పాలు – నీళ్ళు

0
666
మనస్సాక్షి  – 1098
వెంకటేశం అప్పుడే దిగబడ్డాడు. ఆపాటికి గిరీశం గారింట్లోంకి పెద్దగా ఏడుపు లాంటిది వినిపిస్తోంది. అది బాబీగాడిదని అర్థమయిపోతోంది. ‘అనుమానం లేదు.. వీడేదో వెధవ పని చేస్తుంటాడు. గట్టిగా తగిలుంటాయి’ అనుకుంటూ గబగబా లోపలకొచ్చాడు. ఆపాటికి గిరీశం అయితే తీరిగ్గా పడక్కుర్చీలో కూర్చుని చుట్ట కాల్చే పనిలో ఉన్నాడు. చేతిలో కర్రలాంటిదేవీ లేదు. ఈలోగా వెంకటేశం గబగబా గిరీశం దగ్గరకొచ్చి ”పోనీలే గురూ గారూ.. యిప్పుడు కాకపోతే రేపు మంచిమార్కులొస్తాయి. దానికి పిల్లోడిని కొట్టడమెందుకూ?” అన్నాడు. దాంతో గిరీశం విసుక్కుని ”నేనేవన్నీ అంటేగా… తెలుగులో మార్కులిచ్చారంట. అందులో మరీ నూటికి ముప్పై రెండే వచ్చాయంట. అది వాడే చెప్పేసుకుని వాడే ఏడ్చేస్తు న్నాడు” అన్నాడు. దాంతో వెంకటేశం నాలుక్కరచుకుని బాబీ గాడి దగ్గరికి నడిచి ”అయినా మరీ 32 ఏంట్రా?” అన్నాడు. దానికి బాబీగాడు ”ఆ..నా ఒక్కడికేనా.. క్లాసులో యిరవైమందికి యిలాగే వచ్చాయి తెలుసా?” అన్నాడు. ఆ మాటల్లో తన తప్పేం లేదని ధ్వనిస్తోంది. దాంతో వెంకటేశం ”సర్లే.. నువ్వెళ్ళి ఆడుకో. తర్వాత పరీక్షలో పెర గాలి” అంటూ పంపేశాడు. ఆపాటికి తుపానేదో వెలిసి నట్టయింది. అక్కడ్నుంచి వెంకటేశం గిరీశం పక్కకొచ్చి అక్కడో కుర్చీలో సెటిల య్యాడు. గిరీశం మాత్రం మాటిమాటికీ తలతిప్పి గుమ్మంవైపుకి చూస్తున్నాడు. దాంతో వెంకటేశం ”ఏంటి గురూగారూ.. ఎవరన్నా రావాలా?” అన్నాడు. గిరీశం తలూపి ”అవునోయ్‌.. పాలు రావలి. గొంతులో టీ చుక్క పడితే గాని బుర్ర పనిచేయదు. యిదిగో.. యిందాక వీడి గోలొకటి” అన్నాడు. వెంకటేశం తలూపి ఊరుకున్నాడు. యింకో పది నిమిషాల తర్వాత ‘పాలండీ’ అంటూ వినిపించింది. అయితే ఆ గొంతు ఎప్పుడూ పాలుపోసే గంగయ్యది కాదు. తీరా చూస్తే వచ్చింది గంగయ్య కాదు. ఎవరో కుర్రగాడు. దాంతో వెంకటేశం ”ఏరా.. గంగయ్య రాలేదా?” అన్నాడు. దానికా కుర్రాడు ”నేను గంగయ్య కొడుకునేనండి.. ఆయ్‌” అన్నాడు. వెంకటేశం అర్థంకానట్టుగా ”మరి మీ నాన్న ఊరెళ్ళడా” అన్నాడు. దాంతో ఆ కుర్రాడు ”లేదండీ.. మానాన్న జైలుకెళ్ళాడు” అన్నాడు. దాంతో గురుశిష్యులిద్దరూ ఆశ్చర్య పడ్డారు. ”ఏంటీ.. జైలుకా.. ఎం దుకూ?” అన్నాడు. దానికా కుర్రాడు ”పాలల్లో నీళ్ళు  కలిపా రని జైల్లో పెట్టారండి” అన్నాడు. దాంతో గిరీశం ”అయినా అందులో వింతేముందీ… అందరూ చేసే పనదే కదా. లేకపోతే లీటరు అరవై, యాభై, నలభై అని వేర్వేరు రేట్లు ఎలాపెట్టి అమ్ముతారంట? ఆ ప్రకారం నీళ్ళు కలపాలి కదా..” అన్నాడు. ఆ కుర్రాడు తలూపి ”నిన్న మా నాన్న సైకిలుకి కట్టుకుని పాలు తెస్తుంటే ఎవరో ఆఫీసరు ఆపేరంట. పాలు పరీక్ష చేసి నీళ్ళు కలిపాడని కోర్టుకి పంపేరంట. అక్కడేమో ఆర్నెల్ల శిక్ష పడింది. లాయర్‌గారు పైకోర్టు  కెళ్ళాచ్చన్నారు.  మళ్ళీ బోల్డంత ఖర్చని మానాన్న జైలుకే పోయాడు” అన్నాడు. అలా చెప్పేసి ఆ కుర్రాడు గబగబా వెళ్ళి పోయాడు. అప్పుడు గిరీశం ”చూశావుటోయ్‌.. అందరూ  పాలు కలుపుతారా.. అయినా గంగయ్య ఒక్కడికే శిక్ష పడింది” అంటూ వంటింట్లోకి నడిచాడు. టీ పెట్టుకుని తాగింతర్వాత యిద్దరూ బయటికి బయల్దేరారు. అలా తిన్నగా గాంధీ పార్కు కెళ్ళారు. ఆపాటికి పార్కులో జనాలు అంతగాలేరు. యిద్దరూ ఓ మూలనున్న బెంచిమీద కూర్చుని మాటల్లో పడ్డారు. యింతలో గిరీశం తీరిగ్గా ఓ చుట్ట తీసి అంటించి గుప్పుగుప్పుమనిపించాడు. ”అబ్బబ్బ… యిలా చుట్ట కాలుస్తుంటే స్వర్గానికి ఆమడ దూరం దాకా వెళ్ళి నట్టుంటుందోయ్‌” అన్నాడు. వెంకటేశం వెంటనే ”ఆ.. కాల్చేదేదో యింకా ఎక్కువ కాలిస్తే ఏకంగా స్వర్గంలోకే పోవచ్చు” అన్నాడు. దానికి గిరీశం ఏదో అనేలోపు జరిగిందది. ఎక్కడ్నుంచి వచ్చాడో ఓ కానిస్టేబుల్‌ గబగబా అక్కడికొచ్చాడు. వస్తూనే ”మీరు చేస్తున్నది తప్పు” అన్నాడు. దాంతో గిరీశం ”ఏం.. ఈ బెంచీమీద కూర్చో గూడదా?” అన్నాడు. దాంతో ఆ కానిస్టే బుల్‌  ”నేను మాట్లాడేది బెంచీ గురించి కాదు. మీ నోట్లో  చుట్ట గురించి. యిలా పబ్లిగ్గా పొగ తాగడం నేరమని తెలీదా?” అన్నాడు. దాంతో గిరీశం ”అసలు నేనెవరో తెలుసా? గిరీశం గారి మనవడిని” అన్నాడు. దాంతో కాని స్టేబుల్‌ ”మీరెవరయితే నాకెందు కంట.. చేసింది తప్పే. పెనాల్టీ కట్టాల్సిందే” అన్నాడు. దాంతో గిరీశం  దిగిపోయాడు. ”అయినా చుట్ట కాల్చొద్దంటే ఎలా.. అసలు చుట్టంటేనే నా బ్రాండ్‌. ఆ చుట్ట లేకపోతే నన్నెవరూ గుర్తుపట్టలేదు” అన్నాడు. పక్కనున్న వెంకటేశం ‘ఆ.. ఉంటే మాత్రం ఏం పీకి చచ్చినట్టు?’ అని గొణుక్కున్నాడు. యింతలో కానిస్టేబుల్‌ ”అయి దొందలు పెనాల్టీ అయినా కట్టండి.  లేకపోతే స్టేషన్‌ కయినా రండి” అన్నాడు ఖచ్చితంగా. దాంతో గిరీశం జేబులు వెతికి ఓ మూడొందలు లాగాడు. తర్వాత వెంక టేశం వైపు తిరిగి ”ఓ రెండొందలు సర్ధ వోయ్‌.. యింటికెళ్ళాక యిస్తా” అన్నాడు. దాంతో వెంకటేశం గొంతు తగ్గించి ”రిపీట్‌ అక్కర్లేదని చెప్పండి. ఓ వందిస్తే సరిపోతుంది” అన్నాడు. అయినా గిరీశం ఒప్పుకోలేదు. అసలే బోల్డంత యిదిగా యిగో దెబ్బ తినేసి ఉన్నాడాయె. దాంతో అయిదొందలూ కట్టేసి  చలానా తీసేసు కున్నాడు. కానిస్టేబుల్‌ వెళ్ళిపోయాక గిరీశం ఒకటే బాధపడిపోతూ ”ఏంటోనోయ్‌..మంచికి రోజుల్లేవు. లేకపోతే రోడ్డుమీద ఎంతమందో పొగలు ఊదుతూ పోతుంటే.. అందర్నీ వదిలేసి నన్నే పట్టుకుంటాడా.. ఎంతన్యాయం” అన్నాడు. వెంకటేశం మాత్రం మనసులో గుంభనంగా నవ్వుకున్నాడు.
—–
”అది గురూగారూ… నాకొచ్చిన కల. ఈ లెక్కన పబ్లిక్‌లో మీ చుట్టకి ఎసరొచ్చినట్టే ఉంది” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం గుర్రుమని ”అయితే నీ దృష్టి నా చుట్టమీద పడిందన్నమాట” అన్నాడు. వెంక టేశం యిబ్బందిపడి ”అయినా నాకీ కలెందుకు వచ్చినట్టంటారు?” అన్నాడు. గిరీశం ఒక్క క్షణం ఆలోచించి ”ఈసారి నీ కలలో కత్తి మహేష్‌ వాళ్ళ నాన్న దూరినట్టున్నాడోయ్‌” అన్నాడు. దాంతో వెంక టేశం అదిరిపోయి ”ఏంటి గురూగారూ.. నా కలలో కత్తి వాళ్ళ నాన్న దూరేడా !” అన్నాడు. గిరీశం తలూపి అదేంటన్నది వివరంగా చెప్ప సాగేడు. ”వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కత్తి మహేష్‌ మీద నగర బహిష్కరణ పడడం జరిగింది. ఆ సందర్భంగా కత్తి మహేస్‌ తండ్రి ఓ ప్రకటన చేయడం జరిగింది. ‘మా అబ్బాయిని అన్యాయంగా యిరికించారు. అయినా మా అబ్బాయి చేసిన తప్పేం టంట? రంగనాయకమ్మ లాంటివాళ్ళు రామాయణాన్ని విమర్శిస్తూ రాశారు.  అలాగే యింకెందరో ఎంతో విమర్శించారు. వాళ్ళకే శిక్షలూ పడలేదు. మరి వాళ్ళు  రాసిన దాంట్లో మా అబ్బాయి కొన్ని వ్యాఖ్యలు తీసి చదివాడంతే. దానికే మావాడిని యిరికిం చేశారు’ అన్నది ఆ ప్రకటన. అయితే యిక్కడో విషయం గమనించాలి. ఒక తప్పు వందమంది చేస్తున్నంత మాత్రాన అదేం ఒప్పుఅయిపోదు. అదెప్పటికీ తప్పే. పాలలో నీళ్ళు కలపడం విషయంలో నయినా, పబ్లిక్‌లో పొగవదిలే విషయంలోనయినా అదేదో చాలామంది చేయొచ్చు. అయితే వాళ్ళలో శిక్షపడటం అనేది కొందరికే పడొచ్చు. అంత మాత్రం చేత మిగతా వాళ్ళంతా నిర్ధోషులని కాదు. పరిస్థితులూ, టైమూ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయంతే. ఎప్పుడో వాళ్ళూ దొరక్కపోరు” అంటూ వివరించాడు. వెంకటేశం తలూపి ”యిన్నాళ్ళకి ఓ పాయింటు కత్తిదించినంత సూటిగా చెప్పారు” అన్నాడు. గిరీశం తలూపి, పైకిలేస్తూ ”పదపోదాం” అన్నాడు. అలా అంటూ జేబులోంచి యింకో చుట్ట తీసి అంటించుకోబోయాడు. అంతలోనే ఏవనుకున్నాడో చుట్ట తీసి జేబులో పెట్టేసుకుని ”పబ్లిక్‌లో వద్దులే. యింటికెళ్ళాక కాల్చుకోవచ్చు’ అంటూ ముందుకి నడిచాడు.
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here