పెరిగిన వరద ఉధృతి 

0
468
ధవళేశ్వరం వద్ద మళ్ళీ రెండవ ప్రమాద హెచ్చరిక జారీ
వంతెనలపై రాకపోకలు నిలిపివేసిన అధికారులు
రాజమహేంద్రవరం ఆగస్టు 20 : గోదావరి నీటి ప్రవాహం తగ్గినట్లు తగ్గి, మళ్లీ ఈరోజు మధ్యాహ్నం నుంచి నీటి ప్రవాహం పెరిగింది. గోదావరి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.  అయితే ఎగువ ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరి నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో శబరి నదీపరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో తిరిగి గోదావరిలో నీటి ప్రవాహం పెరిగింది. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 12.4 అడుగుల నీటిమట్టం నమోదు అయ్యింది. దీంతో బ్యారేజీకి ఉన్న నాలుగు ఆరమ్స్‌లోని 175 గేట్లను ఎత్తివేసి 10.75 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగించారు. భద్రాచలం వద్ద నీటి ప్రవాహం పెరుగడంతో ఈరోజు ఉదయం 11.30 గంటలకు గోదావరి వరద నీరు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.75 అడుగుల నీటిమట్టానికి చేరుకుంది. దీంతో బ్యారేజీ నుంచి సముద్రంలోకి 12.98 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నగరంలోని పుష్కర ఘాట్‌ వద్ద గోదావరి నీటి ప్రవాహం ఘాట్‌ మెట్లపైకి రావడంతో సందర్శకులు గోదావరిని తిలకించేందుకు బారులు తీరుతున్నారు. ఎటువంటి పరిణామాలు జరగకుండా ఉండేందుకు ఘాట్‌ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలావుంటే, సోమవారం ఉదయం పది గంటల నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చిన గోదావరి నీటి ప్రవాహం 11 గంటలకు మరింతగా పెరిగింది. సోమవారం 11 గంటలకు కాలేశ్వరం వద్ద 17.60 మీటర్లు నమోదు కాగా, పేరూరు వద్ద 11.98 మీటర్లు, దుమ్ముగూడెం వద్ద 12.33, భద్రాచలం వద్ద 44.40 అడుగులు, కూనవరం వద్ద 19.24 మీటర్లు, కుంట వద్ద 11.83 మీటర్లు, కొయిదా వద్ద 23.90 మీటర్లు, పోలవరం వద్ద 14.32 మీటర్లు రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌ వద్ద 17.74 మీటర్ల నీటి ప్రవాహం నమోదు అయ్యింది. అయితే సోమవారం సాయంత్రానికి మూడు ప్రమాద హెచ్చరిక స్థాయికి నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
గోదావరి వారధులపై రాకపోకలు నిలిపివేత
పశ్చిమ గోదావరి జిల్లాలోని తుమ్ములేరు వాగు పొంగి ప్రవహిస్తుండటంతో అనేక గ్రామాలు నీట మునిగాయి. దీంతో తుమ్ములేరు వాగు మీదుగా వెళ్లే రహదారుల్లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో రాజమహేంద్రవరం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లే ధవళేశ్వరం బ్యారేజీతోపాటు, రోడ్డు కమ్‌ రౖౖెలు బ్రిడ్జిపై రాకపోకలతోపాటు, గమాన్‌ ఇండియా నాలుగో వారధిపై వెళ్లే వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ మూడు వారధులపై వెళ్లే భారీ వాహానాలన్నీంటినీ రావులపాలెం మీదుగా వెళ్లేలా పోలీసులు మళ్లించారు. ఆయా వారుధులపై కేవలం ద్విచక్రవాహనాలు, ఆటోలు మాత్రమే వెళ్లేలా అనుమతి ఇస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here