పార్టీ పటిష్టతే లక్ష్యం

0
229
ఆటో కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తాం
‘థాంక్యూ సిఎం సర్‌’ కార్యక్రమంలో జక్కంపూడి రాజా
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 4: ప్రభుత్వం అందించే పధకాలను పొందడానికి గత ప్రభుత్వం మాదిరి పార్టీకి చెందిన వ్యక్తై ఉండాల్సిన అవసరం లేదని, అర్హత ఉంటే చాలని రాజానగరం శాసనసభ్యులు, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు అడపా రాజు ఆధ్వర్యంలో స్థానిక సుబ్రహ్మణ్య మైదానంలో ఆటో కార్మికులతో కలిసి ‘థాంక్యూ సిఎం సర్‌’ పోస్టర్‌ని ఆవిష్కరించే కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిధులుగా జక్కంపూడి రాజా, సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, సిటి కో ఆర్డినేటర్‌ శ్రీఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం,ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు అడపా వెంకటరమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ డివిజన్‌ స్థాయి నుండి పార్టీలను,అదే విధంగా అనుబంధ సంఘాలను పటిష్టపరుచుకోవాలని సూచించారు. అప్పుడే విజయం పార్టీ వెనుక వస్తుందని అన్నారు. శివరామ సుబ్రహ్మణ్యం సిటి కో ఆర్డినేటర్‌ గా బాధ్యతలు స్వీకరించాక పార్టీని అన్ని రకాలుగా బలపరచడానికి కృషి చేస్తున్నారని అన్నారు. ఎక్కడైతే లోపాలు,నాయకత్వలోపం ఉందో వాటిని సవరిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా మహిళలకు ప్రభుత్వ పధకాలను ప్రతి డివిజన్‌కి వెళ్ళి సమావేశాలు నిర్వహిస్తున్నారని అన్నారు.అందులో భాగంగా ట్రేడ్‌ యూనియన్‌ ను కూడా బలపరుస్తున్నారని, తన జక్కంపూడి రామ్మోహనరావు రాజమండ్రి వేదికగా కార్యక్రమాలు నిర్వహించే వారని గుర్తు చేశారు.కార్మికులు అండగా నిలిచి నాయకుడిగా గుర్తింపు తెచ్చారని అన్నారు. గతంలో తన తండ్రితో పనిచేసిన అడపా వెంకటరమణ, నరవ గోపాలకృష్ణ వంటి కార్మిక సంఘాల నాయకుల సలహాలతో అడపా రాజు సంఘాన్ని బలపరచడం సంతోషమన్నారు. ఈ నెల 21 న సిఎం జగన్‌ జన్మదినం సందర్భంగా థాంక్యూ సిఎం సర్‌ అని కృతజ్ఞతలు తెలుపుతూ పోస్టర్లను ఆవిష్కరించి ఆటోలపై వాటిని అంటించడం మంచి కార్యక్రమమన్నారు.గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లను పట్టించుకోలేదని, జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయడం ద్వారా కాలర్‌ ఎగరేసుకుని చెప్పడానికి ఆనందంగా ఉందన్నారు.80 శాతం హామీలను ఇప్పటికే అమలు చేశారని, రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పధకాలను రాబోతున్నాయన్నారు.గతంలో జన్మభూమి కమిటీలు ఇష్టారాజ్యంగా, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంటేనే పధకాలను అందించే వారని విమర్శించారు. ఇళ్లు లేని ఆటో కార్మికులకు సొంతింటి కల నెరవేరుస్తామని, జాబితా తనకు అందించాలని కోరారు. జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి జగన్‌ సంక్షేమ పధకాలను అమలు చేశారని అన్నారు.రాష్ట్రంలో ఆర్ధిక లోటు ఉన్నా సంక్షేమ పధకాల అమలులో వెనుకడుగు వేయడం లేదన్నారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన పధకాలకు జగన్‌ మరింత మెరుగులు దిద్దుతున్నారని అన్నారు. బడుగు బలహీన వర్గాలు ఉన్నత స్థానానికి వెళ్ళాలని అమ్మ ఒడి, ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టారని తెలిపారు. సిటి కో ఆర్డినేటర్‌ శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పేదలు,కార్మికులకు కష్టం వస్తే అండగా నిలబడేది జక్కంపూడి కుటుంబమేనని అన్నారు. పోరాట యోధుడు జక్కంపూడి రామ్మోహనరావు అడుగుజాడల్లో వారి కుమారులు రాజా,గణేష్‌ నడుస్తూ ఎవరికి ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారని అన్నారు. జక్కంపూడి కుటుంబం ఒక వ్యవస్థ అని కొనియాడారు. నగరంలో కొంతమంది కార్మిక నాయకులుగా చెలామణి అవుతూ కార్మికుల చేబులో సొమ్ములు కాజేస్తూ వారిని వేధిస్తున్నారని అన్నారు. వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ కార్మికులకు అండగా,తోడుగా ఉంటుందని అన్నారు. వాహనమిత్ర పధకం ద్వారా ఆటో డ్రైవర్లకు మేలు చేశారని అన్నారు. అడపా వెంకటరమణ మాట్లాడుతూ ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చిన జగన్‌ కు అందరూ అండగా నిలవాలని, భవిష్యత్తులో ఇన్సూరెన్స్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సబ్సిడి కోరేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అడపా రాజు మాట్లాడుతూ కార్మికుల పక్షపాతి జగన్‌ అని, ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు.ఆనంతరం పోస్టర్లను ఆవిష్కరించి ఆటోలకు అంటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్‌, మాజీ ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి,జక్కంపూడి గణేష్‌, నక్కా శ్రీనగేష్‌, ఉప్పాడ కోటరెడ్డి,కొల్లిమళ్ళ రఘు,కాటం రజనీకాంత్‌, మరుకుర్తి దుర్గాయాదవ్‌,పసుపులేటి కృష్ణ, చవ్వాకుల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here