ప్రజలతో మమేకమయ్యే అవకాశం లేకే….

0
1597
వైసిపికి ‘కందుల’ రాజీనామా- త్వరలో జనసేనలో చేరేందుకు నిర్ణయం
రాజమహేంద్రవరం ఆగస్టు 18 : కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా, ఇన్‌చార్జ్‌గా ప్రతీక్షణం ప్రజలతో మమేకమై పనిచేసే అవకాశం దక్కిందని, అయితే వైపిపిలో ముందు నుంచి ఆ అవకాశం, వాతావరణం లేకపోవడం వల్ల వీడాల్సిన పరిస్థితి వచ్చిందని వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, గ్రేటర్‌ రాజమహేంద్రవరం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల లక్ష్మీ దుర్గేష్‌ ప్రసాద్‌ తెలిపారు. జనసేన నుంచి ఆహ్వానం అందిన నేపథ్యంలో త్వరలోనే ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు వెల్లడించారు. స్థానిక జెఎన్‌ రోడ్‌లోని ఆయన నివాసంలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో కందుల మాట్లాడుతూ వైసిపి అధినేత జగన్‌ సహా ఆ పార్టీకి చెందిన నాయకులెవరితోనూ తనకు అభిప్రాయబేధాలు, వ్యతిరేకత లేదని స్పష్టం చేసారు.  అసలు తనకిచ్చిన గ్రేటర్‌ రాజమహేంద్రవరం అధ్యక్షుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి పదవులకు సంబంధించిన కర్తవ్యం, నిర్ధేశాలను ఏమీ చెప్పలేదన్నారు. ఒక చట్రంలో ఇరుక్కున్నట్టుగా ఉన్నందున తన వెంట నడుస్తున్న అనుచరులందరితో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా.. ఏ పార్టీలో చేరినా సంపూర్ణ మద్ధతు ఇస్తామని చెప్పడంతో ఇప్పుడు జనసేనాని వెంట నడిచేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. త్వరలో మంచిరోజు చూసుకుని జనసేనలో చేరతానని తెలిపారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వల్ల రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందనే నమ్మకంతో ఉన్నానని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై  ఉండాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ముందుకు సాగుతామన్నారు. ఉత్తరాంధ్ర పర్యటన తరువాత పవన్‌లో చాలా మార్పు వచ్చిందన్నారు. రాష్ట్రంలోని సమస్యలపై స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగుతున్నారన్నారు. ఎవరి ప్రమేయంతోనో ఈ నిర్ణయం తీసుకోలేదని 30 సంవత్సరాలు రాజకీయాల్లో కొనసాగుతున్నానని.. అందువల్లనే ఇది తన సొంత నిర్ణయంగానే పరిగణించాలన్నారు. వైసిపి రాష్ట్ర కార్యాలయానికి ఫ్యాక్స్‌ ద్వారా తన రాజీనామా లేఖను పంపామని.. తన అనుచరులంతా శనివారం వైసిపికి గుడ్‌బై చెబుతున్నారన్నారు. రాజమహేంద్రవరం రూరల్‌ టిక్కెట్‌పై ఏమైనా హామీ ఇచ్చారా అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఎన్నికల్లోటిక్కెట్‌ వస్తుందా? లేదా? అనే విషయాన్ని ఆలోచించే పరిస్థితి లేదని ఎవరికి, ఎప్పుడైనా, ఎలాగైనా టిక్కెట్‌ వచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. పవన్‌ కల్యాణ్‌ క్లీన్‌ ఇమేజ్‌తో వస్తున్నారని రాష్ట్రానికి మంచి చేయగలరన్న నమ్మకం ఉందన్నారు. సమావేశంలో కందుల ముఖ్య అనుచరులు దాసరి శేషగిరి, గట్టి నరసయ్య, రెడ్డి సూరిబాబు, తోరాటి శ్రీను, పవనమూర్తి, ముద్రగడ జమ్మి, నారాయణగౌడ్‌, పేట రామకృష్ణ, చిక్కాల బాబులు, యడ్ల బుజ్జి, జార్జ్‌, నూకరాజు, మల్లి చిన్నా, పట్టపగలు వెంకటలక్ష్మి, తీగిరెడ్డి నాగేశ్వరరావు, పాటంశెట్టి గంగబాబు, సలీమ్‌, భాషా, గోవింద్‌, జంగా వినద్‌, చప్పా చిన్నారావు, ఆసూరి సుధాకర్‌, యడ్ల మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here