ప్రశ్నించే పవన్‌కు సమాధానం చెప్పే బాధ్యత లేదా ?

0
4046
రూ.70 వేల కోట్లపై ఏదీ పోరాటం- జనసేన అధినేతపై గోరంట్ల ఫైర్‌
రాజమహేంద్రవరం, నవంబర్‌ 20 : ప్రశ్నించే పవన్‌ కల్యాణ్‌కు సమాధానాలు చెప్పే బాధ్యత ఉందని, కేంద్రంపై పోరాటం చేస్తానని ప్రకటించిన పవన్‌ ఇప్పుడు కనీసం తాము చేస్తున్న ఉద్యమానికి మద్ధతు కూడా ఇవ్వకపోవడం దారుణం కాదా అని రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల ఫైర్‌ అయ్యారు.  రాష్ట్రానికి 70 వేల కోట్లు రావాలని ఫ్యాక్ట్‌ కమిటీ వేసి తేల్చి చెప్పిన పవన్‌ కేంద్రాన్ని నిలదీయకుండా చంద్రబాబును ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. నగర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజుతో కలిసి గోరంట్ల మాట్లాడారు. పవన్‌ సినిమా హీరోగా కోట్ల రూపాయలు సంపాదించి పన్నులు ఎంత సక్రమంగా కట్టారో చెప్పగలరా అని నిలదీసారు. పవన్‌ ఆస్తులు వాటి రిజిస్ట్రేషన్‌ విలువ ఆధారంగా మార్కెట్‌ రేటు కట్టి రిజిస్ట్రేషన్‌ చేయించారో? లేదో చెప్పాలని డిమాండ్‌ చేసారు. ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌ తాము ప్రశ్నించేవాటికి కూడా సమాధానాలు చెప్పాల్సిందేనన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్న పవన్‌ సిగ్గుపడాలన్నారు. ప్రజారాజ్యం  పార్టీ పెట్టి రాష్ట్రమంతా అన్న చిరంజీవితో కలిసి తిరిగి 14 సీట్లు సాధించుకుని పార్టీని కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టిన పవన్‌ చంద్రబాబును, లోకేష్‌ను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణాలో పవన్‌ ఎందుకు పోటీ పెట్టలేకపోతున్నారో చెప్పాలన్నారు. పంచాయతీ రాజ్‌ శాఖలో సంస్కరణలు తెచ్చి రాష్ట్రంలో పారదర్శకంగా అభివృద్ధి పనులు చేస్తున్న లోకేష్‌ను విమర్శించాలంటే ఇంగిత జ్ఞానం ఉండాలని వ్యాఖ్యానించారు. సిఎం కావాలని కోరుకోవడంలో తప్పులేదని అయితే అసందర్భంగా, అనాలోచితంగా ప్రేలాపనలు పేలితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కోడికత్తి రాజకీయం చేసిన వైకాపా అధినేత జగన్‌ సినిమా కంటే రక్తికట్టేలా నటిస్తున్నారని ధ్వజమెత్తారు. వైసిపి చేసిన డ్రామాను రాష్ట్రమంతా గమనిస్తోందన్నారు.సిబిఐని అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నందునే ఎపికి రాకుండా ఉన్న హక్కుని ఉపయోగించుకున్నామన్నారు. నోట్ల రద్దు, జిఎస్‌టి వంటి పరిణామాల వల్ల దేశంలో ప్రజలు పడిన ఇబ్బందులు అందరికి తెలిసినవేనన్నారు. నియంతృత్వ పోకడలతో పాలన సాగిస్తున్న మోదీని దించేందుకు జాతీయ స్థాయిలో భిన్న పార్టీలను చంద్రబాబు ఏకం చేస్తున్నారన్నారు. అమిత్‌ షా నోట్ల రద్దు సమయంలో లక్షల కోట్లు మార్చుకున్నారని ఆరోపించారు. బీజేపీకి కుమ్మక్కై పవన్‌, జగన్‌లు పదే పదే అవినీతి అంటూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వకుండా అడ్డుకట్ట వేస్తుంటే ఏం చేస్తున్నారని నిలదీసారు.రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పవన్‌, జగన్‌లకు కనిపించడం లేదని అన్నారు. విలేకరుల సమావేశంలో  సమావేశంలో ఆర్యాపురం బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాసరావు, కార్పొరేటర్లు పాలిక శ్రీనివాస్‌, సింహ నాగమణి, టీడీపీ నాయకులు రొబ్బి శేఖర్‌, కురగంటి సతీష్‌, మజ్జి పద్మ, మార్గాని సత్యనారాయణ, బెజవాడ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here