పామాయిల్‌ రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు

0
277

త్వరలో వారంలో వ్యవసాయ మంత్రి సోమిరెడ్డితో సమావేశం

గన్ని నాయకత్వంలో కలిసిన రైతు ప్రతినిధులకు రాజప్ప హామీ

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 9 : పామాయిల్‌ రైతుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హామీనిచ్చారు. గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ సారధ్యంలో ఈరోజు కాకినాడలో తనను కలిసిన పామాయిల్‌ రైతుల ప్రతినిధులు రాజప్పను కలిశారు. దీనిపై వెంటనే స్పందించిన రాజప్ప వెంటనే ఫోన్‌లో వ్యవసాయశాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డితో మాట్లాడారు. రైతుల సమస్యలను తాను సీఎం దృష్టికి తీసుకెళ్ళి న్యాయం చేస్తానని ఈ సందర్భంగా మంత్రి సోమిరెడ్డి హామీనిచ్చారు. ఆ తరువాత రైతు ప్రతినిధులతో రాజప్ప మాట్లాడుతూ ఈనెల 3వ వారంలో మంత్రి సోమిరెడ్డి జిల్లాకు రానున్నారని, ఆయనతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు. తమ పంటకు గిట్టుబాటు ధర, ఆయిల్‌ ఫెడ్‌ వారి ఉదాసీనత తదితర సమస్యలను ఈ సందర్భంగా రైతులు రాజప్ప దృష్టికి తీసకువచ్చారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఫ్యాక్టరీల మేనేజ్‌మెంట్ల మొండి వైఖరి వల్ల తెలంగాణా రైతుల కంటే ఆంధ్రప్రదేశ్‌ రైతులు టన్నుకు రూ.1200 నుంచి రూ.1500 వరకు నష్టపోతున్నారని, దీనిపై ఫ్యాక్టరీల మేనేజ్‌మెంట్లతో చర్చించినా ప్రయోజనం లేకపోయిందని వారు తెలియజేశారు. ఈ పరిస్థితుల్లో పంటను నిరుపయోగంగా వదిలివేయడం తప్ప తమకు వేరే గత్యంతరం లేదని, దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కారం చూపించి రైతులకు న్యాయం చేయాలని వారు అభ్యర్ధించారు. రైతులకిచ్చే పంట రికవరీ తెలంగాణాలో 18.5 శాతం ఉండగా మన రాష్ట్రంలో 16 నుంచి 17 శాతానికి పెంచుతూ ప్రభుత్వం జిఓ ఇస్తుందని, దాని వల్ల కొంత వరకు ధర పెరిగే అవకాశం ఉంటుందని మంత్రి తనతో చెప్పారని రాజప్ప తెలియజేశారు. అయితే 17 శాతం రికవరీ ఇచ్చినా తమకు నష్టమేనని, దీనిపై పునరాలోచన చేయాలని రైతు ప్రతినిధులు కోరారు. రాజప్పను కలిసిన వారిలో జిల్లా పామాయిల్‌ రైతుల సంఘం అధ్యక్షులు బుచ్చిబాబు, తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here