పుష్కర వనం..పోటెత్తుతున్న జనం

0
290
ఉదయం వ్యాహావళి ప్రాంతంగా పెరుగుతున్న ఆదరణ
నగర ప్రముఖులు సైతం ఇక్కడే వాకింగ్‌ – పిల్లల ఆటవిడుపు కేంద్రంగా రాణింపు
రాజమహేంద్రవరం, మే 19 : శబ్ధ కాలుష్యానికి దూరంగా..ఆహ్లాదానికి ఆరోగ్యానికి చిరునామాగా భాసిల్లుతున్న గోదావరి మహా పుష్కరవనం పట్ల ఆదరణ నానాటికి పెరుగుతోంది. నగరానికి అతి చేరువగా లాలాచెరువు హౌసింగ్‌ బోర్డు కాలనీ వద్ద జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ పుష్కరవనం ఇపుడు పర్యాటకులతో పాటు వ్యాహావళికి మంచి ప్రాచుర్యం పొందుతోంది. చిన్నా పెద్ద, లింగ బేధంతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ వాకింగ్‌ చేయాలన్న సామాజిక స్పృహ పెరగడంతో ఇటీవల కాలంలో చాలా మంది వాకింగ్‌ చేస్తుండటంతో  నగరంలోని ప్రధాన రహదారులతో పాటు ప్రభుత్వ అటానమస్‌ కళాశాల, దానవాయిపేట పార్కు, కంబాలచెరువు పార్కు తదితర ప్రాంతాల్లో ఉద్యానవనాలు ఉదయం వేళ రద్దీగా కనిపిస్తున్నాయి. అయితే 2015 గోదావరి పుష్కరాల సమయంలో సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభమైన పుష్కరవనానికి కూడా ఇపుడు మంచి ఆదరణ లభిస్తోంది. పరిసర ప్రాంతవాసులే గాక పలు ప్రాంతాల నుంచి అనేక మంది ప్రజలు, ప్రముఖులు ఇక్కడకు వచ్చి వాకింగ్‌ చేసి వెళుతున్నారు. ప్రశాంతంగా, సువిశాలంగా, ఆహ్లాదాన్ని పంచే విభిన్న వృక్షాలతో,ఔషధ మొక్కలతో కలుషితం లేని గాలిని పీలుస్తూ అనేక మంది ఇక్కడ వాకింగ్‌ చేసి వెళుతున్నారు. ఫోటో షూట్‌కు ఈ ఉద్యానవనం ఎంతో అనుకూలంగా ఉండటంతో నిత్యం అనేకమంది ముఖ్యంగా నూతన వధూవరులు ఇక్కడకు వచ్చి ఫోటొలు దిగుతుండటంతో ఈ ప్రాంతం మరింత రద్దీగా మారింది. ఈ ట్రెండ్‌ ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఈ ఉద్యానవనం మరింత రద్దీగా మారే అవకాశాలు ఉన్నాయి. నగర ప్రముఖులు గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఏపీఐఐసి మాజీ చైర్మన్‌ శ్రిఘాకొళ్ళపు శివరామసుబ్రహ్మణ్యం, ఆర్యాపురం అర్బన్‌ బ్యాంక్‌ వైస్‌ చైర్మన్‌ అయ్యల గోపి, నగర తెదేపా ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి, హితకారిణి సమాజం మాజీ చైర్మన్‌ దాసి వెంకట్రావ్‌, చింతల లాల్‌బహుదుర్‌ శాస్త్రి, డా. వైఎస్‌ గురు ప్రసాద్‌, చెరుకూరి కృష్ణాజీ, బలరామకృష్ణ, శౌరినాథన్‌ తదితరులు ఇక్కడ వాకింగ్‌ చేస్తూ  ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు…మరెందరికో  స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కాగా ఈ పుష్కరవనంలో మ్యూజియంతో పాటు పిల్లల ఆటపరికరాలు, వివిధ జంతువుల ఆకృతులు కూడా పిల్లలను విశేషంగా ఆదరిస్తుండటంతో ఆదివారం ఈ ప్రాంతం మరింత రద్దీగా మారుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here