ప్రధాని ఏం సమాధానం చెబుతారు ?

0
471
జీకె వార్తా వ్యాఖ్య
మన దేశంలో సీబీఐయే అత్యున్నత దర్యాప్తు సంస్థ… న్యాయ వ్యవస్థ తర్వాత దర్యాప్తు సంస్థల్లో కొద్దొ గొప్పొ విశ్వసనీయత ఉన్న వాటిలో  సీబిఐ అగ్ర స్థానంలో నిలుస్తుంది. అందుకే పాలకపక్షాలపై ఏమైనా  ఆరోపణలు వస్తే సీబిఐ దర్యాప్తు జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేయడం రివాజుగా వస్తోంది. సీబిఐ వ్యవహారాల్లో కేంద్ర పాలకులు జోక్యం చేసుకోబోరనో, సీబిఐ దర్యాప్తు అంటే నిక్కచ్ఛిగా, నిర్భీతిగా, నిర్మోహమాటంగా జరుగుతుందనే నమ్మకమే ఇందుకు కారణం. అయితే ప్రస్తుత కేంద్ర పాలకుల హయాంలో తాజాగా ఈ వ్యవస్థపై కూడా విశ్వాసం సన్నగిల్లే పరిణామాలు చోటు చేసుకోవడం దురదృష్టకరం. సీబిఐతో పాటు దేశ రక్షణకు సంబంధించి అత్యున్నత కీలక విభాగం ‘రా’ పై కూడా అవినీతి ఆరోపణలు వినిపిస్తుంటం ఆందోళన కలిగించే పరిణామం. ముఖ్యంగా సీబీఐలో పుట్టిన ముసలంతో దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ ప్రతిష్ట మసకబారే పరిస్థితులు ఏర్పడ్డాయి. అవినీతి ఆరోపణలపై విచారణ జరిపే దర్యాప్తు సంస్థపైనే అవినీతి ఆరోపణలు వస్తే ప్రజలకు ఆ వ్యవస్థపై ఉన్న విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఏర్పడుతుంది. సీబిఐ డైరక్టర్‌ అలోక్‌ వర్మ, ప్రత్యేక డైరక్టర్‌ ఆస్థానాల మధ్య ఆధిపత్య పోరు సాగుతుండటం సంస్థ ప్రతిష్టను మసకబర్చడమే గాక ప్రజల్లో నవ్వులపాలయ్యే పరిస్థితి ఏర్పడింది. చివరికి ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీశాయంటే  సీబీఐకి చెందిన ఓ డిఎస్పీ అవినీతి వ్యవహారంలో అరెస్టు కావడం ఈ సంస్థ దిగజారుడుతనానికి పరాకాష్ట. కాగా ఆస్థానాను ప్రధాని మోడీ ఏరి కోరి ప్రత్యేక డైరక్టర్‌ పదవిలో నియమించారు. తెదేపా ఎంపి సీఎం రమేష్‌తో హైదరాబాద్‌ వ్యాపారి కేసును చర్చించినట్లు తప్పుడు వాంగ్మూలం సృష్టించి రమేష్‌ను  ఈ కేసులో ఇరికించడానికి ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించడం వీరి దిగజారుడుతనానికి పరాకాష్ట మాత్రమే కాదు అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ పరువు ప్రతిష్టలను గంగలో కలిపేయడమే.  కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా  ప్రత్యర్ధులపై రాజకీయ కక్ష సాధించడానికి సీబిఐను ఆయుధంగా వినియోగించుకోవడం పరిపాటిగా మారింది. నీతులు వల్లించి, ప్రత్యర్ధులపై వ్యంగోక్తులతో కూడిన విమర్శనాస్త్రాలను సంధించడంలో దిట్టగా పేరొందిన ప్రధాని మోడీ కూడా గతంలో  సీబిఐను కాంగ్రెస్‌ పాలకులు దుర్వినియోగం చేస్తున్నారని దుమ్మెత్తి పోయగా ఇపుడు ఆయన ఏలుబడిలోనే సీబీఐ అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి కావడమే గాక నవ్వులపాలవుతూ ప్రత్యర్ధులపై కక్ష సాధింపునకు ఓ ఆయుధంగా మారింది.  రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు, అమిత్‌ షా కుమారుడు డైరక్టర్‌గా ఉన్న కంపెనీల లావాదేవీల వ్యవహారాల్లో అవకతవకలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నా కేంద్రానికి చీమ కుట్టినట్లయినా లేదు. పైగా త్వం శుంఠ అంటే త్వం శుంఠ అని వాదులాటలతో కాలక్షేపం చేస్తున్నారు. ‘అందరూ శ్రీ వైష్ణవులే రొయ్యల బుట్టలో రొయ్యలు మాత్రం మాయమైనట్టుగా’ సాగుతున్న వ్యవహారాల్లో పటిష్ట దర్యాప్తుతో అవినీతిపరుల ఆటకట్టించవలసిన ప్రతిష్టాత్మక సంస్థ ఆధిపత్య పోరుతో సతమతం కావడమే గాక అవినీతి మకిలిని అంటించుకుని మరింత దిగజారింది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే  వారి పంజరంలో చిలుకలా సీబిఐ మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నా, కోర్టు మొట్టికాయలు వేసినా తీరు మారడం లేదు. సీబిఐలో ప్రస్తుత పరిణామాలకు ప్రధానమంత్రి  ఏ సమాధానం చెబుతారు?  ప్రధాని సమాధానం కోసం 130 కోట్ల మంది భారతీయులు ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here