ప్రాధాన్యత ఇచ్చే పార్టీకే మద్దతు ఇస్తాం 

0
219
11న శెట్టిబలిజ మహానాడు – కన్వీనర్‌ కుడిపూడి సూర్యనారాయణరావు
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 31 : ఉభయగోదావరి, విశాఖ జిల్లాలకు కలిపి శెట్టిబలిజ సామాజికవర్గానికి 10 అసెంబ్లీ, 2 పార్లమెంట్‌, 3 ఎంఎల్‌సి స్ధానాలు కేటాయించాలని రాష్ట్ర శెట్టిబలిజ మహానాడు కన్వీనర్‌ కుడిపూడి సూర్యనారాయణరావు డిమాండ్‌ చేశారు. స్ధానిక శ్రీకన్య గ్రాండ్‌లో ఈరోజు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కూడిపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ నవంబర్‌ 11న అమలాపురంలో నిర్వహిస్తున్న ఉభయ రాష్ట్రాల శెట్టిబలిజ మహానాడు ద్వారా ఉభయ రాష్ట్రాలకు చేయనున్న డిమాండ్‌లను వివరించారు. రాష్ట్రంలో కాపులతో సమానంగా శెట్టిబలిజ సామాజికవర్గం ఉందని, కావునా శెట్టిబలిజ యువత విద్య, ఉద్యోగ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధికి ప్రతి ఏటా రూ.2వేల కోట్ల చప్పున ఐదేళ్ళకు రూ.10వేల కోట్లతో శెట్టిబలిజ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణా రాష్ట్రంలో శెట్టిబలిజలను బీసి జాబితానుండి తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే శెట్టిబలిజలను బిసి జాబితాలో చేర్చి, కుల ధ్రువీకరణ పత్రాలు అందజేయాలన్నారు. శెట్టిబలిజ మహిళలకు 2 అసెంబ్లీ స్ధానాలు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. శెట్టిబలిజ బాలబాలికలకు ఉచితంగా కేజీ నుండి పిజి వరకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతి డివిజన్‌  కేంద్రంలోనూ 10 ఎకరాల స్ధలం కేటాయించి, రెసిడెన్షియల్‌ విద్యను అందించాలన్నారు. కల్లుగీత వృత్తి క్షీణిస్తున్న తరుణంలో వాటిస్తానే 20 శాతం మద్యం షాపులు శెట్టిబలిజలకు కేటాయించాలన్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కాపులకు నిర్మిస్తున్న విధంగానే శెట్టిబలిజలకు కళ్యాణమండపాలు నిర్మించాలన్నారు. శెట్టిబలిజలలో ఎంతో మంది చదువుకున్న వారు ఉన్నప్పటికీ ఇంతవరకు ఒక్క విశ్వవిద్యాలయానికి కూడా ఉప కులపతిగా అవకాశం ఇవ్వలేదని, కనీసం ఇద్దరికి ఉపకులపతిగా అవకాశం ఇవ్వాలన్నారు. అలాగే సెనెట్‌ కమిటీ, సిండికేట్‌ కమిటీల్లో సభ్యులుగా అవకాశం కల్పించాలన్నారు. నామినేటెడ్‌ పోస్టులలో శెట్టిబలిజలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తాము అడిగిన సీట్లను కేటాయించే పార్టీనే గెలిపించుకుంటామన్నారు. ఇప్పటికే తాము అడిగిన సీట్లు ఇచ్చేందుకు 2 జాతీయ, ఒక ప్రాంతీయ పార్టీ సముఖుత చూపాయన్నారు. 11న జరిగే శెట్టిబలిజ మహానాడుకు పెద్దఎత్తున సంఘీయులు హాజరై సత్తాను చాటాలన్నారు. శెట్టిబలిజకు కాకుండా గౌడకు సీటిచ్చిన చోట తమ సామాజికవర్గం వారిని నిలబెడతామన్నారు. రాజ్యాధికారానికి గౌడలు ఒక మెట్టుకు దూరంలో ఉంటే, శెట్టిబలిజలు మొదటి మెట్టుమీదే ఉన్నారన్నారు. అందుకు శెట్టిబలిజల నాయకత్వలోపమే కానీ, గౌడలు తమను మోసం చేసారని కాదని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.  ప్రముఖ బీసీ నాయకుల వాసంశెట్టి గంగాధరరావు మాట్లాడుతూ వెనుకబడిన శెట్టిబలిజ సామాజికవర్గానికి రాజ్యాంగపరంగా రావాల్సిన హక్కులను సాధించడం కోసమే శెట్టిబలిజ మహానాడు నిర్వహిస్తున్నామన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు తమ సత్తాను చాటుతామన్నారు. విలేకరుల సమావేశంలో సానబోయిన రామారావు, వాసంశెట్టి రాజగోపాల్‌, అప్పారి జయప్రకాష్‌, ఇళ్ళ శివప్రసాద్‌, కొప్పిశెట్టి నారాయణమూర్తి, నెల్లి సర్వేశ్వరరావు, పిల్లి వెంకటరమణ, మురపా అప్పారావు, కడలి రామకృష్ణ, పిల్లి నిర్మల, పితాని కుటుంబరావు, డాక్టర్‌ అనుసూరి పద్మలత తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here