ప్రజలకు అంతా తెలుసు… మీ విమర్శలకు ఓట్లు రాలవు 

0
382
బిజెపి నేతలపై ఏపీ తెదేపా అధ్యక్షులు,మంత్రి కళా వెంకట్రావు ధ్వజం
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 21 : ఆంధ్రప్రదేశ్‌పై ప్రధాని మోడీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి కళా వెంకటరావు పేర్కొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ సమావేశం ఈరోజు కాకినాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడలో సమావేశం జరిపిన భాజపా నాయకులు తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు చేశారని, అయితే ఆ విమర్శలకు ఓట్లు రాలవని ఎద్దేవా చేశారు. భాజపా నాయకులు విభజన హామీలపై నోరు మెదపడం లేదన్నారు. చీకటి వ్యవహారాలు బయటకూడా చేస్తే తప్పులేదనే భావనతోనే భాజాపా నాయకులు జగన్‌ను బహిరంగంగా కలుసుకొంటున్నారని అన్నారు. తోక పార్టీలకు, భాజపాకు ఓట్లు వేస్తే ప్రజలు నష్ట పోతారని, వైఎస్సార్‌ సీపీకి వేస్తే ప్రజల ఓట్లు బూడిదలో పోసిన పన్నీరులా మారతాయని అన్నారు. ప్రధాని మోడీ అధికారంలో ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి చెందిన భాజాపా నాయకులు రాస్ట్ర ప్రయోజనాలపై మాట్లాడితే ప్రజలు వింటారని అన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వం రూ.58వేల కోట్ల రూపాయలతో ఇరిగేషన్‌, నదుల అనుసంధానం తదితర అభివృద్ధి పనులను చేసిందన్నారు. అలాగే రాష్ట్రంలో 57 లక్షల మందికి సామాజిక పింఛన్లు అందించడం జరుగుతుందన్నారు. గిరిజనులు, చేనేత కార్మికులు, మత్స్యకారులకు 50 సంవత్సరాలకే పింఛన్‌లు అందిస్తున్నామని తెలిపారు. భాజాపా నాయకులు వాస్తవాలను మరిచి  మాట్లాడటం మంచిది కాదన్నారు. మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి భాజాపా నాయకులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. గత నాలుగు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకరించడం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో  సైకిల్‌ నుండి విడువడిన కమలం వాడిపోతుందని, రాష్ట్ర అభివృద్ధిని భాజాపా,వైఎస్సార్‌ సీపీ అడ్డు కొంటున్నాయని విమర్శించారు. ఈ సమావేశంలో జిల్లా తెదేపా అద్యక్షులు నామన రాంబాబు, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, పలువురు శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here