ప్రతి పైసా కేంద్రమే ఇస్తుంది

0
236
పోలవరం నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉంది
సోము వల్లే ముంపు మండలాలు విలీనం – కన్నా లక్ష్మీనారాయణ
రాజమహేంద్రవరం, జూన్‌ 24 : పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెట్టే ప్రతీ రూపాయి కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళుతూ ఈరోజు స్ధానిక షల్టన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 100శాతం నిధులను కేంద్రమే భరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసే ప్రతి రూపాయిని కేంద్రం రీఎంబార్స్‌మెంట్‌ చేస్తుందన్నారు. కేంద్రంలో బీజేపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలోని వివిధ నీటి ప్రాజెక్టులకు కేంద్రం రూ.7వేల కోట్లు ఖర్చుచేసిందన్నారు. 90-10 పద్దతిలో ఈ ప్రాజెక్టులు నడుస్తున్నాయన్నారు. దేశచరిత్రలో రూ.16వేల కోట్లతో పోలవరం ప్రాజెక్టును  జాతీయ ప్రాజెక్టుగా నిర్మిస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసే బాధ్యతను కేంద్రం తీసుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన సొమ్మును బకాయిలు లేకుండా చెల్లించడం జరుగుతుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరుగుదలపై సాంకేతిక కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు. ముంపు మండలాలను సోము వీర్రాజు కృషి కారణంగానే విలీనం చేయడం జరిగిందన్నారు.  చంద్రబాబు నిజం మాట్లాడటం తెలీదు.. మాకు అబద్దం చెప్పడం తెలీదు! అని అన్నారు. ప్రాజెక్టులకు కేంద్రప్రభుత్వం ఖర్చుచేసినా, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసినా అది ప్రజా ధనమే అన్నారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనతో పాటుగా నిర్వాసితుల సమస్యలను కూడా తెలుసుకుంటామన్నారు. రాష్ట్రంలో టిడిపి, వైసిపీలు కలిసే ప్రభుత్వం నడిపిస్తున్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాము రాజకీయాలు చేయడానికి రాలేదని, ప్రాజెక్టు నిర్మాణ పరిస్థితులను చూడటానికే ఇక్కడకు వచ్చామన్నారు.
పోలవరం ఎపికి ‘మోడీ’ వరం : పురందేశ్వరి
పోలవరం ప్రజాక్టు అనేది ఎపికి మోడీ వరమని బిజెపి మహిళామోర్చా జాతీయ ఇన్‌ఛార్జి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అన్ని విధాల సహకారం అందిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రజాక్టుకు పెడుతున్న ఖర్చులో ప్రతి రూపాయిని కేంద్రం చెల్లిస్తుందన్నారు. ఇప్పటి వరకు ఖర్చుచేసిన ప్రతీ పైసాను బకాయి లేకుండా కేంద్రం చెల్లించడం జరిగిందన్నారు. పోలవరం ఆంధ్రులకు దీర్ఘకాలిక స్వప్నమని, ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి, జీవధార అని,  బిజెపి ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అంకితభావంతో ఉండటం వల్లే ముంపుమండలాలను విలీనం చేయడం జరిగిందన్నారు.  సకాలంలో పోలవరం పూర్తి చేయాలి, కృష్ణా డెల్టా స్థిరీకరించుకోవడానికి అనుమతులు, ఇతర అంశాలపై సకాలంలో స్పందిస్తూ అడ్డంకులన్నింటిని పరిష్కరిస్తుందన్నారు. ప్రాజెక్టు నిర్మించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నందున, కేంద్ర ప్రభుత్వం వెనువెంటనే బిల్లులను చెల్లించడం జరుగుతుందన్నారు. రాష్ట్రం ఎంత ఖర్చుచేసింది? కేంద్రం ఎంతవరకు బిల్లులు చెల్లించిందన్న విషయాలను సమాచార హక్కు చట్టం ద్వారా కూడా తెలుసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు కేంద్రం ఒక్కరూపాయి కూడా బకాయి లేకుండా బిల్లులు చెల్లించడం జరిగిందన్నారు. విలేకరుల సమావేశంలో బీజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యులు జి.వి.ఎల్‌.నరసింహారావు, సిటీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్‌, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు, ఎం.పి. గోకరాజు గంగరాజు, మాజీ డిజిపి దినేష్‌రెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here