ప్రజా ప్రయోజనాల కోసం నిలదీసే దమ్ము, ధైర్యం బాబుకే ఉంది

0
231
జగన్‌ నోటి మాటలు ఆయన అహంకారానికి పరాకాష్ట : గుడా చైర్మన్‌ గన్ని
రాజమహేంద్రవరం, జూన్‌ 19 : ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ప్రయోజనాల కోసం ప్రధానమంత్రి నరేంద్రమోడీని నిలదీసిన దమ్ము, ధైర్యం కేవలం సీఎం చంద్రబాబునాయుడికి మాత్రమే ఉందని, నిన్న జరిగిన నీతి అయోగ్‌ సమావేశంలో 20 నిమిషాలపాటు రాష్ట్ర ప్రయోజనాల కోసం, విభజన చట్టంలో హామీల కోసం మాట్లాడి కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన ఘనత చంద్రబాబుదని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ అన్నారు. గుడా జోనల్‌ కార్యాలయంలో తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ నీతి అయోగ్‌ సమావేశంలో చంద్రబాబు చేతులు కట్టుకున్నారని, కేంద్ర నాయకులకు వంగి వంగి నమస్కారాలు చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌తోపాటు, ఇతర పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రం వివక్ష చూపిస్తోందని చంద్రబాబు ఎండగట్టారని, ఈ విషయాన్ని జాతీయ ఛానళ్ళు, పత్రికలు కూడా ప్రసారం చేశాయన్నారు. అలాంటి ప్రసంగాలు ఈ నాయకులకు ఎందుకు కనపడటంలేదని ప్రశ్నించారు. ద్వేషంతో కూడిన మాటలు మానుకోవాలని, ధైర్యం, దమ్ము ఉంటే మోడీని నిలదీయాలని సవాల్‌ విసిరారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై చంద్రబాబు చేస్తున్న పోరాటానికి దేశవ్యాప్తంగా స్పందన వచ్చిందని, బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ స్పందించి తన సంఘీభావాన్ని కూడా తెలిపారన్నారు. తమ అధినేత ఉద్యమానికి బిజెపిపై వ్యతిరేక వాదనలు ప్రారంభమయ్యాయని, అటువంటి సమర్ధత కలిగిన నాయకుడు చంద్రబాబు అని అన్నారు. ఇటీవల పాదయాత్ర నిమిత్తం రాజమహేంద్రవరం వచ్చిన జగన్‌ సభకు జనాన్ని ఏ విధంగా తరలించారో అందరికీ తెలుసన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ తెలుగు ప్రజల జీవనాడి అని, కేంద్ర సహకారం లేకపోయినా పట్టు వదలని విక్రమార్కుడిలా చంద్రబాబు అలుపెరగని కృషిచేస్తూ త్వరితగతిన నిర్మాణం పూర్తిచేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. మరోవైపు అమరావతి నిర్మాణంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నాలు చేస్తుంటే వై.ఎస్‌.జగన్మోహనరెడ్డి  తన ప్రసంగంలో అమరావతి, పోలవరం సినిమాలు అని వ్యాఖ్యానించడం తన భావ దారిద్య్రానికి, రాజకీయ దిగజారుడికి నిదర్శనమన్నారు. జగన్‌ సభలో కొందరు అల్లరి మూకలు కోటిపల్లి బస్టాండ్‌ వద్ద తెలుగుజాతి ఆరాధ్య దైవమైన ఎన్టీఆర్‌ విగ్రహంపై వికృత చేష్టలు చేశారని, దానికి నిరసనగానే ఆ ప్రాంతాన్ని పసుపు నీళ్ళతో శుద్ధి చేసి ఆయన విగ్రహానికి క్షీరాభిషేకం చేశామన్నారు. తాము చేపట్టిన కార్యక్రమానికి కొంతమంది వైకాపా నేతలు స్పందించి సంస్కృతి సాంప్రదాయాలు మంటగలిపామని, జగన్‌ సభకు వచ్చిన జనాన్ని చూసి ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారని చెప్పడం సిగ్గు చేటన్నారు. వైకాపా నేత జగన్‌కు గానీ, వారి పార్టీ నాయకులకు గానీ సంస్కృతి సంప్రదాయాలు పరిరక్షించే ఆలోచన ఉంటే తండ్రి వయసున్న సీఎం చంద్రబాబుని ఉరితీయాలని, నడిరోడ్డుపై కాల్చేయాలని వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నీతులు చెప్పే ముందు నోరు కాపాడుకుంటే మంచిదని హెచ్చరించారు. సోషల్‌ మీడియాను పెయిడ్‌ మీడియాగా మార్చి దుష్ప్రచారం చేస్తున్న జగన్మోహనరెడ్డి తీరుతెన్నులను ప్రజలు గమనిస్తున్నారన్నారు. చివరికి తనపై కూడా సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలతో కామెంట్లు చేయించారని, దానిపై సైబర్‌ నేరం క్రింద కేసు నమోదు చేయించి చర్యలు తీసుకుంటామన్నారు.  రాజమహేంద్రవరంలో పార్టీని మరింత పటిష్టపరుస్తామని, సిటీలో ఎవరిది పైచేయో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ఎన్నికల హామీల్లో ఇప్పటికే 97 శాతం నెరవేర్చామని, చేసిన పనులు, అభివృద్ధితోనే ప్రజల్లోకి వెళతామన్నారు. పార్టీల్లో ఉండే చిన్న చిన్న ఇబ్బందులను తొలగించి అందరినీ ఏకత్రాటిపైకి తెస్తామని, రానున్న ఎన్నికల్లో చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యమన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here