పోలింగ్‌పై పోస్టుమార్టమ్‌ – కౌంటింగ్‌పై నిర్ధేశం 

0
286
పార్లమెంట్‌ నియోజకవర్గాల సమీక్షకు చంద్రబాబు శ్రీకారం
హాజరైన రాజమహేంద్రవరం లోక్‌సభ పరిధిలోని నేతలు
రాజమహేంద్రవరం, మే 4 : సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్‌ సరళి, కౌంటింగ్‌లో తీసుకోవలసిన జాగ్రత్తలపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం నేేటి నుంచి సమీక్షలకు శ్రీకారం చుట్టింది. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు విజయవాడ-గుంటూరు జాతీయ రహదారిపై మంగళగిరి వద్ద ఉన్న హ్యాపీ రిసార్ట్స్‌లో చేపట్టిన ఈ సమీక్షలు 22 వ తేదీ వరకు కొనసాగనున్నాయి.  ముఖ్యమంత్రి నివాసం వద్ద సమావేశాల నిర్వహణకు ఎన్నికల కోడ్‌ ఆంక్షలు ఉండటంతో స్ధలాన్ని మార్చారు. రోజుకు రెండు లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపై చంద్రబాబు సమీక్ష జరుపుతున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 50 మంది పార్టీ నేతలను సమీక్షకు ఆహ్వానిస్తున్నారు. నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు, ఏరియా కోఆర్డినేటర్లు, ఇతర ముఖ్య నేతలు ఈ జాబితాలో ఉన్నారు. రోజుకు రెండు పార్లమెంట్‌ స్ధానాలు వాటి పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమావేశమవుతున్నారు. ముందుగా రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి చంద్రబాబు సమీక్షలు ప్రారంభించగా ఈసారి సమీక్షలను ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తం చేసేందుకు  వినియోగించుకోబోతున్నారు. కాగా ఈరోజు జరిగిన రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గ సమావేశానికి అభ్యర్థి మాగంటి రూపతో పాటు నియోజకవర్గంలోని అసెంబ్లీ అభ్యర్ధులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, (రాజమహేంద్రవరం సిటీ ),ఆదిరెడ్డి భవాని (రాజమహేంద్రవరం రూరల్‌), పెందుర్తి వెంకటేష్‌ (రాజానగరం), నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (అనపర్తి)లతో పాటు కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్ధులు,గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు,  శాప్‌ డైరక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, ఆర్యాపురం అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు, రూరల్‌ పార్టీ నాయకులు మార్గాని సత్యనారాయణ, తెదేపా యువ నేత ఆదిరెడ్డి వాసు తదితరులు హాజరయ్యారు.మరోవైపు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎం పోలవరం పర్యటన ఖరారైతే ఆ రోజు ఉదయం జరగాల్సిన కాకినాడ లోక్‌సభ నియోజకవర్గ సమీక్ష తేదీలో మార్పు ఉండే అవకాశముందని నేతలు భావిస్తున్నారు. సమీక్షలు జరిగే రోజుల్లో రెండు రోజులపాటు పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు వెళ్లనున్నారు. ఆ రోజుల్లో సమీక్ష సమావేశాలు ఉండవని పార్టీ వర్గాలు తెలిపాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here