బంగారు కేబేజీలు – వెండి కాలీఫ్లవర్లు

0
393

మనస్సాక్షి – 1078

‘నా జన్మభూమి ఎంతో అందమయిన లోకం..’ అంటూ పాట వినిపించింది. ఆ వెనుకే ఆ పాట ఓనరు.. అదే.. పాట పాడుతున్న వెంకటేశం దిగబడ్డాడు. దాంతో గిరీశం అదిరిపోయి ”ఏవివాయ్‌ వెంక టేశం.. దేశభక్తి కుసింత ఎక్కువయి నట్టుందే..” అన్నాడు. వెంకటేశం తల అడ్డంగా ఊపి ”యిదేవీ దేశభక్తి కాదులే గురూగారూ… అంతకంటే దేశానికి వెన్నె ముకలాంటి రైతుభక్తిలెండి” అన్నాడు. గిరీశం తలూపి ”అయినా ఉన్నట్టుండి యింత ప్రేమేంటోయ్‌.. నీకా వ్యవసాయా లవీ అంతగా పడదు కదా” అన్నాడు. వెంకటేశం నవ్వేసి ”ఓ రకంగా అంతే అను కోండి. అయితేనేం.. ఎంతయినా రైతు బాగుం టేనే కదా వ్యవస్థ బాగుండేది” అన్నాడు. ఈలోగా గిరీశం చుట్ట అంటించుకుని ”యిదిగో.. యిప్పటికయినా నిజం చెప్పవోయ్‌.. ఉన్నట్టుండి రైతులంటే నీకు ఎందుకంత ప్రేమ పుట్టినట్టంట?” అన్నాడు. అప్పుడు వెంకటేశం వివరంగా చెప్పడం మొదలెట్టాడు. ”మరేం లేదు గురూగారూ నేను యింతకు ముందే ఎమ్మే ఎకనమిక్స్‌ చేశాను. యిప్పుడు పీహెచ్‌డీ చేద్దామనుకుంటున్నా. దాని కోసం మన దేశానికి వెన్నె ముకలాంటి రైతు పరిస్థితి మీద ఓ ధీసీస్‌ చేయడానికి ప్రపోజల్‌ సబ్మిట్‌ చేశా” అన్నాడు. గిరీశం తలూపి ”బావుందోయ్‌.. ఎలాగూ మీ నాన్నా వాళ్ళది వ్యవసాయమే కదా.. పంటకి ఎకరాకి ఎంత మిగులుతుంది లాంటి వివరాలన్నీ అక్కడ్నుంచే తీసుకోవచ్చు కదా” అన్నాడు. వెంకటేశం తలూపి ”ఆ.. అదీ అయిందిలెండి. ఆయన చెప్పింది వింటుంటే బొత్తిగా నీరసం వచ్చేస్తుందనుకోండి. ఎకరాకి పండే పంట అంతంత మాత్రమే. అదీ.. అన్ని పరిస్థితులూ బాగుండి, అదృష్టం తోడుండి, దేవుడు దయతలిస్తేనే.. యిది మానాన్న వెర్షనే కాదు. దాదాపు అందరి రైతుల మాటా యిదే..” అన్నాడు. గిరీశం తలూపి ”మరికేం.. ఆ వివరాలన్నీ తీసుకుని థీసిస్‌ సబ్మిట్‌ చేసెయ్‌” అన్నాడు. వెంకటేశం తల అడ్డంగా ఊపి ”అబ్బే.. అదేం పనికొచ్చేలా లేదు. అసలు వాళ్ళు ఆ పంటలు పండించడానికి పడే కష్టం, పెట్టిన పెట్టుబడి, ఆనక పంట చేతికొచ్చాక మిగిలిందీ చూస్తే నీరసం వచ్చేస్తుంది గురూగారూ.. అయినా నేను సబ్మిట్‌ చేసే రిపోర్ట్‌ ఏదో యిలా వాళ్ళు చెప్పిందాన్ని బట్టుంటే సరిపోదు. అథెంటిక్‌గా ఉండాలి” అన్నాడు. దాంతో గిరీశం ”అయితే ఓ పని చేద్దాం. మనం పోయి రామ్మోహన్‌ని కలుద్దాం. నీక్కావలసిన యిన్ఫర్మేషనేదో ఆయనే యిస్తాడు” అన్నాడు. వెంకటేశం ఆ రామ్మోహన్‌ ఎవరా అన్నట్టుగా చూశాడు. ఈలోగా గిరీశం పైకి లేస్తూ ”అదేంటీ… రామ్మోహన్‌ తెలీదా… నా ఫ్రెండ్‌లే. ఐఆర్‌ఎస్‌ సెలక్ట్‌ అయ్యా, ఇప్పుడు ఇన్‌కంటాక్స్‌ కమీషనర్‌ అయ్యాడులే” అన్నాడు. అంతేకాదు. అప్పటికప్పుడే వెంకటేశాన్ని తీసుకుని రామ్మోహన్‌ యింటికి బయల్దేరాడు.

——-
గిరీశాన్ని చూడగానే రామ్మోహన్‌ సాదరంగా ఆహ్వానించాడు. ”ఏరా.. ఉన్న ట్టుండి గుర్తొచ్చానా.. కొంపదీసి మా డిపార్ట్‌మెంటుకి సంబంధించిన ఆబ్లికేషన్‌ ఏదయినా పట్టుకొచ్చావా?” నేనొప్పుకోను అన్నాడు. దాంతో గిరీశం నవ్వేసి ”అలాంటి జోకులెయ్యకురా. అయినా నేనేవీ అంత ఎడాపెడా సంపాయిం చెయ్యడం లేదు లేరా.. నేనొచ్చింది యింకో చిన్న పని మీదలే. వీడు నా బావమరిది వెంకటేశం. పీహెచ్‌డీ కోసం ఏదో ప్రాజెక్టు చేయాలంట. దాని కోసం నీ సాయం కావాలి” అన్నాడు. ఈలోగా వెంకటేశం తను చేస్తున్నదీ, తనక్కావలసిందీ చెప్పాడు. అంతా విన్న రామ్మోహన్‌ ”నీకు కావలసిన యిన్ఫర్మేషన్‌ అంతా నేనివ్వగలను. మరేంలేదు. రిటర్న్‌లు సబ్మిట్‌ చేసి నప్పుడు వాటిలో వ్యవసాయానికి సంబంధించిన ఆదాయం చూపిస్తుంటారు. అంటే మరేంలేదు. ఎన్ని ఎకరాల పంట మీద ఎంత పెట్టుబడి పెట్టిందీ, ఎంత ఆదాయం వచ్చిందన్నదీలాంటివన్నమాట. ఆ వివరాలన్నిటితో నీ థీసిస్‌ ఏదో తయారు చేసేయొచ్చు” అన్నాడు. దాంతో వెంకటేశం హుషారుగా ”చాలా థేంక్స్‌ సార్‌.. అవయితే తిరుగుండదు” అన్నాడు. యింతలో రామ్మోహన్‌ ”అయితే అలా నేను అనఫీసియల్‌గా వివరాలు యిస్తే అల్లరవచ్చు. అందుకే రైట్‌ టు యిన్ఫర్మేషన్‌ ఏక్ట్‌ కింద ఆ వివరాలు కావాలని ఓ లెటర్‌ పెట్టెయ్‌.. అప్పుడింక ఏ యిబ్బందీ లేకుండా ఆ వివరాలు నేను నీకు యిచ్చేస్తా” అన్నాడు వెంకటేశం తలూపాడు.

——

వెంకటేశం తన ముందున్న పేపర్ల వంక ఆనం దంగా చూసుకున్నాడు. అవన్నీ వేర్వేరు వ్యక్తుల ఐ.టి.రిటర్న్‌లకి సంబంధించినవి. అవన్నీ సొసైటీలో మంచి పొజిషనల్లో ఉన్న డాక్టర్లు. లాయర్లు, యింకా యితర బిజినెస్‌ టైకూన్లకి సంబంధించినవి. అయితే ఆశ్చర్యకరమయిన విషయం ఏంటంటే.. ఆ అందరికీ వచ్చే ఆదా యంలో ఎక్కువ భాగం తమకున్న పొలాల్లో పంటల నుంచే వస్తున్నాయి..! అవన్నీ చూస్తుంటే వెంకటేశానికి మతిపోతోంది. ముందుగా వాటిలో డాక్టర్‌ దైవాధీనం గారి రిటర్న్‌ తీశాడు. సదరు దైవాధీనం అయితే ఊళ్ళో బ్రహ్మాండమయిన హాస్పిటల్‌ నడుపుకుంటూ ఎడాపెడా సంపా దిస్తున్నాడు. అయితే రిటర్న్‌లో చూపించింది. ఆ హాస్పిటల్‌ వలన వచ్చే ఆదాయమేదో నామ మాత్రంగా ఉందనే. అసలయిన ఆదాయ మంతా వస్తున్నట్టుగా చూపించింది తన పొలాల్లో వచ్చే పంటవలనే. ఒకో ఎకరాకి వందకి పైగా బస్తాలు పంట పండుతున్నట్టుగా చూపిస్తున్నాడు. దాంతో పంటల నుంచి ఆదాయం యిబ్బడిముబ్బడిగా వచ్చిపడిపోతోంది. ఒక్క దైవాధీనం అనే కాదు. దాదాపు మిగతా అందరి రిటర్న్‌లూ అలాగే ఉన్నాయి. అందరూ ఎకరాకి లక్ష రూపాయల ఆదాయం సంపాదించేస్తున్నారు. వెంకటేశం ఆ వివరాలన్నీ రాసు కున్నాడు. తర్వాత తీరిగ్గా వాళ్ళయిళ్ళకి బయల్దేరాడు. ముందుగా పోయి డాక్టర్‌ దైవాధీనాన్ని కలుసుకున్నాడు. ”సార్‌.. మీరు ఎకరాకి లక్షకి పైగా సంపా దిస్తున్నారు కదా. ఆ సీక్రెట్‌ ఏంటో చెబితే ఎందరో రైతులకి మేలు చేసినట్టవుతారు” అన్నాడు. దానికి దైవాధీనం అసహనంగా ”అవన్నీ నీకెం దుకు చెప్పాలంట?” అన్నాడు. దాంతో వెంకటేశం ”అయితే ఐ.టి. కమీషనర్‌ గారితో ఫోనులో మాట్లాడిస్తానుండండి” అన్నాడు. దాంతో దైవాధీనం ”అబ్బే.. యింతదానికి ఆయన దాకా ఎందుకూ.. నేను చెబుతాగా.. వ్యవసాయం నేను స్వయంగా పొలానికెళ్ళి చేయనుగానీ ఫోన్‌ ద్వారానే మా వాళ్ళకి సలహాలిచ్చి చేయిస్తుంటాను” అన్నాడు. అక్కడ్నుంచి వెంకటేశం వెళ్ళి మిగతావాళ్ళనీ కలిశాడు. అయితే దాదాపు అందరి నుంచీ అదేలాంటి సమాధానం..! అంతా అయింతర్వాత అప్పుడు వెంకటేశం తన ఫైనల్‌ థీసిస్‌ తయారు చేశాడు. ‘మన దేశ ఆర్థిక వ్యవస్థకి ఊతమిచ్చేది వ్యవసాయమే. అలాంటి వ్యవసాయం చేయడంలో రైతులకున్న పరిజ్ఞానం, నైపుణ్యం అంతంతమాత్రమే అని తెలుస్తోంది. అసలయితే వ్యవసాయం చేయగలిగేదీ, చేయగలిగే సత్తా ఉన్నదీ రైతులు కాదు. బడాబడా వ్యాపారస్తులు డాక్టర్లు, లాయర్లు, యింకా యితరత్రా అనేకమంది ప్రొఫెష నల్స్‌ రైతులు ఎవరయినా తమ పొలాల్లో ఎకరాకి కనాకష్టంగా ముప్పై బస్తాల పంట పండించి ఓ పదీ, పదీ, యిరవై వేలు మిగుల్చుకుంటున్నారు. అదే పైన చెప్పిన వాళ్ళని తీసుకుంటే వాళ్ళు ఎకరాకి వంద బస్తాల పంట పండిస్తు న్నారు. దాదాపు లక్ష దాకా ఆదాయం సంపాదిస్తున్నారు. యింకో ముఖ్య మయిన విషయం.. పంటలో యింతేసి దిగుబడి ”రావాలంటే స్వయంగా పొలానికి వెళ్ళి వ్యవసాయం చేస్తే కుదరదు. ఫోన్‌లో సూచనల ద్వారానే ఆ వ్యవసాయమేదో చేయించాలి’.. యిలా సాగిందది.

——

”అది గురూగారూ.. నాకొచ్చిన కల. అయినా మరీ యింత అధ్వాన్నపు కలొ చ్చిందేంటంటారు? కొంపదీసి ఏ రాంగోపాలవర్మయినా నా ఆలోచనల్లో దూరాడంటారా?” అన్నాడు వెంకటేశం. దానికి గిరీశం నవ్వేసి ”ఆ..యిందులో అంత పైత్యం ఏం లేదోయ్‌… యిదేదో నడుస్తున్న చరిత్రే. మన చుట్టూ ఉన్న సొసైటీలో వేర్వేరు వృత్తుల్లో ఉన్న పెద్ద పెద్ద తలకాయలు తమ ఐ.టి. రిటర్న్‌లలో యిదంతా చూపిస్తున్నారు. అందుకే నేను చెప్పేది ఒకటేనోయ్‌.. పాపం రైతులు పగలనకా, రాత్రనకా పంట పండిస్తున్నా తగిన ప్రతిఫలం పొందలేకపోతున్నారు. యింకో పక్క ఆత్మహత్యలూ తప్పడం లేదు. అందుకే యిప్పటికయినా ఆ పెద్ద తలకాయలు పెద్ద మనసు చేసుకుని రైతులకి వ్యవసాయం ఎలా చేయాలో ఫోన్లో సూచనలిస్తే దేశంలో రైతుల ఆత్మ హత్యలు ఆగిపోతాయి. రైతన్న ప్రతివాడూ ధనవంతుడయిపోతాడు. దేశ ఆర్థిక వ్యవస్థా పటిష్టమవుతోంది” అన్నాడు. గిరీశం చెప్పింది వినేసరికి వెంకటేశం నోరెళ్ళబెట్టాడు. మనసులో మాత్రం ‘ఎంతయినా గురువుగారికి వేళాకోళం ఎక్కువే’ అని అనుకుంటూ బయటికి నడిచాడు.

– డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here