ప్రజాసేవోన్మాదం

0
291
మనస్సాక్షి  – 1135
ఎలక్షన్స్‌కి రెండునెలల ముందు.. అప్పటి కింకా ఏ పార్టీ కేండిడేట్స్‌ని ప్రకటించనే లేదు. అయినా గంగలకుర్రులో మాత్రం హడావిడి మొదలయిపోయింది. ఊళ్ళో పెద్దలంతా ఒక ముఖ్యమయిన సమావేశం ఏర్పాటు చేశారు. దానికి రమ్మని ఎక్కడో రాజమండ్రిలో ఉంటున్న వెంకటేశానికి కబురు పంపించారు కూడా. ఎంతయినా ఊరు మొత్తానికి బాగా చదువుకున్నోడూ, తెలివయినోడూ వెంకటేశం కావడంతో ఎప్పుడయినా, ఏదయినా ముఖ్యమయిన విషయం ఉందంటే యిలా వెంకటేశానికి కబురు పంపించడం మామూలే. యిప్పు డర్జంటుగా రమ్మనేసరికి ఏం కొంప లంటుకు పోయాయోనని వెంకటేశం కూడా గబగబా పరిగెత్తుకొచ్చేశాడు. మొత్తానికి ఆరోజు సాయంత్రం రాములోరి గుడి ఆవరణలో ఊళ్ళో పెద్ద తలకాయలూ, వెంకటేశం సమావేశమయ్యారు. వారిలో ముందుగా కుటుంబరావు మాట్లాడుతూ ”యిదిగో వెంకన్న బాబూ.. చాలా ముఖ్యమయిన పనిమీదే నిన్ను పిలిపించాం. యిన్నేళ్ళనుంచీ చూస్తున్నామా.. ఊరిలో అభివృద్ధి ఎంతమాత్రం లేదు. సరయిన  రోడ్లు లేవు. మంచినీటి సౌకర్యాలు లేవు. లైబ్రరీ లేదు. ఏ ప్రభుత్వం అధికారంలోకొచ్చినా ఎవరూ పట్టించుకోరు” అంటూ ఆపాడు. వెంకటేశం ఆసక్తిగా వింటున్నాడు. అంటూ ఆపాడు. వెంకటేశం ఆసక్తిగా వింటున్నాడు. యింతలో కుటుంబ రావు కొనసాగిస్తూ ”ఎలక్షన్లొచ్చినప్పుడల్లా రెండు పార్టీలూ జనాలకి ఏవో తాయిలాలు పడేస్తాయి. అవేవో ఆ పూటే అయిపోతాయి. తర్వాత గెలిచినోడు ఊరిని పట్టించుకోకపోవడం జరుగుతుంది” అన్నాడు. అప్పుడు వెంకటేశం ”మరి ఎలక్షన్‌ ముందు యిచ్చిన హామీల గురించి గెలిచిన తర్వాత గట్టిగా నిలదీస్తే?” అన్నాడు. దానికి పక్కనున్న వెంకట్రావు ”ఆ..అదీ అయింది. ఎలక్షన్లో గెలిచిం తర్వాత ఊరి వంక తొంగిచూస్తే కదా. ఈసారి నువ్వే ఏదో ఒకటి చేసి ఊరు బాగుపడేలా చేయాలి” అన్నాడు. దాంతో వెంకటేశం ఆలోచనలో పడ్డాడు. సరిగ్గా అప్పుడొచ్చిందా ఆలోచన. అదీ మామూలు ఆలోచన కాదు. ఒక ఊరి రూపురేఖల్ని సమూలంగా మార్చగలిగే ఆలోచన. దాంతో మొహంలో వెలుగొచ్చింది. అయినా అప్పుడేం చెప్పలేదు. ఓసారి అందరివంకా తిరిగి ”రెండు నెలల్లో మన ఊరి స్వరూపం మారిపోతుంది. ఎలక్షన్‌ కోసం యిక్కడ రెండు పార్టీల అభ్యర్ధులూ నామినేషన్‌ వేసింతర్వాత  నాకు కబురుపంపించండి” అన్నాడు. దానికి అంతా తలూపారు.
——-
మార్చినెల.. రాష్ట్రమంతా నామినేషన్లు వేసేవారితో హడావిడిగా ఉంది. గంగలకుర్రులో కూడా ఎప్పటిలాగే పెద్దారావూ, చిన్నా రావూ తమతమ పార్టీల తరపున నామినేషన్లు వేసేశారు. ప్రచా రానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే యిక్కడ యిద్దరి గురించీ కొంచెం చెప్పాలి. పెద్దారావుకైతే కొంచెం దురదలెక్కువే. అయితే అవేవో అధికారానికి సంబంధించినవి. ఆస్తిపాస్తులయితే బానే ఉన్నాయిగానీ ”చేతిలో పవరుంటే ఆ కిక్కే వేరప్పా” అనుకునే బాపతు. దాని కోసం బాగా ఖర్చుపెడతాడు కూడా. యింకోపక్కన చిన్నారావుకీ ఆస్తిపాస్తులున్నాయి గానీ ఖర్చుపెట్టేదంతా అంత కంతా రాబట్టుకోవాలనుకునే తత్వం. ప్రస్తుతం అలాంటి వాళ్ళి ద్దరూ నామినేషన్లు వేసేశారు. ఆ మర్నాడే వెంకటేశం ఆ యిద్దర్నీ విడివిడిగా కలుసుకున్నాడు. పెద్దారావయితే వెంకటేశాన్ని సాద రంగా ఆహ్వానించాడు. కొంచెంసేపు మాటలయ్యాక వెంకటేశం ”యింతకీ ఖర్చు ఏమాత్రం అవుతుంది?” అనడిగాడు. దానికి పెద్దారావు ”ఓటర్లు లక్షా ఎనభై వేల పైచిలుకే. అందులో లక్ష మందికైనా పంచాలి. అవతల ఆ చిన్నారావు పంచేదాన్ని బట్టి ఆ పంచేదేదో యింకా పెంచాలి. ఎంతలేదన్నా పదికోట్లు కావచ్చు. అంత ఖర్చుపెట్టినా గెలుస్తానన్న గ్యారంటీ లేదు. డబ్బులు తీసుకున్నవాళ్ళు ఓటేస్తారో లేదో తెలీదు. అలా గని యివ్వడం మానేస్తే వెయ్యరు” అన్నాడు. యిక ఆ తర్వాత వెంకటేశం వెళ్ళి చిన్నారావుని కలుసుకున్నాడు. చిన్నారావయితే ”అవును వెంకటేశం.. యిన్ని కోట్లు ఖర్చు పెడతానా.. గెలిస్తే ఫరవాలేదు. ఓడితే మాత్రం ఎంత బాధని! మళ్ళీ అన్ని కోట్లు సంపాదించడం సాధ్యమా అని..” అన్నాడు. యిద్దరు చెప్పిందాని గురించీ ఆలో చించుకుంటూ వెంకటేశం యింటికెళ్ళిపోయాడు. ఆరోజు రాత్రి ఆ యిద్దరినీ రమ్మని కబురుపంపిం చాడు. వెంకటేశం కబురు పంపేసరికి యిద్దరూ వచ్చేశారు. ఎంతయినా  వాళ్ళిద్దరూ ఒకప్పుడు ఫ్రెండ్స్‌ కూడా నాయె. మొత్తానికి యింకో అర గంటలో ఆ మీటింగేదో మొదలయింది. దాంట్లో ఉన్నది వెంకటేశం, పెద్దారావు, చిన్నారావు మాత్రమే. ముందుగా వెంక టేశం మాట్లాడడం మొదలెట్టాడు. ”ఈ ఎలక్షన్‌ పేరు చెప్పి మీరిద్దరూ చెరి అయిదు నుంచి పది కోట్ల దాకా ఖర్చుపెట్టాలి. అయితే గెలిచే దొక్కరే. అంటే మీరు పంచే తాయిలాలేవో జనాలు యిద్దరి దగ్గరా పుచ్చేసుకుని ఒక్కర్ని గెలిపిస్తారు. అంతేనా?” అన్నాడు. దానికి యిద్దరూ ఒప్పుకున్నారు. అప్పుడు వెంకటేశం ”యిప్పుడు నేను మీకో ప్రపోజల్‌ చెబుతా. ఓ రకంగా అది మీ యిద్దరికీ సేఫ్‌గేమ్‌లాంటిది. ఎలక్షన్‌ కోసం ఎంత ఖర్చుపెట్టేదీ మీ యిద్దరి మధ్యా పోటీపెడదాం. అందులో ఎవరెక్కువ ఖర్చుపెడతారో వాళ్ళే ఎలక్షన్లో నిలబడాలి. రెండో వాళ్ళు విత్‌ డ్రా అయిపోవాలి. అలాగే ఆ డబ్బంతా నా ద్వారా ఖర్చుపెట్టాలి. యిక విత్‌ డ్రా అయిపోనోళ్ళు కూడా బాధపడనవసరంలేదు. రేపు ఎలక్షన్లో గెలిచిన ఆ రెండోవాళ్ళు గవర్నమెంట్‌పరంగా  వీళ్ళకి కావలసిన పనులు ఏ పనయినా చేసి పెట్టాలి. అంటే విత్‌ డ్రా అయిపోయినోళ్ళు పవర్‌ లేక పోయినా కొంతమేరకి తమ పనులు జరిపించుకోవచ్చు” అన్నాడు. దానికి యిద్దరూ ఒప్పేసుకున్నారు. అప్పటికప్పుడే ఆ పాటేదో మొదలయింది. పెద్దారావు తన పాటని అయిదుకోట్లతో మొదలెట్టాడు. చిన్నారావు ఆరంటే, పెద్దారావు ఏడున్నరన్నాడు. అలా..అలా.. చిన్నారావు తొమ్మిదిన్నరకి వెళ్ళాడు. దాంతో పెద్దారావు పదికోట్లన్నాడు. దాంతో చిన్నారావు ‘అంతయితే నావల్ల కాదు’ అంటూ తప్పుకున్నాడు. యిక ఆ తర్వాత పరిణామాలు చకచకా జరిగిపోయాయి. చిన్నారావయితే తన నామినేషన్‌ విత్‌డ్రా చేసేసు కున్నాడు. పెద్దారావు ఆ పదికోట్లూ తెచ్చి వెంకటేశం హయాంలో పెట్టాడు. యిక వెంకటేశం ఆరోజే ఆ పదికోట్లూ పెట్టి ఊరిలో పనులు మొదలుపెట్టించాడు. ముందుగా ఊరంతా బ్రహ్మాండమయిన రోడ్లొచ్చే శాయి. మంచినీటి సౌకర్యాలు వచ్చేశాయి. గుడి బాగుపడింది. స్కూల్సూ, లైబ్రరీ, కమ్యూనిటీ హాలు లాంటివి వచ్చేశాయి. యిక మిగిలిన డబ్బంతా ఊరి సంక్షేమ నిధి ఎకౌంట్లో వేసేశాడు. దాంతో ఊరంతా సంబ రాలే. అంతా యింకో ఆలోచన లేకుండా పెద్దారావుకి ఓట్లు  గుద్దేశారు. దాంతో రికార్డుస్థాయి ఓట్లతో పెద్దారావు గెలిచేశాడు. యింకేముంది. అటు ఊరు బాగుపడింది. యిటు పెద్దారావుకి ‘పవర్‌’ వొచ్చేసింది. యిక చిన్నారావుకి అవసరం ఖర్చు తప్పింది. పైగా ఎమ్మెల్యే ద్వారా ఏ పనులయినా అయిపోతున్నాయి. వెరసి… అంతా విజేతలే.
——-
”గురూగారూ… అలాంటి కలొచ్చింది. అబ్బబ్బ.. ఏం కలనీ” అన్నాడు వెంకటేశం ఆనందంగా. దాంతో గిరీశం ”యిలా జరిగితే బాగుం డునూ అన్న ఆలోచన నీ కలకి కారణం” అన్నాడు. యింతలో వెంకటేశం ”యింతకీ ఈ కలకి అర్థమేంటంటారు?” అన్నాడు. దానికి గిరీశం ”ఏం లేదోయ్‌.. రోజూ వార్తలు చూస్తున్నాం కదా. పార్టీలు పోటీపడి మరీ ఓటరుకి యిస్తున్నాయి. ఒకప్పుడు అదేదో అయి దొందలో, వెయ్యో ఉండేది. యిప్పుడది నంద్యాల, మంగళగిరి లాంటి చోట్ల పది వేలని తెలుస్తోంది. అలా ఓటర్లకి పంచడానికి తరలించేదే కోట్లాదిగా పట్టుబడుతోంది. ఓటర్లు కూడా వాళ్ళిస్తున్నారు కదా అని తీసేసుకుంటున్నారు. అయితే ఓటరు గ్రహించాల్సింది ఒకటుంది. యిలా తమకి కోట్లాదిగా యిచ్చే తాయిలాలేవో తమ మీద ప్రేమతో కాదు. రేపు పవరొచ్చాక అంతకు పదిరెట్లు తమ రక్తాన్ని పీల్చుకుని వెనక్కి లాక్కోవడానికే. అంటే ఓటరు తమ ఓటుని ఎంతకి అమ్ముకుంటే అంతకు పదిరెట్లు తమ భవిష్యత్తుని తాకట్టుపెట్టుకున్నట్టే” అంటూ తేల్చాడు.
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here