పేదవాడి ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటిన్లు 

0
270
సుబ్రహ్మణ్య మైదానంలో ప్రారంభించిన ప్రజా ప్రజాప్రతినిధులు
రాజమహేంద్రవరం, నవంబర్‌ 12 : ప్రతి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టి  ఆకలి తీర్చేందుకు సిఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన అన్న కాంటీన్లు ప్రయోజనకరంగా ఉన్నాయని పార్లమెంట్‌ సభ్యులు మాగంటి మురళీమోహన్‌ అన్నారు. సుబ్రహ్మణ్య మైదానంలో నూతనంగా నెలకొల్పిన అన్న క్యాంటీన్‌ను మాగంటి మురళీమోహన్‌, రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మేయర్‌ పంతం రజనీ శేషసాయి ప్రారంభించారు. అనంతరం అన్న కాంటీన్‌లో ఆహార పదార్ధాలను నేతలు రుచి చూశారు. ఈ సందర్భంగా మురళీమోహన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి కూడు,గూడూ, గుడ్డ అందించాలన్న సంకల్పంతో సిఎం చంద్రబాబు ఎన్నో పధకాలను అమలు చేస్తున్నారని, అందులో భాగంగా పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్న కాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.పేదవాడి ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, రూ.5కే నాణ్యమైన ఆహారాన్ని అందిస్తుందని అన్నారు. గోరంట్ల మాట్లాడుతూ అన్న కాంటీన్‌లకు మంచి ఆదరణ వస్తుందని, త్వరలో కోటిపల్లి బస్టాండ్‌లో ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో కూడా అన్న కాంటీన్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. కష్టజీవులకు, సామాన్యులకు ఉపయుక్తంగా రూ.5 కే అల్పాహారం, భోజనం అందించడం సామాన్యమైన విషయం కాదన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే నాయకులు ఇలాంటి విషయాలను కళ్ళు తెరచి చూడాలని అన్నారు. గన్ని  కృష్ణ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో సిటీలో 3 అన్న కాంటీన్‌లు ఏర్పాటు చేయడం జరిగిందని, పేదవాడి ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం సబ్సిడీ భరిస్తూ కేవలం రూ.5 కే ఆహారం అందిస్తుందన్నారు. రాష్ట్రం ఆర్దిక లోటుతో ఉన్న సమాజంలో పేదలు ఆకలితో అలమటించకూడదన్న ఆలోచనతో సిఎం చంద్రబాబు అన్న కాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపకులు నందమూరి తారక రామారావు ఆశయాలను చంద్రబాబు నెరవేరుస్తున్నారని అన్నారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ పేదల కోసం పరితపించే సిఎం చంద్రబాబు చిరకాలం ఉండాలని, ఎన్ని ఇబ్బందులు ఉన్న ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా మోడీ మోసగించారని, చంద్రబాబుపై ఎన్ని కుట్రలు చేసినా 2019 ఎన్నికలలో తెదేపాదే విజయమన్నారు. మేయర్‌ మాట్లాడుతూ ప్రజల ఆశయాలకు అనుగుణంగా సిఎం చంద్రబాబు పని చేస్తున్నారని, ఆయన ప్రవేశ పెడుతున్న పధకాలను సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మర్రి దుర్గాశ్రీనివాస్‌, సింహా నాగమణి, కొమ్మా శ్రీనివాస్‌, పెనుగొండ విజయభారతి, కోరుమెల్లి విజయశేఖర్‌, తంగెళ్ళ బాబి, కోసూరి చండీప్రియ, నగరపాలక సంస్ధ కమిషనర్‌ సుమిత్‌ కుమార్‌, ట్రైనీ సంయుక్త కలెక్టర్‌  జ్ఞానీచంద్ర తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here