ఫింఛన్ల రద్దే జగన్‌ ప్రభుత్వ పతనానికి నాంది

0
214
జగన్‌ తీరుపై తీవ్రంగా మండిపడ్డ గోరంట్ల
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 4 : రాష్ట్రంలో ఏడు లక్షల పింఛన్ల రద్దే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పతనానికి నాందిగా నిలుస్తుందని రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చియ్యచౌదరి అన్నారు. అసలు రాష్ట్రం ఎటుపోతోందో అర్థం కావడం లేదని పాలనా తీరుపై ధ్వజమెత్తారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో  జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వికలాంగులు, వృద్ధులు, వితంతువుల పింఛన్లు రద్దు చేయడం కంటే దారుణం మరొకటి ఉండదన్నారు. జగన్‌ నియమించిన వలంటీర్లు, ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ఏం చేస్తోందని ప్రశ్నించారు. జగన్‌ ఈ విధంగా డిక్టేటర్‌గా వ్యవహరించడం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా ఆయన తన పాలనా తీరును మార్చుకుని 8 నెలల కాలంలో జరిగిన తతంగంపై దృష్టిసారించి సరిదిద్దుకుంటే మంచిదన్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకి నాశనం అవుతోందని, పారిశ్రామిక వేత్తలు, ఆర్థిక సంస్థలు రాష్ట్రానికి రావడానికి భయపడే పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. రోజుకొక కొత్త సమస్యను సృష్టిస్తూ రాష్ట్రాన్ని సమస్యల సుడిగుండంలోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నత్తవేగం కంటే దారుణంగా నడుస్తోందన్నారు. ఎడమ కాలువ నిర్మాణంలో ఉండగా మళ్లీ పైప్‌లైన్‌ నిర్మాణం చేయడం ఎందుని ప్రశ్నించారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి జగన్‌ తోడుదొంగల్లా మారారని, పైప్‌లైన్‌ కాంట్రాక్టునకు కేసీఆర్‌ తాలుకా సంస్థలకు కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారని ఆరోపించారు. 151 మంది ఎమ్మెల్యేలను, 22 ఎంపీలను బంగారు పళ్లెంలో పెట్టి అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని ఆధోగతి పాలు చేస్తున్న ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. ఎందుకు ప్రత్యేకా ¬దా, రాష్ట్రానికి రావాల్సిన నిధులు అడగలేకపోతున్నారని నిలదీసారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తే తమను ఇడి/ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేసుల విచారణను త్వరితగతిన పూర్తిచేసి ఎ1, ఎ2లను జైల్లో వేస్తారని భయమేస్తోందా అని ప్రశ్నించారు. మూడు రాజధానుల పేరుతో విశాఖలో భారీఎత్తున భూ కబ్జాలు, దోపిడికి వైసిపి నేతలు పాల్పడుతున్నారన్నారు. వైకాపా నాయకులు పులివెందుల వ్యక్తులతో కలిసి ఇసుక, మట్టి, మైనింగ్‌, మద్యం మాఫియాలు చేస్తూ దర్జాగా జే-ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, శెట్టిబలిజ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పాలిక శ్రీనివాస్‌, మాజీ కార్పొరేటర్లు నక్కా చిట్టిబాబు, మాటూరి రంగారావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here