పార్లమెంట్‌లో అన్యాయంపై ప్రశ్నించేందుకు అజెండా

0
309
29న విజయవాడలో రాజకీయ పార్టీలతో సమావేశం : ఉండవల్లి
రాజమహేంద్రవరం, జనవరి 25 : రానున్న 5 ఏళ్ళలో రాష్ట్రానికి అన్యాయం జరగకుండా పార్లమెంట్‌లో ప్రశ్నించేందుకు ఈనెల 29న వివిధ రాజకీయ పార్టీలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు మాజీ పార్లమెంట్‌ సభ్యులు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తెలిపారు. స్థానిక ఆనం రోటరీ హాల్లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపి, సిపిఐ, సిపిఎంలతోపాటు, ప్రాంతీయ పార్టీలుగా ఉన్న తెలుగుదేశం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతోపాటు, జనసేన పార్టీలను ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు తెలిపారు. తన ఆహ్వానానికి అనుగుణంగా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రఘువీరారెడ్డి, బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, పి.మధులతోపాటు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ సానుకూలంగా స్పందించారని తెలిపారు. అయితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ద్వారా తెలుగుదేశం పార్టీ పాల్గొనే సమావేశంలో తాము పాల్గొనబోమని సమాధానం వచ్చిందన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఇంకా ఎటువంటి సమాచారం రాలేదని, అయితే తెలుగుదేశం పార్టీ నుంచి సానుకూలమైన రీతిలో సమాధానం వస్తుందనే ఆశతో ఉన్నట్లు చెప్పారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని లోకసభలో సరియైన రీతిలో చర్చ జరగలేదన్నారు. ఆరేళ్ల క్రితం ఇదే రోజున సుబ్రహ్మణ్యమైదానంలో సభ పెట్టి రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలతో చర్చించినట్లు గుర్తు చేశారు. ప్రస్తుత లోకసభ, శాసనసభ సభ్యుల కాలపరిమితి సమయం ఆసన్నమైన నేపథ్యంలో వచ్చే ఐదేళ్లలోయినా  రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏవిధమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా లక్ష్యంతో ఈ నెల 29న విజయవాడలోని ఐలాపురం ¬టల్‌లో అంతర్గత సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించలేకపోతే ఇంతకంటే అన్యాయం, దుర్మార్గం మరొకటి ఉండదన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన రాష్ట్ర విభజనను ప్రశ్నించకపోతే రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేయడమే అవుతుందని, జరిగిన పోయిన అంశంపై పోస్టుమార్టం చేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని, అన్యాయమే అజెండాగా ఈ సమావేశంలో పాల్గొని ఒక ఉమ్మడి కార్యచరణకు రావాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఈ సమావేశానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చలమేశ్వర్‌ రానున్నారని తెలిపారు. అగ్రవర్ణాల్లో పేదల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 10 శాతం రిజర్వేషన్‌ అనేది ఎన్నికల ష్టంటుగా మాత్రమే ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సమావేశంలో అల్లు బాబి, బండారు మధుసూధనరావు, పసుపులేటి కృష్ణ, చవ్వాకుల వీరరాఘవులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here