ప్రణాళిక,సమిష్టి కృషితోనే ఈ ఫలితాలు

0
138
జిల్లా విద్యాశాఖాధికారి అబ్రహం
కాకినాడ, మే 14 : పదవ తరగతి 2019 పబ్లిక్‌ పరీక్షా ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించిందని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌.అబ్రహం వెల్లడించారు. పరీక్షా ఫలితాలు వెల్లడించిన వెంటనే ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా జిల్లా పది ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలుస్తోందని వెల్లడించారు. 2018-19 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షలకు 68,428మంది విద్యార్థినీ, విద్యార్థులు హాజరుకాగా 67,189మంది ఉత్తీర్ణులయ్యారని 98.19శాతం సాధించి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. గత సంవత్సరం సాంకేతిక కారణాల వలన రెండవ స్థానం నమోదైనా నేడు ప్రథమ స్థానం సాధించడం జరిగిందని వెల్లడించారు. బాలురు 33,904మంది పరీక్షకు హాజరుకాగా 32,294మంది ఉత్తీర్ణులయ్యారని, అలాగే బాలికలు 34,420మంది పరీక్షకు హాజరుకాగా 33,794మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. బాలురు ఉత్తీర్ణతా శాతం 98.20, బాలికల ఉత్తీర్ణతా శాతం 98.18 నమోదయ్యిందన్నారు. 10/10 5,456మంది సాధించారని వెల్లడించారు. 2016-17 సంవత్సరంలో 2,826మంది, 2017-18 సంవత్సరంలో 5,086మంది 10/10సాధించి గత మూడు సంవత్సరాలుగా జిల్లా ప్రథమ స్థానంలో నిలుస్తోందని తెలిపారు. పాఠ్య ప్రణాళికలను క్రమశిక్షణతో పాటించడం వలననే ఈ విజయం సమకూరిందన్నారు. విజయం సాధించడంలో కృషి చేసిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి సంవత్సరం నవంబర్‌ 30 నుండి ప్రతి విద్యార్థికి ప్రత్యేక క్లాసు టెస్టులు నిర్వహిస్తున్నామని, అది కాక జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ప్రతి మంగళవారం విద్యాశాఖపై రివ్యూ చేసి తగు సూచనలు ఇస్తున్నారని, తద్వారా ఉపాధ్యాయ వర్గం క్రమశిక్షణతో విద్యార్థులను తీర్చిదిద్ది విజయం సాధించారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ విద్యా సంవత్సరంలో జూలై 1 నుండి పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని జిల్లా ప్రథమ స్థానాన్ని నిలుపుకునేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌.అబ్రహంను కార్యాలయ సిబ్బంది, పలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here