ప్రకృతి వ్యవసాయంలో రైతులకు శిక్షణ

0
168
ఎంపీ మార్గాని ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం
రాజమహేంద్రవరం, నవంబర్‌ 20 : అగ్రికల్చర్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ (ఎటిఎంఎ) ద్వారా ప్రకృతి వ్యవసాయంలో రైతులకు శిక్షణ ఇస్తామని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి కైలాష్‌ చౌదరి చెప్పారు. లోక్‌సభలో బయో ఫెర్టిలైజర్స్‌పై రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఎటిఎంఎ ద్వారా రైతులకు ప్రకృతి వ్యవసాయం వైపు తీసుకెళతామన్నారు. జీరో బేస్డ్‌ బడ్జెట్‌తో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు రైతులకు మంచి అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.  ప్రకృతి వ్యవసాయంపై భారత వ్యవసాయ పరిశోధన కౌన్సిల్‌ (ఐసిఎఆర్‌) శాస్త్రవేత్తలు పలు విధాలుగా పరిశోధనలు చేస్తున్నారని చెప్పారు. తద్వారా భవిష్యత్తులో రైతుల ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ అంశంపై సభ్యులు రైతులకు అవగాహన కల్పించి, వారికి మేలు కలిగేలా పనిచేయాలని కోరారు. దీనితో పాటు ఢిల్లీలో కాలుష్య నివారణకు ఎంపీ భరత్‌ పలు సూచనలు చేసారు. జీరో అవర్‌లో వాయు కాలుష్యంపై భరత్‌ మాట్లాడుతూ పర్యావరణ రహిత విద్యుత్‌ వాహనాలపై జిఎస్‌టిని పూర్తిగా రద్దు చేయాలన్నారు. మధ్య తరగతి ప్రజలకు విద్యుత్‌ వాహనాలు అందుబాటులో ఉండేలా ధరలో 20 శాతం రాయితీ ఇవ్వాలని కోరారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద నిర్మించే ఇళ్లకు నిర్మాణ సమయంలోనే సోలార్‌ రూఫ్‌ టాఫ్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. వర్టికల్‌ గార్డెన్స్‌లో ఇళ్లు నిర్మించాలని, రాజమహేంద్రవరంలో 150 ఇళ్లను పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టామని తెలిపారు. గాలిని శుద్ధిచేసే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here