పాదుకాదానం

0
221
మనస్సాక్షి  – 1116
”ఏంటి గురూగారూ.. యిందాక ఫోన్లో అర్జంటుగా రమ్మన్నారు” అన్నాడు వెంక టేశం వస్తూనే. ఆపాటికి టీవీలో పాత సినిమా ఏదో చూస్తున్న గిరీశం” అవునోయ్‌.. తెలంగాణాలో ఎలక్షన్స్‌ టైమ్‌ కదా. అక్కడకే వన్నా పోయి దున్నేస్తావేమో నని” అన్నాడు.  ఈలోగా వెంకటేశం కుర్చీలో సెటిలై ”ఆ.. ఏం దున్నేస్తాలెద్దురూ.. యిక్క డంతా మనవాళ్ళే. అయినా పీకిందేంలేదు. యింకా ఎక్కడో  తెలం గాణా పోయి ఏం దున్నేస్తానం టారు?” అన్నాడు. దాంతో గిరీశం నవ్వేసి ”ఆ.. నువ్వెళ్ళేది అక్కడేం పోటీ చేయడానికి కాదులేవోయ్‌.. నీ తెలివి తేటలు వాడడా నికి. మా ఫ్రెండ్‌ శంకర్‌ యాదవ్‌ తెలుసు కదా. వాడు తన ఊళ్ళోనే యిండిపెం డెంట్‌గా పోటీ చేస్తున్నాడు. బ్రహ్మాండమయిన సలహాలివ్వడానికి నన్ను రమ్మన్నాడు. ”నేనెందుకులే. నా శిష్యుడ్ని పంపుతాలే అన్నాను” అన్నాడు. వెంకటేశం తలూపి ”బానే ఉందనుకోండి. అయితే అక్కడ పరిస్థితులు బొత్తిగా అర్థమయ్యేలా లేవు. మొన్నటిదాకా గ్యారంటీ అనుకున్న టిఆర్‌ఎస్‌ డౌట్‌లో పడింది. ఎవరూ ఊహిం చని విధంగా టిడిపి, కాంగ్రెస్‌లు ఒక్కటయ్యాయి. యిలాంటి పరిస్థితుల్లో ఓటరు ఎటు మొగ్గుతాడో ఎవరికీ తెలీదు. అసలే మీ ఫ్రెండ్‌ యిండిపెండెంట్‌గా చేస్తున్నాడంటున్నారు..” అంటూ ఆపాడు. దాంతో గిరీశం ”లేదు లేదు. మా ఫ్రెండ్‌కి అక్కడ పబ్లిక్‌లో మంచి పేరుంది. కొంచెంలో సీటు రాలేదంతే. అందుకే యిండి పెండెంట్‌గా పోటీ చేస్తున్నాడు. నీ తెలివితేటలు వాడి వాడిని  గెలి పించాలి” అన్నాడు. దాంతో వెంకటేశం యింకేం వాదించకుండా ఆ రాత్రికే తెలంగాణా గడ్డ మీద అడుగుపెట్టడానికి బయల్దేరాడు..
———
వెంకటేశం వెళ్ళేసరికి శంకర్‌ యాదవ్‌ కొంచెం అసహనంగా ఉన్నాడు. దానిక్కారణం యిండిపెండెంట్‌గా అయితే నామినేషన్‌ వేసేశాడు గానీ యిక ముందుకి ఎలా వెళ్ళాలో తెలీడంలేదు.  వెంకటేశాన్ని చూడగానే శంకర్‌యాదవ్‌ మొహం వెలిగిపోయింది. ”రా..తమ్ముడూ… నువ్వొస్తావని గిరీశం చెప్పిండు” అన్నాడు. వెంకటేశం కూడా ఎక్కువసేపు టైమ్‌ వేస్ట్‌ చేయకుండా సూటిగా విషయంలోకి వచ్చేశాడు. ”ఈ ఎలక్షన్‌ కోసం ఏమాత్రం ఖర్చు పెడతావ్‌?” అంటూ అడిగాడు. దాంతో శంకర్‌యాదవ్‌ పక్క గదిలో ఉన్న యాదగిరిని పిలిచి ”ఎలక్షన్‌ కోసం మనం ఏమాత్రం ఖర్చు పెట్టొచ్చని ఆ ఈసీవాళ్ళు చెప్పిండు?”అనడిగాడు. దాంతో యాద గిరి బుర్రగోక్కుని ”అదేదో ముప్పైతొమ్మిదేలో, నలభయ్యేలో అనుకుంటా” అన్నాడు. దాంతో వెంకటేశం ”అబ్బెబ్బే.. నేనడిగేది అది కాదు. నిజంగా ఏమాత్రం ఖర్చు పెడతావని?” అన్నాడు. శంకర్‌యాదవ్‌ ఏం మాట్లాడకుండా  ఓ వేలు చూపించాడు. దాంతో వెంకటేశం ”కోటా..ఫర్వాలేదు. సరే.. యింతకీ యిక్కడ ఓటర్లు ఎంతమందున్నారు?” అన్నాడు. శంకర్‌యాదవ్‌ కొద్దిగా ఆలోచించి ”తెలంగాణా మొత్తానికి చిన్న నియోజకవర్గం యిదే. మొత్తం ఓట్లు ఓ యాభైవేల దాకా ఉంటాయి” అన్నాడు. అప్పుడు వెంకటేశం ”ఈ కోటీ ఆ యాభైవేలమందికీ పంచితే మనిషికి రెండొంద లొస్తాయి. అది సరిపోదు” అన్నాడు. శంకర్‌యాదవ్‌ నిజమే అన్నట్టుగా తలూపాడు. అప్పుడు వెంకటేశం యింకో గొప్ప రహస్యం చెప్పాడు. ”యిదిగో జాగ్రత్తగా వినన్నా.. ఈ ఓటర్లని మూడు రకాలుగా విడదీయొచ్చు. మొదటి రకం వాళ్ళు నీ వీరాభిమాను లనుకో. నువ్వు ఏవయినా యిచ్చినా, యివ్వకపోయినా ఆ ఓటేదో నీకే గుద్దేస్తారు. యిక రెండో వర్గాన్ని తీసుకుంటే… కోటి రూపా యలిచ్చినా వాళ్ళు నీకు ఓటెయ్యరంతే. అందుకే వీళ్ళిద్దరికీ డబ్బు లివ్వక్కరలేదు. యిక మూడోది ‘గోడ మీద పిల్లి’ వర్గం అనుకో. వీళ్ళే చాలా ముఖ్యం. వీళ్ళు ఏ పార్టీకి ఓటెయ్యాలో తేల్చుకోకుండా ఉంటారు. పరిస్థితిని బట్టి వీళ్ళు ఏదో పార్టీకి ఓటేస్తారు. మనం పట్టుకోవలసింది వీళ్ళనే. ఎలాగూ ఆ మొదటి రకం నుంచి నీకు పడే ఓట్లు యిరవై వేల దాకా ఉంటాయనుకుందాం. ఎలాగా ఆ రెండో వర్గం ఓట్లు యిరవై వేలూ పడవు. యిప్పుడా మూడో వర్గం ఓట్లు పదివేలూ కూడా పడితే చాలు. గెలిచేయొచ్చు. అందుకే యిప్పుడు ఖర్చుపెట్టవలసిందల్లా ఆ మూడో వర్గపు పదివేల మందికే”’ అన్నాడు. వెంకటేశం చెప్పింది వినే సరికి శంకర్‌ యాదవ్‌ వెంక టేశాన్ని  కౌగ లించుకున్నంత పనిచేశాడు. ”శభాష్‌ తమ్ముడూ. భలేగా  చెప్పావు. ఎంత యినా  మా గిరీశం శిష్యుడివి కదా” అన్నాడు.  యింతలో వెంక టేశం కొనసాగిస్తూ ”ఆ ఖర్చేదో రెండుకోట్లు  చేయగలవా?” అన్నాడు. శంకర్‌ యాదవ్‌ తలూపి ”గెలుస్తానంటే ఎంత యినా తీస్తా” అన్నాడు. దాంతో వెంకటేశం ”అయితే మొత్తం పెట్టేది రెండు కోట్లను కుందాం. అందులో ఓ యాభై లక్షలు మన వాళ్ళకి బిర్యానీలకీ, పెట్రోలు ఖర్చులకీ, యింకా జెండాలకీ, ప్రచారానికీ ఖర్చుపెట్టు. యిక మిగిలిన కోటిన్నరా యిందాక చెప్పిన ఆ పదివేలమందికీ పంచేద్దాం. ఒక్కొక్కళ్ళకీ 1500దాకా వస్తుంది” అన్నాడు. దాంతో శంకర్‌యాదవ్‌ ”డబ్బులూ, బహుమతులూ ఏం పంచినా కష్టమే. ఈసీ గట్టిగా ఉంది” అన్నాడు. అప్పుడు వెంక టేశం ”సరే…యింకో పనిచేద్దాం. మనకి తెలిసిన వెండి షాపు వాడే వయినా ఉన్నాడా?” అన్నాడు. దానికి శంకర్‌యాదవ్‌” అన్నాడు. యిప్పుడే పిలుస్తా”అంటూ ఎవరికో ఫోన్‌ చేశాడు. యింకో యిరవై నిమిషాల్లో వాసుదేవ్‌ అనబడే ఆ వెండి షాపు ఓనర్‌ దిగిపోయాడు. పరిచయాలయ్యాక వెంకటేశం ”ముప్పయ్యేసి గ్రాముల్లో  వెండి చెప్పు కావాలి. అదీ పదివేలమందికి” అన్నాడు. వాసుదేవ్‌ తలూపి,  ఏవో లెక్కలేసుకుని ”చేసేయొచ్చు. బ్రహ్మాండంగా వస్తుంది” అన్నాడు. అలా అనేసి అడ్వాన్స్‌ తీసుకుని వెళ్ళిపోయాడు.
——–
ఎలక్షన్లు సమీపించాయి. దాంతో పాటే ప్రచారం జోరుగా సాగు తోంది. శంకర్‌యాదవ్‌ అయితే స్వయంగా యింటింటికీ వెళ్ళే పనిలో పడ్డాడు. అదీ అన్నిళ్ళకీ కాదు. మూడో వర్గానికి చెందిన పదివేలమంది యింటికీ ముందుగా ఓ యింటికి వెళ్ళాడు. అక్కడ యింటి యజమానికి ఓ వెండి చెప్పు యిచ్చాడు. ”యిది నేను నీకిచ్చే ఆయుధం అన్నా.. రేపు నేను గెలిచింతర్వాత యిప్పుడిచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే దీంతోనే నన్ను కొట్టు” అన్నాడు. శంకర్‌ యాదవ్‌ అలా అనేసరికి ఓ రకమయిన షాక్‌తో ఆ యింటి యజమాని ఆ వెండి చెప్పుని తీసుకోవడం జరిగింది. దాదాపు అన్నిళ్ళ లోనూ యిదే తంతు. మొత్తానికి యిచ్చింది లంచమే గానీ దానికో అందమైన పేరు పెట్టి, అందంగా యివ్వడం, ఆనక ఎలక్షన్స్‌లో గెలవడం జరిగిపోయాయి.
———
”గురూగారూ…యిందాక యిలాంటి కలొచ్చింది. ఈ లెక్కన నేను చాణక్యుడిలా అవతారం ఎత్తేసి తెలంగాణాలో దున్నెయ్య మంటారా?” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం ”అలాగే చేద్దూ గాని..ముందర అదేదో యిక్కడ నిరూపించుకో” అన్నాడు. దాంతో వెంకటేశం యిబ్బందిపడి ”అయినా ఈ కలెందుకు వచ్చినట్టం టారు?” అన్నాడు.  ఈలోగా గిరీశం ఓ చుట్ట అంటించుకుని శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలన్నట్టుగా.. ఈసీ పెట్టే రూల్స్‌కి తగ్గట్టుగా ఈ అభ్యర్ధులు రకరకాల వేషాలేస్తుంటారు. అదే నీ కలలో వచ్చింది. అయితే యిక్కడ యింకో విశేషం కూడా ఉంది. మొన్న తెలంగాణాలో ఓ అభ్యర్ధి యింటింటి ప్రచారంలో యింటికో కొత్త చెప్పుల జత యిచ్చి రేపు గెలిచింతర్వాత హామీలు నిలబెట్టుకోకపోతే వాటితో కొట్టమని మరీ చెప్పాడంట. ఎల క్షన్స్‌లోపు యిలాంటి విన్యాసాలు యింకా ఎన్ని చూడాలో ఏంటో.. అయితే యిక్కడ సగటు ఓటరు తెలుసుకోవలసింది ఒకటుం దోయ్‌.. ఈసీ ఎన్నో నిబంధనలు పెడుతుంది. అయితే దానిని దాటి ఈ పార్టీలు ఎన్నో ప్రలోభాలు పెట్టొచ్చు. కానీ యిక్కడ విజ్ఞత చూపించ వలసింది మాత్రం ఓటరే. ఎలక్షన్లంటే రాబోయే అయిదేళ్ళకీ తమ తలరాతని తామే రాసుకునే అవకాశం. ఆ అవ కాశాన్ని తాత్కాలిక ప్రలోభాలకి లోబడి వినియోగించుకోకపోతే తమని… అదే.. తమ భవిష్యత్తుని తామే చెప్పుతో కొట్టుకున్నటే” అంటూ వివరించాడు.
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here