పోరాటంతోనే అభివృద్ధి సాధ్యం

0
320
రాజమహేంద్రవరం ప్రాంత అభివృద్ధి సదస్సులో వక్తలు
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 19 : పోరాటపటిమతోనే రాజమహేంద్రవరం అభివృద్ధి సాధ్యపడగలదని, ఇందుకు ప్రజలు సన్నద్ధంకావాలని పలువురు వక్తలు ఉద్ఘాటించారు. ఆదివారం మోరంపూడిలోని బార్లపూడి కళ్యాణమండపంలో ‘రాజమహేంద్రవరం ప్రాంత అభివృద్ధి ‘ సదస్సు జరిగింది. ప్రముఖ సంఘనేవకులు కడలి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈసదస్సుకు రెడ్డి రాజు అధ్యక్షత వహించారు. రాష్ట్ర బీసీ సంఘాల సమాఖ్య జెఎసీ చైర్మన్‌ మార్గాని నాగేశ్వరరావు మాట్లాడుతూ నేటిపాలకులు రాజమహేంద్రవరం ప్రాంత అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారన్నారు. పెట్రోలియం యూనివర్సిటీ రాజమండ్రికి రాకపోవడం వెనుక పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. గోదావరి అర్బన్‌ డవలప్‌మెంట్‌ అథారిటీని ప్రభుత్వం ప్రకటిస్టే, దాని కార్యస్థానాన్ని  కాకినాడలో పెట్టాలని నిర్ణయించడం సబబు కాదన్నారు. కడలి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పెట్రోయూనివర్సిటీ రాజమండ్రికి కాకుండా విశాఖకు తరలిపోయిందని, స్మార్ట్‌సిటీజాబితాలో రాజమండ్రి లేకపోవడం వంటి అంశాలు చూస్తే పాలకులకు ఈ ప్రాంత అభివృద్ధిపై చిత్తశుద్ది లేదని తేటతెల్లమవుతోందన్నారు. రాజమండ్రికి మంజూరైన  పెట్రోయూనివర్సిటీకి స్థలం లేదన్న కారణంగా విశాఖకుతరలిస్తుంటే ఒకరూకూడా ప్రశ్నించకపోవడం విచారకరమని కడలి వెంకటేశ్వరరావు అన్నారు. నిజం చెప్పాలంటే లాలాచెరువు అటవీప్రాంగణంలో 4వేల ఎకరాల భూమి ఉందని, ఇందులో రెండు వందల ఎకరాల భూమిని సేకరించలేమో అని ఆయన ప్రశ్నించారు. అమరావతిలో రాజధానికోసం 10వేల ఎకరాల అటవీ భూమిని తీసుకున్నారని, మరి అలాంటి చొరవను మన ప్రజాప్రతినిధులు ఇక్కడ ఎందుకు చూడలేకపోయారని ప్రశ్నించారు. రూ.650కోట్లతో నిర్మితమయ్యే యూనివర్సిటీ రాజమండ్రికే చెందాలన్నారు. ఇలాంటి స్థితిలో రాజమహేంద్రవరం ఎలా అభివృద్ధి చెందగలదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. మోరంపూడిలో ప్లైఓవర్‌ నిర్మాణం లేకపోవడం వల్ల ఎదురవుతున్న ట్రాఫిక్‌, సంభవిస్తున్న ప్రమాదాలు, ప్రాణనష్టం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. వెంటనే ప్లైఓవర్‌ నిర్మాణానికి శ్రద్ధవహించాలన్నారు. ఇంకా పలు సమస్యలపై పలువురు సదస్సులోచర్చించారు. కార్యక్రమంలో బర్రె కొండబాబు, బుడ్డిగ శ్రీనివాస్‌, మరుకుర్తి దుర్గాయాదవ్‌, పితాని తారకేశ్వరరావు, నక్కెళ్ళ బాబూరావు, నొడగల సుద, అంకం గోపి, కేతా ముసలయ్య, గుత్తుల గోవింద్‌, మజ్జి అప్పారావు, వైరాల అప్పారావు, రేలంగి సత్యనారాయణ, ఇమంది శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.