ప్రజాస్వామ్యం పడుకుంది

0
431

మనస్సాక్షి – 1085

వెంకటేశం సీటువాడయిపోయాడు..! అంటే మరేంలేదు. ఆ సీటేదో ఎలక్షన్లో సీటో, యింకో చదువులో సీటో అను కుంటే పొరబాటే. అదేదో అచ్చంగా ఓ పెద్ద జ్యూయలరీ షాపులో సూపర్‌వైజర్‌ పోస్ట్‌. రాజకీయాల్లో కెళ్ళి దున్నెయ్య వలసినవాడు యిలా ఉద్యోగంలో దూరడం ఆశ్చర్యమే. అయితే దానికో కారణ ముంది. ఎంతకాలమయినా రాజకీ యాల్లో దూరే సరయిన దారి లేకపోవ డంతో ఉన్న పళంగా ఏదో ఉద్యోగం చూడమని గిరీశం దగ్గర వాలిపోయాడు. దాంతో గిరీశం తనకి తెలిసిన వాళ్ళం దరికీ ఫోన్లు చేసి రికమెండేషన్‌లు చేసే పనిలో పడ్డాడు. అప్పుడొచ్చిందీ అవకాశం. అదేదో దేశవ్యాప్తంగా బ్రాంచీలున్న జ్యూయలరీ షాపు. వాళ్ళేదో సూపర్‌వైజర్‌ కింద పనిచేయడానికి నమ్మకస్తుడూ, తెలివయిన వాడూ అయిన వ్యక్తి కోసం చూస్తున్నారు. సరిగ్గా అలాంటి సమ యంలో గిరీశం వెంకటేశాన్ని రికమెండ్‌ చేశాడు. యింకేముంది.. వెంకటేశం కాస్తా ఆ జ్యూయలరీ షాప్‌ సూపర్‌వైజరయిపోయాడు. అక్కడికీ ఉద్యోగం యిచ్చే ముందు షాపు యజమాని గిరీశంతో ”కుర్రాడు ఓకే కదా..” అన్నాడు. దాంతో గిరీశం ”అబ్బేబ్బే.. కుర్రోడ్ని చూసుకో అక్కర్లేదు. అసలు వీడు మామూలోడు కాదు. మీరే చూస్తారు కదా వాడి సంగతి” అన్నాడు. నిజంగానే వెంకటేశం మామూలోడు కాదన్న సంగతి సదరు షాపు యజమానికి దగ్గర్లోనే తెలిసింది. మొత్తానికి యిదేదో తన చదువుకి తగిన ఉద్యోగం కాకపోయినా వెంకటేశం ఆ జ్యూయలరీ షాపులో చేరిపోయాడు. అక్కడ చేసే ఉద్యోగం మరేం కాదు. కింద అంతస్థులో కోట్ల ఖరీదయిన బంగారం, వెండి నగలుంటాయి. మొత్తం షోరూమంతా సిసి కెమెరాలుంటాయి. వెంకటేశం పై అంతస్తులో కూర్చుని టీవీలో విజువల్స్‌ చూస్తూ ంతా పర్యవేక్షిస్తుంటాడు. ఈ ఉద్యోగం ముచ్చ టేదో ఓ నాలుగునెలలపాటు బాగా నడిచింది. అప్పుడు జరిగిం దది. ఆరోజు కూడా ఎప్పటిలాగే రాత్రి పదయ్యేసరికి వ్యాపారం ఆపి షాపు కట్టేసే పనిలో పడ్డారు. షాపు ముందు సెక్యూరిటీ గార్డ్‌ అవతారం మాత్రం ఉన్నాడు. యిక పై ఫ్లోర్‌లో వెంకటేశం ఉన్నాడు. అక్కడ టీవీలో సీసీ కెమెరాల ద్వారా రికార్డవుతున్న దృశ్యాలు చూస్తున్నారు. యింతలో ఓ ముసుగు శాల్తీ షాపు బయట అటూ యిటూ తచ్చాడటం కనిపించింది. యింతలోనే ఆ శాల్తీ కాస్తా బుడుంగున షాపులోకి దూరింది. యిదంతా టీవీలో వెంకటేశం చూస్తూనే ఉన్నాడు. మరి.. ఈ అవతారం ఏం చేస్తున్నట్టూ అనుకున్నాడు. అయితే అవతారం ఏం ఊరుకోలేదు. ఆ ముసుగుదొంగ వెనకే తనూ షాపులోనికి నడిచాడు. ఆ దొంగ ఏం చేస్తున్నాడా అని పరిశీలనగా చూస్తూ అనుసరించాడు. ఆ దొంగయితే గబగబా లోపలికి నడిచి అక్కడ అద్దాల్లో సర్ధి ఉంచిన బంగారం నగలూ, వెండి సామానులూ బయటికి లాగి తన బ్యాగ్‌లో వేసేసుకున్నాడు. దాంతో అవతారం ”బాబూ.. ఏం చేస్తు న్నావ్‌.. దొంగతనం చేయడానికొచ్చావా.. దొంగతనం చేయడం తప్పు తెలుసా?” అన్నాడు. అయితే ఆ దొంగ అదేం పట్టించు కున్నట్టు లేదు. అయితే అవతారం ఊరుకుంటాడా.. గబగబా బయటికి పరిగెత్తాడు. అక్కడున్న తన సంచిలోంచి ఓ పుస్తకం తెచ్చి ఆ దొంగ చేతిలో పెట్టాడు. ఆ దొంగ తన బ్యాగ్‌లోకి నగలు నింపుకుంటూనే అవతారం వంక ఏంటన్నట్టుగా చూశాడు. దాంతో అవతారం కళ్ళింత చేసేసుకుని ”దొంగతనం చేయడం ఎంత తప్పనేది ఈ పుస్తకంలో రాసుంది” అన్నాడు. దాంతో దొంగ కోపంగా ”నాకు చదువూ గిదువూ రాదులే” అన్నాడు. అలా అనేసి అక్కడ్నుంచి లోపల లాకర్‌ రూంలోకి దూరాడు. గబగబా అక్కడున్న లాకర్లు తెరిచి అందులో ఉన్న డబ్బూ, నగలూ కూడా తన బ్యాగ్‌లో వేసుకున్నాడు. అవతారం యింకాగలేకపోయాడు. అమాంతంగా ఆ దొంగ కాళ్ళమీద పడిపోయాడు. ”బాబ్బాబూ.. యిలా దొంగతనం చేయొద్దు. అలా చేయడం తప్పు” అన్నాడు బతిమలాడుతున్నట్టుగా. అయితే ఆ దొంగ ఏ మాత్రం పట్టించుకోకుండా తన పని చకచకా చేసుకుపోతున్నాడు. మొత్తంగా తన కూడా తెచ్చిన అరడజను బ్యాగ్‌లలోనూ డబ్బూ, నగలూ నింపేసుకుని అప్పుడు దర్జాగా బయటికి నడిచాడు. యిదంతా పై ఫ్లోర్‌లో ఉన్న గదిలో టీవీలో వెంకటేశం చూస్తూనే ఉన్నాడు. ఆ దొంగ అలా బయటికి వెడుతుంటే అవతారం కూడా అనుసరించాడు. యింతలోనే ఆ దొంగ కాస్తా కారెక్కడం, ఆ తర్వాత అవతారం వైపు తిరిగి ”బై..బై..బై..” అంటూ చెయ్యి ఊపడం జరిగి పోయాయి. అయితే అవతారం కూడా ఏం ఊరు కోలేదు. తనూ చెయ్యి ఊపేశాడు. యిదంతా చూస్తున్న వెంకటేశం ‘పోన్లే.. అవతారం పద్ధతులవీ తెలిసినవాడే’ అనుకున్నాడు. యిదంతా అయింతర్వాత వెంకటేశం తీరిగ్గా కిందకి దిగొచ్చేశాడు. తర్వాత తిన్నగా వీధి చివర్నున్న పోలీస్‌స్టేషన్‌కి వెళ్ళాడు. అక్కడున్న రైటర్‌తో ”సార్‌.. మా జ్యూయలరీ షాపులో దొంగ తనం జరిగింది. ఆ దొంగని పట్టుకోవాలి”అన్నాడు. ఆ రైటర్‌ ఆ వివరా లేవో రాసుకుని ”ఎస్సై గారు వచ్చాక ఎఫ్‌ఐఆర్‌ రాస్తాను” అన్నాడు. వెంకటేశం తలూపి బయటకొచ్చాడు. అంతేనా.. తెల్లారేసరికి అదే పోలీస్‌స్టేషన్‌ ముందు ఓ టెంట్‌ వెలిసింది. దాంట్లో వెంకటేశం నిరాహార దీక్షకి కూర్చు న్నాడు. అంతేకాదు. ‘మా జ్యూయలరీ షాపులో దొంగతనం జరిగింది. పోలీసులు ఆ దొంగని పట్టుకోవడంలో అలసత్వం పాటిస్తున్నారు. అందుకే ఆ దొంగని పట్టుకునే వరకూ నేను దీక్ష చేస్తున్నా అని ఓ స్టేట్‌మెంటు కూడా యిచ్చాడు.

——

”అది గురూగారూ.. నాకొచ్చిన కల. అయినా మరీ యింత దారుణ మయిన కలేంటీ? కలలో ఆ అవతారం ఎవడో గానీ వాడింకా పరమ వెర్రి బాగులవాడిలో ఉన్నాడు. వాడి సంగతి సరే.. నేనూ మరీ అలా ప్రవర్తించానేంటి?” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం ఓ చుట్ట అంటించుకుని ”ఆ..యిదేదో మరీ అంత నోరెళ్ళ బెట్టేంత వింత కలేం కాదోయ్‌..అచ్చంగా జరిగిన వ్యవహారమే” అన్నాడు. దాంతో వెంక టేశం అదిరిపోయి నిజమా అన్నట్టుగా చూశాడు. గిరీశం తలూపి, వివ రంగా చెప్పడం మొదలుపెట్టాడు. ”మొన్నటికి మొన్న ఆ మోడీ గారు చేసింది యిలాగే ఉంది కదా. మొన్న 14 రోజులపాటు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టకుండా చేసింది అధికార పక్షం కనుసన్నల్లో నడిచే స్పీకర్‌. ఆ విషయంలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి కూడా. అయితే జరిగిందంతా మోడీగారి సూచనల మేరకే కదా. సరే.. అయిందేదో అయింది. ఆ తర్వాత మోడీగారు ‘పార్లమెంటు సజావుగా జరక్కుండా విపక్షాలు అడ్డుకున్నందుకు నిరసనగా దీక్ష చేస్తున్నా’ అని ప్రకటించి ఆ దీక్షేదో చేయడం జరిగింది. యిదెంతవరకూ సబబుని? అదే నీ కలలో వచ్చిన వ్యవహారంలే. అయితే పరిస్థితుల్ని కొంచెం వాస్తవంగా విశ్లేషిస్తే.. వాస్తవానికి కేంద్రం మన రాష్ట్రానికి ఇచ్చింది కొద్దిగా నిధులే. అయితే ఆ యిచ్చే కొద్దిపాటి నిధుల్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు ప్రాజెక్ట్‌లకి తరలిస్తుందనీ, ఆ క్రెడిట్టేదో తామే తీసేసుకుంటున్నారనీ కేంద్రం బలమయిన నమ్మకం. దాంతో కేంద్రానికి మన రాష్ట్రానికేదో చేయాలన్న ఆసక్తిపోయిందన్నది వాస్తవం. అయితే యిదంత మంచి పరిణామం కాదు. నిధుల విషయంలో దుర్వినియోగం జరిగితే కాగ్‌ ఉండనే ఉంది కదా అని ఆలోచించి తాము మన రాష్ట్రానికి యివ్వాలనుకున్నది యిచ్చుకుంటూ పోతే బాగుంటుంది. అది రాష్ట్ర సంక్షేమానికీ ఎంతో మంచిది. యింకా ఆ పార్టీ భవిష్యత్తుకీ రెడ్‌ కార్పెట్‌ అవుతుంది” అంటూ వివరించాడు.

డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here