ప్రజలు జగన్‌ పాలన కోరుకుంటున్నారు

0
196
ఓటమి భయంతో ఈవీఎంలపై చంద్రబాబు రాద్ధాంతం
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్ధి రౌతు
రాజమహేంద్రవరం,ఏప్రిల్‌ 18 : ఓటింగ్‌ సరళిని పరిశీలిస్తే రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్న విషయం అందరికి అర్ధమవుతోందని, అయితే తెదేపా అధినేత చంద్రబాబుకు, టీడీపీ నేతలకు ఆ విషయం అర్ధమయ్యిందో కాలేదో మాత్రం చెప్పలేని విధంగా వారి ప్రవర్తన ఉందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజమహేంద్రవరం సిటీ అసెంబ్లీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మతిభ్రమించిందని  రాష్ట్రంలో ఎన్నికల సమరం ముగిసి ఇక ప్రజల తీర్పు కోసం అందరూ ఎదురు చూస్తుంటే చంద్రబాబు రాష్ట్రంలో ఒకలా, దేశంలో మరోలా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో రౌతు మాట్లాడుతూ ఎన్నికల రోజు అర్ధరాత్రి చంద్రబాబు  పార్టీ నేతలతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో తెలుగుదేశం పార్టీకి 130 సీట్లు వస్తున్నాయని, అధికారం మనదే అని చెప్పడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఇప్పటికే అదే చెబుతున్నారు…అలాంటప్పుడు ఈవిఎంలలో మోసం జరిగిందని, మోడీ,కెసిఆర్‌ కుట్రలు చేశారని రెండో వైపు చెబుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మాటలు,చేష్టలు చూస్తుంటే ఓటమికి కారణాలు ముందే వెతుకుంటున్నారని స్పష్టమవుతోందన్నారు. ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన చంద్రబాబును మళ్లీ నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. వెల్లువలా వచ్చిన ఓటర్ల బారులు చూస్తే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత అర్ధమవుతుందని, ఎన్నికల్లో ఓటింగ్‌ ఎక్కువ శాతం జరిగిందంటే ప్రజలు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారన్న ఆలోచన కూడా ఆ పార్టీ నేతలకు లేకపోవడం విచిత్రంగా ఉందన్నారు. అవినీతి, అక్రమాల పాలనకు ప్రజలు చరమగీతం పాడారని, మహిళలకు చంద్రబాబు చేసిన నమ్మకద్రోహానికి ప్రతీకారం తీర్చుకున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన అందిస్తే జాతీయ నేతలను తెచ్చి ప్రచారం చేసుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందో తెలియడం లేదా అని ప్రశ్నించారు. ఎన్నికలు ముగిసిన నాటి నుండి నేటివరకు అశాంతితో పరుగులు పెడుతున్న చంద్రబాబుకు ఇక రాజకీయ రిటైర్మెంట్‌ వచ్చేసిందన్నారు. ప్రజాతీర్పులో చంద్రబాబు తన ఓటమికి కారణాలు వెతుకుతూ ఇప్పటికీ జగన్‌పై బురద జల్లే పని మానుకోవాలని సూచించారు. ఎన్నికల్లో కుట్రలు చేసింది చంద్రబాబేనని జగన్‌కు అధికారం దక్కకూడదని పవన్‌ కల్యాణ్‌, మాయావతిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసారని ఆరోపించారు. 2014 లోనైనా,ఇప్పుడైనా సింహం సింగిల్‌ గానే వచ్చింది..ప్రజలు ఆదరించారు.. ఆశీర్వదించారు..నవరత్నాలను నమ్మారని…రాజన్న రాజ్యాన్ని కోరుకున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక ¬దా, రాష్ట్రానికి ప్రాజెక్టులు రాకుండా అడ్డుకున్న చంద్రబాబుకు ప్రజలు బై బై చెబుతున్నారన్నారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్‌, కార్పొరేటర్‌ బొంతా శ్రీహరి, పార్టీ నాయకులు నక్కా శ్రీనగేష్‌,సుంకర శ్రీను, మజ్జి అప్పారావు, అందనాపల్లి సత్యనారాయణ, కుక్కా తాతబ్బాయి, నీలం గణపతి,  తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here