ప్రభుత్వానికి-నిరుద్యోగులకు వారధిగా పనిచేస్తా..

0
204
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బోడపాటి
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 12 : ప్రభుత్వానికి-నిరుద్యోగులకు మధ్య వారధిగా వ్యవహరించి వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బోడపాటి నాగేశ్వరరావు వెల్లడించారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సేవ చేసే వారికి నిరుద్యోగులు మద్ధతుగా నిలవాలని కోరారు. ఒక నాయకుడిగా కాకుండా సేవకుడిగా పనిచేసేందుకే తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్నానని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు స్టడీ సర్కిల్‌ ఏర్పాటు, ప్రతిభ కలిగిన అగ్రవర్ణ పేద నిరుద్యోగులకు స్టడీ సర్కిల్‌ స్థాపనకు చట్టసభలో ప్రతిపాదిస్తానన్నారు. బిసి స్టడీ సర్కిల్‌ను బలోపేతం చేయడంతో పాటు మైనార్టీ నిరుద్యోగులకు స్టడీ సర్కిల్‌, స్త్రీ సాధికారతకు వారి కాళ్లపై వాళ్లు నిలబడటానికి స్వయం ఉపాధికి శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తానన్నారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు ప్రధాన సమస్యగా మారిన ఇంగ్లీష్‌ ల్యాబ్‌, ఇంజనీరింగ్‌ చేసి ఖాళీగా ఉన్న పట్టభద్రులకు నెలకు ఒక ప్రాంతంలో ప్రావీణ్యం కలిగిన ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్లతో కేరీర్‌ గైడెన్స్‌ కల్పించడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన జర్నలిస్టులకు స్టేషనరీ నిమిత్తం  నెలకు 10 వేల చొప్పున ప్రెస్‌క్లబ్‌లకు అందించడం జరుగుతుందన్నారు. తాను ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత వచ్చే లక్షా 50 వేల వేతనంలో లక్షా 25 వేలను ఆయా సంస్థల నిర్వహణకు ఆర్థికంగా ఉపయోగపడేలా ప్రతీ నెలా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైందని, సరైన వ్యక్తిని ఎన్నుకున్నప్పుడే అది సద్వినియోగం అవుతుందన్నారు. రాజకీయ నాయకులు, కార్పొరేట్‌ సంస్థల అధినేతలు తమ ఆస్తులు పెంచుకోవడానికి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారని విమర్శించారు. గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు వారి అవసరాలను తీర్చి..సంక్షేమానికి పాటుపడే వారిని ఎన్నుకోవాలని సూచించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న తనకు మద్ధతుగా నిలిచి ఎన్నికయ్యేలా సహరించాలని కోరారు. సమావేశంలో న్యాయవాది కె.బాబ్జీ, సత్యప్రసాద్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here