పారదర్శకంగా గృహ లబ్ధిదారుల ఎంపిక

0
169
 రెండో దఫాలో 3 వేల 732 మందితో జాబితా
దళారులను నమ్మి మోసపోవద్దు : కమిషనర్‌ సుమిత్‌కుమార్‌
రాజమహేంద్రవరం, జూన్‌ 11 : రాజమహేంద్రవరం నగరపాలకసంస్థ పరిధిలో గృహ లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని కమిషనర్‌ సుమిత్‌కుమార్‌ వెల్లడించారు.  3 వేల 732 మందితో రెండో దఫా జాబితాలను కార్పొరేషన్‌ ఆవరణలో బహిరంగంగా ప్రదర్శిస్తున్నామని వాటిలో అనర్హుల పేర్లు  ఉంటే తమ దృష్టికి తీసుకుని వస్తే వెంటనే తొలగిస్తామని స్పష్టం చేసారు. కార్పొరేషన్‌ కార్యాలయంలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లబ్ధిదారుల పేర్లపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా తమకు తెలియచేయాలని సూచించారు. 15 రోజుల గడువు ఇస్తున్నామని ఫిర్యాదు చేస్తే పేరు తొలగిస్తామన్నారు. మొత్తం 3 వేల 400 గృహాలు అందుబాటులో ఉన్నాయని అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామని, క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో లబ్ధిదారులు అర్హులా? కాదా అన్నది విచారణ చేసిన తరువాతనే ఎంపిక చేసామన్నారు. దళారులు చాలా మంది దరఖాస్తు దారుల వద్దకు వెళ్లి ఇళ్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్పొరేషన్‌ ద్వారా మాత్రమే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని ఈ విషయంలో ఎటువంటి పైరవీలకు తావులేదన్నారు. ఇంకా కార్పొరేషన్‌లో 15 వేల దరఖాస్తులు గృహాలు కావాలని అందచేసినవి పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 10 వేల ఇళ్లు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని అవి వస్తే ఇక కార్పొరేషన్‌లో ఇళ్ల సమస్య ఉండదన్నారు. డిమాండ్‌ చాలా ఉందన్నారు.  ఎంపికైన జాబితాలో మహిళలకు 3 వేల 415, 317 మంది పురుషులకు, 65 మంది వికలాంగులకు, 21 మంది హెచ్‌ఐవి రోగులకు, ఈశ్వర్‌నగర్‌, ఇందిరాసత్యనగర్‌ పుంత తదితర ప్రాంతాల్లో ఇళ్లు తొలగించిన 230 మందికి, 73 మంది విలేకరులకు ఇళ్లు కేటాయించామని వివరించారు. పారిశుద్ధ్యం, మంచినీరు, పన్నులు వసూళ్లు సక్రమంగా లేకపోవడం తదితర ఎటువంటి సమస్య అయినా ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 7799788688 నెంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రజలు ఇచ్చిన ఫిర్యాదును పరిష్కరించేలా చర్యలు చేపడతామన్నారు. కార్పొరేటర్లను కూడా అర్హులైన వారి పేర్లను మాత్రమే ఇవ్వాలని కోరామని, వారిచ్చిన పేర్లను కూడా విచారణ చేసిన తరువాత మాత్రమే ఎంపికచేసామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here