పాత వంతెన….కొత్త సొగసులు 

0
448
రాష్ట్రానికి దఖలు పర్చేందుకు రైల్వే శాఖ అంగీకారం
సీఎం చంద్రబాబు కృషితో పర్యాటక ప్రాజక్ట్‌ల్లో కదలిక
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 5 : గోదావరి నదిపై రాజమహేంద్రవరం-కొవ్వూరు మధ్య ఉన్న హేవలాక్‌  బ్రిడ్జి (పాత రైలు వంతెన) ఇక  రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి రానుంది. అందుకు రైల్వే శాఖకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 9.7 కోట్లను చెల్లించనుంది. ఈ వంతెనను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు  రైల్వే శాఖ పచ్చ జెండా ఊపింది. వారం రోజుల్లో అప్పగింతకు సంబంధించిన లాంఛనాలు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రిటీష్‌ వారి హయాంలో నిర్మితమై చెన్నై -కోల్‌కత్తా మధ్య ప్రధాన వారధిగా ఉండి దాదాపు వంద సంవత్సరాలపాటు సేవలందించిన ఈ వంతెనను తమకు అప్పగిస్తే పర్యాటకంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ వసో ్తంది. అయితే రైల్వే శాఖ నియమ నిబంధనలు, లాంఛనాలు పూర్తి కావడంలో జాప్యం జరగడంతో రాష్ట్ర ప్రభుత్వానికి దఖలు పర్చడంలో కాలయాపన చోటుచేసుకుంది. దీనిపై ప్రత్యేక శ్రద్ధ, దృష్టి సారించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనిపై కేంద్రంతో పలుమార్లు సంప్రదింపులు జరిపారు. ఈ వంతెనపై ఉన్న ఇసుప గడ్డర్లను వేలం వేస్తే దాదాపు పది కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని, ఆ మొత్తాన్ని తమకు చెల్లించినట్లయితే అప్పగించడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని రైల్వే శాఖ తేల్చి చెప్పడంతో ప్రభుత్వం ఇందుకు ముందుకొచ్చి ఆ మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకరించింది.  ఈ పాత వంతెన, దాని ప్రక్కనే ఉన్న మరో వంతెనల మధ్య  గోదావరి ప్రవాహంతో  కూడిన మనోహర దృశ్యం అందర్ని ఆకట్టుకుంటుండటంతో పాటు ఈ వంతెనను కాలిబాటగా మార్చి తేలికపాటి ద్విచక్ర వాహనాలను అనుమతించాలనే ఆలోచన ఉంది. అంతే గాక ఈ వంతెన ద్వారా గోదావరి లంకల్లోకి వెళ్ళే మార్గాన్ని ఏర్పాటు చేసి లంక ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలనే ఆలోచన కూడా ఉంది.  మొత్తం మీద ఈ ప్రతిపాదనలన్నీ కార్యరూపం దాల్చాలంటే ముందుగా ఈ వంతెన రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి రావలసి ఉంది. ఇప్పుడా లాంఛనాలన్నీ పూర్తవుతుండటంతో పర్యాటక ప్రతిపాదనలకు కూడా కదలిక వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోదావరి ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దడానికి ఉద్ధేశించిన అఖండ  గోదావరి ప్రాజక్ట్‌లో భాగంగా ఈ వంతెనను, గోదావరి లంకలను, ధవళేశ్వరం వద్ద ఉన్న పిచ్చుకల్లంక ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది.  అఖండ గోదావరి ప్రాజక్ట్‌కు రాష్ట్రం ఇటీవల రూ. 50 కోట్ల రూపాయలను మంజూరు చేయగా ఇప్పడు పాత వంతెన కూడా రాష్ట్రానికి దఖలు పడనుండటంతో ఈ ప్రాజక్ట్‌ ప్రతిపాదనలు వేగం అందుకుంటున్నాయి.