పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా 28న భారత్‌ బంద్‌

0
296
 
చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సంఘీభావం 
 
రాజమహేంద్రవరం, నవంబర్‌ 26 :  పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా ప్రతిపక్షాలు ఈ నెల 28న తలపెట్టిన భారత బంద్‌కు ది రాజమండ్రి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సంఘీభావం తెలియజేసింది. వర్తకులంతా బంద్‌లో పాల్గొని ప్రధానమంత్రికి ప్రజాభిప్రాయాన్ని తెలియజేయాలని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పాలకవర్గ, కార్యవర్గ, అనుబంధ సంస్ధల అధ్యక్ష, కార్యదర్శుల సమావేశం కోరింది. నిన్న జరిగిన ఈ సమావేశానికి చాంబర్‌ అధ్యక్షులు బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో సంయుక్త కార్యదర్శి వెత్సా బాబ్జీ తీర్మానాలను ప్రవేశపెట్టగా ఆమోదించారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం దేశ ప్రజలను, సమాజంలోని అన్ని వర్గాల ప్రజల బ్రతుకుతెరువులను అతలాకుతలం చేసిందని, అంతే గాక 20 రోజులుగా ఆర్ధిక వ్యవస్థ స్తంభించిన కారణంగా వర్తక, వాణిజ్యం సంక్షోభంలో పడ్డాయని సమావేశం పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ప్రజల మనోభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేయడానికి వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చిన బంద్‌ పిలుపునకు వర్తకులంతా సంఘీభావం తెలియజేయాలని సమావేశం కోరింది.  వర్తకులు ఈ నెల 28 వ తేదీన తమ దుకాణాలను మూసివేయాలని పిలుపు ఇచ్చారు. బంద్‌ నుంచి మెడికల్‌, కూరగాయలు, హోటల్స్‌, పాల వ్యాపారాలను మినహాయించారు. పెద్ద నోట్ల రద్దుతో వర్తక, వాణిజ్యం క్షీణించి, పన్నుల ఆదాయం తగ్గిన కారణాలను కప్పిపుచ్చుకోవడానికి  చిన్న చిన్న వర్తకులు సైతం ఈ- పాస్‌ యంత్రాలను ప్రతి దుకాణంలో ఏర్పాటు చేయాలని, లేకపోతే వ్యాపారాలు చేయడానికి వీలులేదని అధికారులు వర్తకులను బెదిరించే ధోరణికి అడ్డుకట్ట వేయడానికి అవసరమైన కార్యాచరణకు రాష్ట్ర స్థాయి సదస్సుకు సన్నాహక విషయమై కార్యాచరణను రూపొందించడానికి జిల్లా స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. దీనిపై అవసరమైతే నిరవధిక వాణిజ్య బంద్‌ పాటించాలని పిలుపు ఇచ్చే విషయాన్ని కూడా చర్చిస్తారు.  దీనిపై చర్చించేందుకు వచ్చే నెల 2న ఉదయం 10-30 గంటలకు చాంబర్‌ భవనంలో జిల్లా స్థాయి వర్తక సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో  ఏపీ ఫెడరేషన్‌ ఆఫ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఇండస్ట్రీ కన్వీనర్‌ అశోక్‌కుమార్‌ జైన్‌, జిల్లా చైర్మన్‌ నందెపు శ్రీనివాస్‌, చాంబర్‌ మాజీ అధ్యక్షులు బొమ్మన రాజ్‌కుమార్‌, బాలనాగు బలేష్‌గుప్తా, రాష్ట్ర క్రెడై కోశాధికారి బుడ్డిగ శ్రీనివాస్‌, చాంబర్‌ ఉపాధ్యక్షులు గ్రంధి వెంకటేశ్వరరావు, దొండపాటి సత్యంబాబు, ట్రస్ట్‌బోర్డు కార్యదర్శి కొత్త బాల మురళీకృష్ణ, డైరక్టర్‌ బత్తుల శ్రీరాములు, చాంబర్‌ ప్రతినిధులు బిళ్ళా రాజు, లక్కోజు వీరభద్రరావు (లక్కోజి),మామిడి వెంకట్రాజు, తోట లక్ష్మీనారాయణ (కన్నా), పచ్చిగోళ్ళ వెంకట సూర్యనారాయణ, పైడేటి నారాయణరావు, పేరూరి గంగాధరం, కుడుపూడి వెంకట ప్రసాద్‌, కనకం అమరనాథ్‌, నాళం సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఎస్‌.రఫీక్‌ రాజా, చలం, నూనె రామకృష్ణ, ఎస్‌.వై.ఎస్‌. ప్రసాద్‌, యలమర్తి నాగేశ్వరరావు, కీర్తి సుబ్బారావు, ఎస్‌.అనంతరామ్‌ తదితరులు పాల్గొన్నారు.