ప్లాస్టిక్‌ రహితంగా రైల్వే స్టేషన్లు 

0
245
దక్షిణ మధ్య రైల్వే జిఎం గజానన్‌ మాల్యా
సమస్యలపై వినతిపత్రం సమర్పించిన ఎంపి భరత్‌
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 18 : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లను నో ప్లాస్టిక్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా వెల్లడించారు. రాజమహేంద్రవరం  రైల్వే స్టేషన్‌ను ఈరోజు ఆయన రైల్వే అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండువారాల పాటు అన్ని రైల్వే స్టేషన్లలో ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని రైల్వే జోన్లలోనూ ఈ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ముఖ్యంగా రైల్వే అధికారులు, ఉద్యోగులు, ప్రయాణీకులు, స్థానిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులను కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. రైల్వే స్టేషన్లను పరిశుభ్రంగా ఉండటం ద్వారా ప్రయాణీలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రయాణం సాగించేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి భరత్‌రామ్‌ రైల్వే జిఎంని కలిసి పలు సమస్యలపై వినతి పత్రం అందచేసారు. ప్రధానంగా తూర్పు రైల్వే స్టేషన్‌ వైపున ప్లాట్‌ఫారమ్‌ను విస్తరించాలని, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద డ్రైనేజీ నుంచి మురికినీరు ప్రవహించి ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నందున రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి జిఎంకు ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రతిష్టాత్మకమైన రోడ్‌ కమ్‌ రైల్వే బ్రిడ్జి నిర్వహణ బాధ్యతలను ఆర్‌ అండ్‌ బి శాఖకు అప్పగిస్తే పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కొవ్వూరు-భద్రాచలం కొత్త లైను, మూడో రైల్వే బ్రిడ్జిపై కొత్త లైను నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసారు. ఈ విన్నపాలపై జిఎం సానుకూలంగా స్పందించారని ఎంపీ భరత్‌రామ్‌ అన్నారు. ఆయన వెంట అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి, రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ పి.శ్రీనివాస్‌, సీనియర్‌ డిఓఎం వి.ఆంజనేయులు, సీనియర్‌ డిఎస్‌టిఇ ఆర్‌.విశ్వనాధ్‌ రెడ్డి, సీనియర్‌ డిఎంఇ కె.శ్రీనివాస్‌, సీనియర్‌ డిఇఇ గజేంద్రకుమార్‌, ఎస్‌.మునిరెడ్డి, విజయవాడ ఎసిఎం కె.కమలాకర్‌ బాబు,రాజమండ్రి రైల్వే స్టేషన్‌ చీఫ్‌ టిక్కెట్‌ ఇనస్పెక్టర్‌ కేశవభట్ల శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here