ప్రభుత్వ భూములను విక్రయించే ఆలోచనను విరమించుకోవాలి

0
128
పిసిసి అధికార ప్రతినిధి బాలేపల్లి మురళీధర్‌
రాజమహేంద్రవరం, నవంబర్‌ 18 : రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల అమలుకు, తాను చేసిన వాగ్ధానాల అమలుకు మిషన్‌ బిల్డప్‌ పేరుతో ప్రభుత్వ భూములను విక్రయించి నిధులు సమకూర్చుకోవాలని చూడటం అనైతికమైన చర్య అని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధికార ప్రతినిధి బాలేపల్లి మురళీధర్‌ ఒక ప్రకటనలో విమర్శించారు. నిధులు సమకూర్చుకోవడానికి ఇతర భూములతోపాటు (గురుకులాల) యూనివర్శిటీ భూములను విక్రయించాలనే ఆలోచన సరికాదన్నారు. ఈ చర్య అప్పు చేసి పప్పు కూడు అన్నట్లుగా ఉందన్నారు. గురుకులాలు భావితరాలను జాతికి అందించేటట్లుగా పనిచేసే నిలయాలని, ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే వాతావరణంలో ఉంటేనే విద్య సముపార్జన సంతృప్తికరంగా ఉంటుందని ఆయన అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం విద్యా వ్యవస్థకు గొడ్డలిపెట్టు వంటిదని, వెంటనే ఈ ఆలోచన విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్తు అవసరాలను మరిచి తాత్కాలిక, రాజకీయ ఆలోచనలతో గురుకుల వ్యవస్థను, విద్యా వ్యవస్థను తద్వారా జాతి నిర్మాణాన్ని నిర్వీర్యం చేసి యువతకు అన్యాయం చేయవద్దని ఆయన కోరారు. సంపదను సృష్టించి సంక్షేమ పథకాలు చేపట్టాలే గానీ, భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడే భూములను విక్రయించే ఆలోచనను ప్రజాస్వామ్యవాదులంతా వ్యతిరేకించాలని ఆయన కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here