ్రంగా నష్టపోతున్నాడని వాపోయారు. ప్రభుత్వం రైతులను దృష్టిలో పెట్టుకుని రవాణా ఛార్జీలతోపాటు ఇన్స్యూరెన్స్‌ సౌకర్యం నిమిత్తం అదనంగా నిధులు మంజూరు చేయాలని ఆదిరెడ్డి కోరారు. దీనిపై సంబంధిత శాఖా మంత్రి ఆదినారాయణరెడ్డి స్పందిస్తూ పాడి రైతులకు పశువుల కొనుగోలుకు రూ.30వేలు సబ్సిడీతోపాటు అదనంగా రూ.10వేలు అందజేస్తామని, ఇవి రవాణా ఛార్జీలకు ఇన్స్యూరెన్స్‌ సదుపాయానికి వినియోగించుకోవాలని సూచించారు. గడ్డిని కోసేందుకు వినియోగించే కట్టర్లను ఎక్కడైనా కొనుగోలు చేసుకుని ప్రభుత్వ సబ్సిడీని పొందే విధంగా ప్రభుత్వం సిద్ధం చేసిందన్నారు. పశువుల కోసం ఫైలేజ్‌ గడ్డిని ప్రభుత్వం కేజీ రూ.2కే సబ్సిడీపై అందిస్తోందని, అయితే 300 నుంచి 400 కేజీల బండిల్స్‌ ఇస్తుండటం ద్వారా రవాణా చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సభ దృష్టికి తెచ్చారు. దీనిపై ప్రభుత్వం స్పందించి 50 నుంచి 100 కేజీల బండిల్స్‌ను సరఫరా చేస్తే ఇబ్బందులు లేకుండా ఉంటాయన్నారు. మేలుజాతి పశువుల పెమన్‌ను ప్రతి పశు వైద్యశాలలో అందుబాటులో ఉంచాలని కోరగా మంత్రి స్పందించి తక్షణం ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here