పెద్దాయన ప్రాణ స్నేహితుడు-

0
288
మనస్సాక్షి  – 1113
వెంకటేశం కాస్తా ఉన్నట్టుండి వార్తల్లో కొచ్చాడు. దానిక్కారణం అదేదో దిక్కుమాలిన మీటూ లాంటిదేదో కాదు. మరి.. ఓ ప్రముఖుడితో గొప్ప పరిచయం. యింతకీ ఆ ప్రముఖుడు కూడా అలాంటిలాంటివాడు కాదు. సాక్షాత్తు దేశానికి రాష్ట్రపతి…! దాంతో అంతా వెంక టేశాన్ని ”రాష్ట్రపతి సమేత వెంకటేశం” అన్న స్థాయిలో పిలవడం మొదలుపెట్టేశారు. జనాలు మాత్రమే కాదు. మీడియా కూడా అదే చేస్తుం దాయె. అయినా అది సామాన్యుడైన  వెంక టేశానికి ఎక్కడో ఢిల్లీలో ఉండే రాష్ట్రపతి స్థాయిలో వ్యక్తితో అంత గొప్ప పరిచయం ఎలా ఏర్పడిం దన్నదే ఆశ్చర్యం. అదేదో తెలుసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాళ్లిందే…
——
వెంకటేశానికి ఏం చేయాలో అర్ధం కావడం లేదు. అసలు తన పరిస్థితి తలుచుకుంటేనే జాలేస్తోంది. తన పరిస్థితయితే బొత్తిగా నూతిలో కప్పలా ఉందేమో అనిపిస్తుందాయె. తన గురువు గారి పరిచయాలన్నీ ఓ స్థాయికి మించనివే. వాటిని నమ్ముకుంటే పెద్దగా ఎదుగూ బొదుగూ ఉండేలా లేదు.  మరి తను ఎదగాలంటే ఎలా అని ఆలోచనలోపడ్డాడు. అప్పు డొచ్చిందా ఆలోచన. అలా ఎదగాలంటే తనకి తప్పనిసరిగా  పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం ఉండితీరాలి. అప్పుడే ఈ జనాలు పట్టిం చుకుతీరతారు. యింకా పార్టీలు కూడా పిలిచి మరీ సీటిచ్చే అవకాశం ఉంది. యింతకీ ఆ పెద్దవాళ్ళంటే సీఎం., పీఏం., ప్రెసిడెంట్‌ స్థాయిలో  ఉండాలి.  మరి అలాంటి వాళ్ళతో పరిచయాలంటే మాటలా?.. మరె లాగా అని ఆలోచిస్తుంటే అప్పుడొచ్చిందా ఆలోచన. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా బజారుకి పరిగెత్తాడు. లేపాక్షి బొమ్మల షాపు, యింకా ఒకట్రెండు షాపులూ తిరిగి తనక్కావలసిన వస్తువులు కొన్నాడు. యింతకీ వెంకటేశం కొన్న ఆ వస్తువులేవో ఓ చిన్నపాటి పాలరాతి మందిరంలాంటిది., యింకా దాంట్లో పెట్టడానికి ఓ రాముడి బొమ్మ. యింకా ఓ గోవిందుడి బొమ్మ. ఆ మందిరంలోకి యిద్దరి దేవుళ్ళ బొమ్మలూ అమర్చాడు. దాని కింద గౌరవనీయులైన రామనాధ్‌ కోవింద్‌ గారికి శుభాకాంక్షలతో … మీ మిత్రుడు వెంకటేశం పంపిస్తున్న  కానుక’ అన్న అర్థం వచ్చేలాంటి ఇంగ్లీష్‌ మాటల స్టిక్కరొకటి చేయించి అంటించాడు. తర్వాత దానిని అందంగా గిఫ్ట్‌ ప్యాక్‌ చేయించి, రాష్ట్రపతి భవనానికి పంపించేశాడు. యిది జరిగిన రెండు వారాలకి వెంకటేశానికి ఓ ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరమేదో స్వయంగా రాష్ట్రపతి భవన్‌ నుంచి, రాష్ట్రపతి గారి పేరిటే వచ్చింది. ‘మీరు పంపిన విలువయిన బహుమతికి రాష్ట్రపతి గారు ఎంతో సంతోషించారనీ, అలాంటి మంచి బహుమతి పంపిన మిత్రులయిన మిమ్మల్ని ఆయన ఎంతో అభినందిస్తున్నారనీ తెలియజేస్తున్నాం’.. అని రాష్ట్రపతి తరపున ఆయన పీయస్‌ రాసిన ఉత్తరమది. యింకే ముంది… వెంకటేశం కాస్తా ఆ ఉత్తరం విషయం ఊరందరికీ చెప్పేసుకున్నాడు. యింకా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ‘నా మిత్రుడయిన రాష్ట్రపతి నేను పంపిన బహుమతిని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ఆ విషయాన్ని ప్రత్యేకంగా ఉత్తరం రాశారు కూడా..’ అంటూ శెలవిచ్చాడు. అంతేకాకుండా రాష్ట్రపతి గారి తరపునొచ్చిన ఆ లెటర్‌ని చూపించాడు. యింకేముంది… మర్నాటికల్లా ఆ వార్తేదో అన్ని పేపర్లలో గట్టిగానే వచ్చింది. దాంతో వెంకటేశం, రాష్ట్రపతిగారూ మంచి స్నేహితులన్న భావం అందరికీ వచ్చింది. అదీ ప్రారంభం… అదక్కడితో ఆగలేదు.. దీపావళి వస్తుందనగా వెంకటేశం రాష్ట్రపతి పేరిట ఓ బహుమతి, యింకా మంచి గ్రీటింగూ కొని ఆయనకి పంపే శాడు. దానికీ రాష్ట్రపతి గారి నుంచి ఆయన తరపున పీయస్‌ నుంచి రిప్లయ్‌ వచ్చేసింది. ‘మిత్రుడు వెంకటేశానికి రాష్ట్రపతిగారు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారన్న’ భావం ఉన్న ఉత్తరమది. వెంక టేశం దానినీ పబ్లిక్‌ చేసేశాడు. తర్వాత న్యూ యియర్‌ కీ అదే పరిస్థితి. దాంతో పబ్లిక్‌లో కూడా వెంకటేశం రాష్ట్రపతిగారికి బాగా సన్నిహితు డన్న పేరయితే వచ్చేసింది. దాంతో వెంకటేశాన్ని యింతకు ముందు కంటే అంతా ఎంతో బాగా చూస్తున్నారు. యింక ఎక్కడ రాష్ట్రపతి గారి ప్రస్థావన వచ్చినా దాంట్లో వెంకటేశం ప్రస్థావనా ఉంటుంది. యిక ఎలక్షన్లు దగ్గరయ్యే కొద్దీ పార్టీలు కూడా వెంకటేశాన్ని ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఎంతయినా రాష్ట్రపతిగారికి అంత సన్నిహితుడంటే రేపు ఏవయినా ఉపయోగాలు ఉండొచ్చు కూడా. దాంతో వెంకటేశం చుట్టూ తిరుగుతున్నాయి. యిక ఏదయినా మీటింగ్‌కని వెంకటేశాన్ని పిలిచినా అక్కడ ‘రాష్ట్రపతిగారికి అత్యంత ఆప్తులూ, మిత్రులూ అయినా వెంకటేశంగారు’ అని  ాసంబోధిస్తు న్నారు. యింతలో ఎలక్షన్లయితే దగ్గరపడ్డాయి. పార్టీలన్నీ కేండిడేట్లని సెలక్ట్‌ చేసుకునే పనిలోపడ్డాయి. ఓ పెద్ద పార్టీ అయితే వెంకటేశానికి  సీటిచ్చేసింది కూడా..!
—–
.. అది గురూగారూ… రాత్రి నా కొచ్చిన కల..” అన్నాడు వెంకటేశం. అంత దాకా చుట్ట గుప్పుగుప్పుమనిపిస్తూ అంతా విన్న గిరీశం పెద్దగా నవ్వేసి ”నువ్వు చెప్పేది వింటుంటే నా చిన్నప్పటి సంఘటన ఒకటి గుర్తుకొస్తుందనుకో” అన్నాడు. వెంకటేశం ఆసక్తిగా అదేంటన్నట్టుగా చూశాడు. అప్పుడు గిరీశం వివరంగా చెప్పడం మొదలెట్టాడు. ”ఆ.. ఏం లేదోయ్‌.. మనూళ్ళో వెంకాయమ్మ గారు ఉండేది గుర్తుందా.. అప్పట్లో వాళ్ళబ్బాయికి అదేదో గవర్నమెంటు ఉద్యోగం వచ్చిందిలే. ఆ సందర్భంలో సదరు గవర్నమెంటు ఆఫీసు నుంచి ఆ వ్యక్తిని ఉద్యోగంలో చేరమని అభ్యర్ధిస్తున్నట్టుగా ఆర్డర్స్‌ వస్తాయి కదా. దాని కావిడ ‘మా అబ్బాయిని ఉద్యోగానికి  గవర్నమెంటు కోరి పిలిపించుకుంది’ అని గొప్పగా చెప్పుకునేది. వినే వాళ్ళంతా ఓహో అనుకునేవారు. అయితే యిక్కడ వాస్తవం ఏంటంటే ఎవరికి గవర్నమెంటు ఉద్యోగం వచ్చినా అలా ప్రభుత్వం నుంచి లెటర్‌ రావడం మామూలే. యిక యిప్పుడు నీకొచ్చిన కలకి కారణం ఏంటంటే.. నిన్న ఓ ప్రముఖ పేపర్లో ఎవరో సత్తిపండు అన్నవ్యక్తి  పంపిన చిత్రానికి రాష్ట్రపతి ప్రత్యేకంగా మెచ్చుకుని అభినందనలు తెలిపారన్న వార్త వచ్చింది. అయితే విషయం ఏంటంటే.. ఓ గిఫ్టో, యింకో వస్తువో చివరికి, ఉత్తరం రాసినా రాష్ట్రపతికి ఎవరు పంపినా ఆయన ఆఫీసు నుంచి ఓ స్టాండర్డ్‌ రిప్లయ్‌ రాష్ట్రపతిగారు స్వయంగా అభినందించినట్టుగా వచ్చేస్తుంది. అయితే దానిని యింతిదిగా పేపరుకిచ్చకోవడమే అతిశయం. అసలిది ఎలా ఉంటుందంటే…’సీఎం చంద్రబాబునాయుడు గారు నాకు చాలా బాగా తెలుసు అనొచ్చు” అదేదో నిజమే. ఆయన అందరికీ తెలిసినోడే కదా. అయితే వీళ్ళలో ఆయనకి  ఎందరు తెలుసన్నదే అసలయిన ప్రశ్న. ఈ పబ్లిసిటీ వ్యవహారమూ అలాంటిదే అనుకో. యింతకీ నేను చెప్పేదేంటంటే.. ఏదో యిలాంటి పబ్లిసిటీ కోసం అంతా పాకులాడుతుండవచ్చు. అయితే పత్రికలు వాటిని ప్రచురించడంలో కొంచెం విజ్ఞత చూపితే బాగుంటుంది” అంటూ వివరించాడు.
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here