పేదల పొట్ట కొట్టడమే.. 

0
136
అన్న క్యాంటిన్ల మూసివేతపై గన్ని నిరసన
రాజమహేంద్రవరం, ఆగస్టు 2 : నిరుపేదలకు.. వివిధ చిన్న చిన్న వృత్తి ఉద్యోగాలలో వున్నవారికి వరప్రదాయని వంటి ‘అన్న క్యాంటీన్ల’ను రాష్ట్రవ్యాప్తంగా మూసివేయడం చాలా దారుణం.. బాధాకరమని గుడా మాజీ చైర్మన్‌, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్‌ నాయకులు గన్ని కృష్ణ అన్నారు. కేవలం పదిహేను రూపాయలకే అల్పాహారం, రెండుపూటలా నాణ్యమైన రుచికరమైన భోజనం పేదవారికందజేయాలన్న సత్సంకల్పంతో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంటీీన్లను కేవలం గత ప్రభుత్వ పథకాలను రద్దు చేయాలనే కక్షపూరిత నిర్ణయంగా ఈ చర్యను గన్ని పేర్కొన్నారు. పేదల పొట్టకొట్టే ఈ నిర్ణయాన్ని వెనుకకు తీసుకుని మళ్లీ అన్న కేంటీన్లను సీఎం జగన్‌ తండ్రి పేరుతో రాజన్న కేంటీన్‌ అని పేరుపెట్టైనా సరే పునఃప్రారంభించవలసిందిగా ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.  ప్రభుత్వం పిలుపు ఇస్తే ఎంతోమంది దాతలు ముందుకొచ్చి ఈ పథకానికి ఆర్ధిక సహకారం చేసి ప్రభుత్వ భారాన్ని తగ్గించగలరని గన్ని అన్నారు.  గత సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా లక్ష రూపాయలను అన్న కేంటీన్ల నిర్వహణకు నాటి ముఖ్యమంత్రికి అందజేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తన వలె ఎంతోమంది పుట్టినరోజు, పెళ్లిరోజుల వంటి శుభ కార్యక్రమాల్లో నాటి ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు సహాయం చేసిన విషయాన్ని గన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ దృష్ట్యా  గత ప్రభుత్వ పథకాలను పునః సమీక్షలు, రద్దుల పేరుతో నిలిపివేసి సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందుల పాలు చేయవద్దని  ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here