ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇసుక కొరత

0
181
జగన్‌ సర్కార్‌పై నారా లోకేష్‌ ధ్వజం
రాజమహేంద్రవరం, నవంబర్‌ 6 : రాష్ట్రంలో సిమ్మెంట్‌తో ఇసుక పోటీ పడుతుందని ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని, ఇసుక కొరత వల్ల ఉపాధి కోల్పోయి కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌ ఆరోపించారు. రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని పరామర్శించేందుకు రాజమహేంద్రవరం నగరానికి వచ్చిన నారా లోకేష్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. 2019 మే 30వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారని, ప్రమాణ స్వీకారం చేసిన రెండురోజుల్లో నూతన ఇసుక విధానం తీసుకొస్తామని చెప్పారని అన్నారు. తద్వారా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని అరికడతామని చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పడం జరిగిందన్నారు. 2019కి ముందు తెలుగుదేశం పార్టీ పాలనలో ఒక ట్రాక్టర్‌ ఇసుక రూ.1400నుంచి రూ.1800లు ఉండేదని, ఒక లారీ దాదాపు రూ.10 వేలు ఉండేదని, అటువంటి క్రమంలో నూతన ఇసుక విధానంలో ఒక ట్రాక్టర్‌ ఇసుక దాదాపు రూ.నాలుగు వేలు నుంచి ఆరు వేలు, ఒక లారీ ఇసుక రూ.40 వేలకు పెరిగిందన్నారు. నూతన ఇసుక విధానం పని చేయదని, భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడతారని చెప్పినా పట్టించుకోలేదన్నారు. తెలుగుదేశం పార్టీ పాలనలో అమరావతితోపాటు అనేక నిర్మాణాలు జోరుగా జరుగుతున్నప్పుడు కూడా ఇసుక కొరత ఎదురు కాలేదని, ప్రస్తుతం కనీసం ఒక డ్రైయిన్‌ నిర్మాణం చేపట్టాలన్నా ఇసుక కొరత ఎదురౌతుందన్నారు. గతంలో ఎక్కడైనా నీటి కరువు విన్నాం గానీ, తొలిసారిగా ఇసుక కొరత గురించి వింటున్నామన్నారు. ఈ ఇసుక కొరత వల్ల దాదాపు 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. గత ఐదు నెలల నుంచి ఎక్కడా పనులు దొరకడం లేదనని, కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదనిని, పట్టించుకోకపోగా ప్రభుత్వమే ప్రతిపక్షాలపైనా, కార్మిక సంఘాలపైనా ఎదురు దాడికి పాల్పడుతుందన్నారు. కాకినాడలో ఒక భవన నిర్మాణ కార్మికుడి కుటుంబాన్ని పరామర్శించే తరుణంలో గుంటూరులో మరో కార్మికుడు మృతి చెందిన సమాచారం వచ్చిందని ఆ కార్మికుడి మృతి విచారకరమని అన్నారు. బాధ్యత కల్గిన సంబంధిత శాఖ మంత్రి భవన కార్మికుల పట్ల చాలా చులకనగా మాట్లాడుతున్నారని అన్నారు. ఇప్పటికి 38 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, జగన్‌ ప్రభుత్వం 38 మందిని హత్య చేసిందని ఆరోపించారు. కేజీ బియ్యం రూపాయికి లభిస్తుంటే కేజీ ఇసుక ఐదు రూపాయలు అయిందని, సిమ్మెంట్‌ ధరతో ఇసుక పోటీ పడుతుందని, అన్ని పనులు ఎక్కడకక్కడ స్థంభించిపోయాయన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే ఇసుక దందా జరుగుతోందనిముఖ్యమంత్రికి లేఖ రాయడం నిజం కాదా? అని ప్రశ్నించారు. అమరావతి సాక్షిగా అధికారి పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే వీధి రౌఢీల్లా ఇసుక దందాకు కొట్టుకున్నారని, ఆ పంచాయితీ తేల్చింది జగన్మోహన్‌ రెడ్డి కాదా? అని ప్రశ్నించారు. అన్ని రంగాల్లో రివర్స్‌ గేర్‌లో ఉన్నామని, ఇచ్చిన హామీ ఒకటి, చేసేది మరోకటి అని, మాట తప్పుతూ టిడిపిపై వైసీపీ ఎదురు దాడి చేస్తుందన్నారు. భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ.10 వేలు చొప్పున గత ఐదు నెలలకు రూ.50 వేలు చొప్పున ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇప్పటికి 38 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఈ హత్యలను ప్రభుత్వ హత్యలుగా పరిగణించి ఒక్కో మృతిని కుటుంబానికి రూ.25 లక్షలు చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానం ద్వారా తక్కువ ధరకు ఇసుక సరఫరా చేయాల్సివుందని, ఆ విధానం అమలు చేయాలని, ఇసుక కోసం పోరాటం సాగిస్తామని, భవన నిర్మాణ కార్మికుల తరుపున పని చేస్తామని, వచ్చే శాసన సభ, శాసన మండలిలో ప్రబుత్వాన్ని నిలదీస్తామన్నారు. భారత దేశంలో ఏ పార్టీకి లేనివిధంగా సంస్థాగతంగా కార్యకర్తలకు పార్టీపరమైన రక్షణ కల్పిస్తున్నామని అన్నారు. దొంగ కేసులను పరిష్కరించేందుకు ఒక లీగల్‌ సెల్‌ ఏర్పాటు  చేశామని, తప్పుడు కేసులపై ప్రైవేటు కేసులు వేస్తామన్నారు. న్యాయ పోరాటాన్నిసాగిస్తామని, తమపై ఆబోతుల్లా పడుతున్నారని, కార్యకర్తలు అధైర్యపొద్దని, న్యాయ పోరాటం చేస్తామన్నారు. కార్యకర్తలకు అండగా నిలబడతామన్నారు. సిఎస్‌ని రాత్రికి రాత్రే బదిలీ చేయడం వింతగాఉందన్నారు. దీనిపై ప్రభుత్వం సమాదానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వైకాపాకు చంద్రబాబు నాయుడి హేంగ్‌వర్‌ వదల్లేదని, తెల్లారితే చంద్రబాబు నాయుడు పేరునే స్మరిస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ కలసికట్టుగా ప్రజల సమస్యలపై ముందుకెళ్తుంటే దానిని తప్పుపడితే ఎలా అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్‌, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకటరావు, టిడిపి యువ నాయకులు ఆదిరెడ్డి వాసు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here