పెట్రోలు బంక్‌ల్లో పేచీలు – ఆసుపత్రుల్లోనూ అంతే…

0
280
రాజమహేంద్రవరం,  నవంబర్‌ 10 : పెద్ద నోట్ల రద్దుతో ‘చిల్లర వివాదాలు’ రేగుతున్నాయి. పెట్రోల్‌ బంక్‌ల్లో  రూ. 500, రూ.1,000 నోట్లను రేపు అర్ధరాత్రి వరకు తీసుకుంటారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే చాలా మంది వాహనదారులు రూ. 500 లేదా రూ. 1,000 నోట్లను తీసుకొచ్చి వందకో, రెండు వందలకో పెట్రొల్‌, డీజిల్‌ పోయమంటున్నారు. అయితే తమ వద్ద వందలు, యాభైలు లేవని, రూ. 500లకు పోయించుకోమని బంక్‌ సిబ్బంది చెబుతుండటంతో వాహనదారులు వారితో వాగ్వివాదానికి దిగుతున్నారు. కొందరైతే రూ. 500కు పోయించుకుని వెళుతున్నారు. చిల్లర సమస్యకు ఈ వివాదాలే నిదర్శనం. అలాగే ఆసుపత్రుల్లో కూడా రూ.500, రూ.1,000 నోట్లను తీసుకోకపోవడంతో రోగుల బంధువులకు, ఆసుపత్రి నిర్వాహకులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో కూడా రేపటి వరకు పెద్ద నోట్లను అనుమతిస్తామని ప్రభుత్వం ప్రకటించినా యాజమాన్యాలు తీసుకునేందుకు నిరాకరిస్తున్నాయి. దీంతో మందులు వగైరా కొనుగోలుకు, ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి వెళ్ళే వారికి చాలా ఇబ్బందిగా ఉంటోంది.   రైల్వే స్టేషన్లలో కూడా  ఇదే పరిస్థితి ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంక్‌లు ఈరోజు నుంచి కొత్త నోట్లు జారీ చేస్తుండటంతో పాటు వంద రూపాయల నోట్లు  ఇస్తుండటంతో ఈ కష్టాలు రెండు మూడు రోజుల్లో తీరవచ్చని భావిస్తున్నారు.