ప్రస్తుత పరిస్థితుల్లో ఫూలన్‌దేవే స్ఫూర్తి 

0
126
స్త్రీ సమాజానికి నక్కా శ్రీనగేష్‌ పిలుపు -యాక్ట్‌ ఆఫ్‌ ఫూలన్‌ తేవాలి
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 4 :  ధీర వనిత ఫూలన్‌దేవి నుంచి స్త్రీ సమాజం స్ఫూర్తి పొందాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నక్కా శ్రీనగేష్‌ సూచించారు. తనపై 22 మంది రాజ్‌పుట్‌, ఠాకూర్‌లు పాశవికంగా అత్యాచారం చేసినా కోలుకుని పూలన్‌దేవిగా మారి తుపాకీ పట్టి వారిని హతమార్చిన ఆమె ధీరత్వాన్ని నేటి మహిళా లోకం అలవర్చుకోవాలన్నారు. 11 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించిన తరువాత ములాయంసింగ్‌ యాదవ్‌ పిలుపు మేరకు సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బెహ్మాయ్‌ గ్రామానికి చెందిన ఆమె ఫతేపూర్‌ నుంచి రెండు దఫాలు పార్లమెంట్‌ సభ్యురాలిగా కూడా ఎన్నిక కావడం గర్వకారణమన్నారు. స్థానిక సుబ్బారావు పేటలో ఉన్న ఆయన నివాసం వద్ద ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో నగేష్‌ మాట్లాడుతూ ఆమెను స్ఫూర్తిగా తీసుకుంటే మహిళలు అబలలు కాదు.. అత్యంత శక్తిమంతులని రుజువవుతుందని పేర్కొన్నారు.  ఇప్పుడు పార్లమెంట్‌లో గతంలో నిర్భయ, ఇప్పుడు జస్టిస్‌ దిశతో చర్చలు సాగిస్తున్న ఎంపీలు పూలన్‌దేవి జీవితంపై మాట్లాడం ఎందుకు చర్చించడంలేదని ప్రశ్నించారు. అది జరిగిన చరిత్ర కాదని.. వాస్తవ జీవిత గాధ అన్నారు. దేశంలో ఏదైనా ఘటన జరిగిన తరువాత కఠిన చట్టాలు తేవాలని పార్లమెంట్‌లో మాట్లాడుతున్న నాయకులందరూ పూలన్‌ జీవితంపై చర్చించాలని సూచించారు. ఆమె ఒక లెజెండ్‌ అని కొనియాడారు. ఎలిమెంటరీ నుంచి పీజీ వరకు ఆమె జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని డిమాండ్‌ చేసారు. తనను అత్యాచారం చేసిన వారిపై నీతివంతమైన తిరుగుబాటు చేసి పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎదిగిన ఆమెను చూసి చాలా పాఠాలు నేర్చుకోవాలన్నారు. ఏం జరిగినా ఏదో టైటిల్‌ పెట్టి దోషులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్‌ చేయడమే తప్ప చట్టాలు అమలు చేయడంలో చిత్తశుద్ధి పాలకుల్లో కనిపించడం లేదన్నారు. యాక్ట్‌ ఆఫ్‌ పూలన్‌ను తీసుకొచ్చి కఠినంగా అమలు చేస్తే తప్ప ఇటువంటి నేరాలకు పాల్పడేవారిలో మార్పు రాదన్నారు. ఆమె చేసింది వ్యక్తిగతమైనా  ప్రభుత్వాలు వ్యవస్థాగత నిర్ణయాలు తీసుకుని చట్టాలు తీసుకొచ్చి.. అమలు చేయాలని విజ్ఞప్తి చేసారు. సమావేశంలో మాజీ ఫ్లోర్‌లీడర్‌ పోలు విజయలక్ష్మి, వైఎస్‌ఆర్‌ సిపి నాయకులు సంకిస భవానీ ప్రియ, పతివాడ రమేష్‌బాబు, కాటం రజనీకాంత్‌, గుడాల ప్రసాద్‌,గుడాల ఆదిలక్ష్మి, శౌరి నాధన్‌, నిరీక్షణ జేమ్స్‌, సుజ్ఞానకుమారి, బుద్ధాల కుమార్‌, అరుణ్‌ జెకె తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here