ప్రజా నాయకికి నివాళి

0
472
(జీకె వార్తా వ్యాఖ్య)
రాజకీయ రంగంలో ఆమె ఓ సంచలనం…. జీవన గమనంలో ఎన్నో కుట్రలు, కుతంత్రాలతో పాటు శత్రువులను ఎదుర్కున్నా పోరాడి గెలిచిన ధీర వనిత….మళ్ళీ మళ్ళీ పడినా మళ్ళీ మళ్ళీ లేచిన కడలి ఉత్తుంగ కెరటం….ఆమె నిత్య చైతన్య స్రవంతి. పసిప్రాయంలోనే చలన చిత్ర రంగంలోకి అడుగు పెట్టి అన్ని భాషల్లో…అందరి అగ్రనటుల సరసన….విభిన్న పాత్రలు ధరించి ఆ రోజుల్లో గ్లామర్‌ క్వీన్‌గా నాటి యువతరం గుండెల్లో గుబులు రేపిన అందాల భామ. ఎం.జి.ఆర్‌. ప్రాపకంతో రాజకీయాల్లోకి ప్రవేశించి పురుషాధిక్య సమాజంలో అచిరకాలంలోనే ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగిన రాజకీయ ధ్రువ తార.  శత్రువు చిన్న వాడైనా…..పెద్ద వాడైనా ఉపేక్షించకూడదన్న యుద్ధ నీతితో రాజకీయ వ్యూహాల్లో ఆరితేరి సంచలన రాజకీయాలకు కేంద్ర బిందువైన తమిళనాట ప్రజల తిరుగులేని మద్ధతుతో ఆరు పర్యాయాలు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి ఎంజీఆర్‌ తర్వాత వరుసగా రెండో సారి సీఎం పగ్గాలు చేపట్టిన నేతగా చరిత్ర సృష్టించిన స్ఫూర్తిదాయక వనిత. ప్రజల నాడి…వాడి  తెలిసిన మహా నాయకిగా, మకుటం లేని మహరాణిగా తమిళ నాట జనరంజకమైన పాలన అందించి అమ్మగా ప్రజల గుండెల్లో కొలువైన నాయకురాలు. మూడున్నర దశాబ్ధాల పాటు తమిళనాటనే గాక దేశ రాజకీయాల్లో చక్రం తిప్పి మకుటం లేని మహారాణిలా ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విలక్షణ రాజకీయ నాయకురాలు. ప్రజామోదమైన విభిన్న సంక్షేమ ఫలాలను అందించిన తమిళనాడును సంక్షేమ జయోదయం చేశారు.  తమిళ ప్రజల అమ్మగా, ఆరాధ్య దైవంగా వెలుగొందారు. తమిళ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేసి ఇతర రాష్ట్రాల నాయకులకు ఆదర్శంగా నిలిచారు. రాజకీయంగా ప్రత్యర్ధులతో పోరాడి గెలుపు సాధించినా మృత్యువుతో మాత్రం 75 రోజుల పాటు పోరాడి అలిసిపోయి దివంగతాలకేగారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి మృత్యువుతో పోరాడుతున్నప్పుడు ఆమె కోలుకోవాలని ఆంక్షల్ని, ప్రతిబంధకాల్ని లెక్కచేయకుండా ఆసుపత్రి వెలుపల, ఎక్కడికక్కడ ఎందరో ప్రార్ధనలు చేశారంటే ఆమెకున్న పాపులారిటీ ఏమిటో తెలుస్తోంది. బహుశ వర్తమానంలో ఎవరికి అంత పాపులారిటీ లేదేమో. తమిళనాటకే కాదు మన తెలుగువారికీ ఆమె ఆడపడుచే. వివిధ భాషలతో పాటు తెలుగు చలన చిత్రాల్లో ఎన్‌టిఆర్‌, ఏఎన్‌ఆర్‌, శోభన్‌బాబు వంటి ఎందరో అగ్రనటుల సరసన సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించిన ఆమె స్వస్థలం మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాయే. ఆమె ఇక లేరన్న నిజం బాధాకరమే అయినా కాలధర్మానికి ఎవరూ అతీతులు కాదని సరిపెట్టుకోవాలి. కొందరు మరణిస్తే మరచిపోతాం….మరణించినా మరపురాని వారుంటారు….వారు మరణించినా జన హృదయాల్లో  జీవించే ఉంటారు……వారిలో జయలలిత ఒకరు…..ఆ పురచితలైవీకి అక్షర నీరాజనం అర్పిస్తూ…..